సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 16:39:07

అంగన్‌వాడీ కేంద్రాల్లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి : మంత్రి సత్యవతి

అంగన్‌వాడీ కేంద్రాల్లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి : మంత్రి సత్యవతి

హైదరాబాద్‌ : పిల్లలు, బాలింతలు, గర్బిణీలుండే అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్‌ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టినా, మహిళా-శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యతో నగరంలోని డీఎస్‌ఎస్‌ భవనంలో మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 నుంచి 11 గంటల లోపు వండి వేడివేడిగా తల్లులకు, పిల్లలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి వారిని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలన్నారు. 


అంతేకాకుండా విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు ఎవరైనా గ్రామాల్లో ఉంటే వెంటనే వారి సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ మూడు జిల్లాలకు విదేశాల నుంచి ఎవరైన వస్తే గట్టి నిఘా ఉంచి క్వారంటైన్‌ చేయాలన్నారు. వీలైనంత వరకు సమావేశాలు, సభలు లేకుండా చూడాలని ఆయా జిల్లాల ఎస్పీలకు మంత్రి ఆదేశాలిచ్చారు.


logo