ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 18:58:24

మ‌హిళా ర‌క్ష‌ణ కేంద్రాలుగా అంగ‌న్‌వాడీలు : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

మ‌హిళా ర‌క్ష‌ణ కేంద్రాలుగా అంగ‌న్‌వాడీలు : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని అంగ‌న్‌వాడీల‌ను మ‌హిళా ర‌క్ష‌ణ కేంద్రాలుగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు రాష్ర్ట గిరిజ‌న‌, మ‌హిళా-శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాల రాష్ట్ర స్థాయి సమావేశం శ‌నివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు రాష్ట్రంలో మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సఖీ కేంద్రాలను అందుకనుగుణంగా బలోపేతం చేస్తున్న‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్‌లో షీ-టీమ్స్ ప‌నితీరు వల్ల మహిళల పట్ల దాడులు చేయడానికి భయప‌డుతున్నార‌న్నారు.  గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కూడా షీ టీమ్స్ వలె తయారు కావాలన్నారు. పోలీసు, న్యాయ, వైద్య శాఖలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమన్వయం చేసుకుని ఈ లక్ష్య సాధన కోసం పనిచేస్తుందన్నారు. 

మన దగ్గర ఉన్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ‌శాఖలోని 64 వేల మంది సైన్యాన్ని మహిళలకు భరోసా కల్పించే విధంగా తయారు చేయాలన్నది ఇపుడు త‌న ముందు ఉన్న లక్ష్యం అన్నారు. అంగన్‌వాడీల ద్వారా ఇచ్చే అన్ని సేవలతో పాటు మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలుగా సఖీ సెంటర్లను అభివృద్ధి పర‌చాల‌న్నారు. గతంలో ఊర్లలో పోలీస్ పటేల్ వ్యవస్థ ఉండడం వల్ల ఊర్లో చాలా సమస్యలకు అక్కడే పరిష్కారం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. అయితే ప్రతి ఊరికి ఒక పోలీస్ ఉండే ఆలోచన చేస్తున్నారు. ఈ పోలీస్ ఊర్లో బలాదురుగా తిరిగే పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిని సరైన దారిలో పెట్టడం వంటివి చేస్తార‌న్నారు. ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తల కంటే మగ పిల్లలలకు ఆడపిల్లల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో త‌ల్లిదండ్రులు చెప్పాల‌న్నారు. 

మహిళా ఆదాలత్‌లు ప్రతి నెలలో పెట్టాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. భరోసా కేంద్రాలు 33 ఉండాలని ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు. సఖీ కేంద్రాలతో వాటిని అనుసంధానం చేయడం వల్ల మహిళకు ఒకే కేంద్రంగా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం ఏర్పడుతుంద‌న్నారు. సఖీ కేంద్రాలు ఉన్నట్టు మన రాష్ట్రంలో అందరికీ తెలిసేలా ప్రచారం కల్పించడం చాలా ముఖ్యం. 1098, 181 గురించి నెంబర్లు ఎక్కువ మందికి తెలిసేలా చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సఖీ కేంద్రాలను బలోపేతం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ డి. ఐ.జీ బడుగుల సుమతి, మహిళాభివృద్ధిశాఖ అధికారులు, జిల్లాల సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.