శనివారం 11 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 18:59:10

త్వరలో దూరదర్శన్, టీ సాట్ ద్వారా అంగన్ వాడీ పాఠాలు

త్వరలో దూరదర్శన్, టీ సాట్ ద్వారా అంగన్ వాడీ పాఠాలు

హైదరాబాద్ : త్వరలో అంగన్ వాడీ పాఠాలు దూరదర్శన్, టీ సాట్ ద్వారా ఆన్ లైన్ లో అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో చిన్న పిల్లలకు కావాల్సిన నీతి కథలు, విజ్ఞాన విషయాలు ఇంటి నుంచే నేర్పించేందుకు ఈ ఆన్ లైన్ విధానం బాగా ఉపయోగపడుతుందని భావించి, దూరదర్శిని టీవీ, టీ సాట్ ద్వారా వీటిని అందించేందుకు పాఠ్యాంశాలు సిద్ధం చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు వివరించారు. 

కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్ వాడీ సరుకులు, ఇతర సేవలపై హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి, ఆ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, టీఎస్ ఫుడ్స్ ఇన్ చార్జి క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి సమీక్ష చేశారు. ఆహార కొరతను అధిగమించిన తెలంగాణ పోషకాహార కొరతను కూడా అధిగమించాలన్న సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు అంగన్ వాడీల్లో పిల్లలకు అందించే మురుకులను మరింత పోషకాహారంగా తయారు చేయాలన్నారు.

లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇచ్చే పాలు, గుడ్లు, పప్పులు, నిత్యావసర వస్తువులు ఆర్టీసి కార్గో బస్సులు, ఇతర వాహనాలతో సాధారణ సమయం కంటే ఎక్కువ శాతం పంపిణీ జరిగినట్లు కమిషనర్ దివ్య, మంత్రికి వివరించారు. అలాగే ఇంటింటికి అంగన్ వాడీ సరుకుల కార్యక్రమం విజయవంతం అయిందని, గ్రామాల్లో కూడా మంచి స్పందన వచ్చిందన్నారు.  


logo