e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides ఒమేగా లేదు…నెత్తురూ లేదు!

ఒమేగా లేదు…నెత్తురూ లేదు!

ఒమేగా లేదు…నెత్తురూ లేదు!
  • హైదరాబాద్‌ బడి పిల్లల దైన్యం
  • ఎన్‌ఐఎన్‌ తాజా సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని పాఠశాలల పిల్లల్లో ఒమేగా ఆమ్లాలు తక్కువగా ఉంటున్నాయి. మాంసాహారుల్లో కూడా ఈ లోపం కనిపిస్తున్నది. దాదాపు 52 శాతం మంది పిల్లలను ఏదో ఒకస్థాయిలో రక్తహీనత సమస్య వెంటాడుతున్నది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది. నాడీ వ్యవస్థ, మెదడు, గుండె పనితీరును మెరుగు పరచడంతోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే ఒమేగా ఆమ్లాలు లభించే పదార్థాలను పాఠశాల విద్యార్థులు తగినంత తినడం లేదని సర్వే తేల్చింది. బడి పిల్లల్లో ఒమేగా-3 పాలీ అన్‌ స్టార్టడ్‌ (పీయూఎఫ్‌ఏ) ఫ్యాటీ ఆమ్లాలు, డొకోసాహెక్సేనోయిక్‌ ఆమ్లం (డీహెచ్‌ఏ), ఎకోసాపెంటానోక్‌ (ఈపీఏ), అప్లా-లినోలెనిక్‌ ఆసిడ్‌ (ఏఎల్‌ఏ) శాతం తక్కువగా ఉన్నట్టు బయటపడింది.

సాధారణంగా ఏడాది నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు వారానికి కనీసం 200 గ్రాముల చేపల తినాలి. కానీ, ఎక్కువ మంది నెలకు వంద గ్రాముల చేపలు మాత్రమే భుజిస్తున్నారు. గుడ్డు తినే అలవాటున్న పిల్లలు కూడా వారానికి కేవలం ఒకే ఒక్క గుడ్డు తింటున్నట్టు సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్నవారిలో 1.3 శాతం మంది వాల్‌నట్స్‌, 0.2 శాతం మంది ప్లాక్స్‌ సీడ్స్‌, 1.1 శాతం మంది చియా సీడ్స్‌ను తింటున్నారు. పిల్లలకు ఈ తిండి సరిపోదని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీరానికి అవసరమైన మంచి కొవ్వు లభించే చేపలు, మాంసం, కోడిగడ్లు, నూనెగింజలు, పప్పుదినుసులను అందించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐదు పాఠశాలలకు చెందిన 625 మంది విద్యార్థులను సర్వే చేసింది. ఇందుకు 7 నుంచి 13 ఏండ్ల వయస్సున్నవారిని ఎంపికచేసింది. వీరిలో 96 శాతం మంది మాంసాహారులు.

52 శాతం మందిలో రక్తహీనత
సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది బీఎంఐ (బాడీ మాస్‌ ఇండక్స్‌) సాధారణంగానే ఉంది. 17 శాతం మంది తక్కువ బరువుతో, 7 శాతం మంది ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు. 16.4 శాతం మంది వయసుకు తగినంత ఎత్తు లేరు. దాదాపు 52 శాతం మందిని ఏదో ఒక స్థాయిలో రక్తహీనత సమస్య వెన్నాడుతున్నది. రక్తహీనత 30 శాతం మందిలో స్వల్పంగా, 21 శాతం మందిలో మధ్యస్థంగా, 2 శాతం కంటే తక్కువ మందిలో తీవ్రంగా ఉన్నట్టు సర్వే ద్వారా తేలింది. 48 శాతం మందిలో రక్తహీనత లేదని వెల్లడయ్యింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒమేగా లేదు…నెత్తురూ లేదు!

ట్రెండింగ్‌

Advertisement