గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:25

ఏపీలో 3 రాజధానులకు ఓకే

ఏపీలో 3 రాజధానులకు ఓకే

 • రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు  బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర
 • ఇక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం,శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు
 • వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉనికిలోకి రానున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) రద్దు బిల్లును గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదించారు.  న్యాయశాఖ అధికారులతో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత జనవరిలో ఏపీ శాసనసభ ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మండలికి పంపించారు. వాటిని మండలి చైర్మన్‌ ఎంపిక కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 17న శాసనసభనుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండానే నెలరోజులకు అంటే జూలై 17 నాటికి ఆటోమెటిక్‌గా ఆమో దం పొందినట్లేనని ప్రభుత్వం చెప్తున్నది. అక్కడనుంచి తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా ఆయన పచ్చజెండా ఊపారు.

మూడు రాజధానులకు ఆమోదం సాగింది ఇలా..

 • మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం
 • 2019 సెప్టెంబర్‌ 13న సలహాల కోసం జీఎన్‌రావు కమిటీ ఏర్పాటు
 • 2019 డిసెంబర్‌ 20న పరిపాలన వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు
 • 2019 డిసెంబర్‌ 29న హైపవర్‌ కమిటీ ఏర్పాటు
 • 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చ, బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం
 • 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లు.. వ్యతిరేకించిన ప్రతిపక్షం
 • 2020 జూన్‌ 16న న్యాయ నిపుణుల సలహాలతో రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
 • 2020 జూన్‌ 17న మండలి ముందుకు బిల్లు

టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ ఎం రవీంద్రనాథ్‌రెడ్డి మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు శుక్రవారం రాజీనామా లేఖ పంపారు. మండలి చైర్మన్‌కు రాజీనామాను పంపుతానని పేర్కొన్నారు.

మోదం.. ఖేదం..

రాజధాని వికేంద్రీకరణ బిల్లును వైసీపీ స్వాగతించగా.. టీడీపీ, బీజేపీ వ్యతిరేకించాయి. ఇది చీకటిరోజని, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, చారిత్రక తప్పిదమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు, ఏపీలో వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 


logo