ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 00:35:08

చెన్నై దాహార్తి పెన్నా పాలు!

చెన్నై దాహార్తి పెన్నా పాలు!

  • మానవత్వం మాటున ఏపీ జలదోపిడీ
  • కృష్ణా నుంచి తాగునీటికి ఒప్పుకోని బచావత్‌
  • బేసిన్‌ రాష్ర్టాలను ముగ్గులోకి దింపిన ఉమ్మడి ఏపీ
  • 15 టీఎంసీలతో ఆనాడు అంతర్రాష్ట్ర ఒప్పందం
  • 2 టీఎంసీలూ దక్కని వైనం

చెన్నపట్నం దాహార్తిపేరిట జరిగిన ఓ ఒప్పందం.. కృష్ణాజలాలను చెరపట్టేందుకు సాకుగా మారింది. తాగునీటికోసం నిర్మించిన చిన్న కాలువ కాలక్రమేణా చిన్నపాటి నదిగా మారి పరవళ్లు తొక్కుతున్నది. చివరకు మదరాసీ గొంతు తడవకుండా మధ్యలోనే ఆవిరవుతున్నది. దశాబ్దాలపాటు పథకం ప్రకారం అమలైన కుట్ర తెలంగాణ ఏర్పాటుతో బట్టబయలైంది. చెన్నై దాహార్తి తీర్చాల్సిన జలం పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా పాలవుతూనే ఉన్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చెన్నై నగర ప్రజల దాహార్తిని తీర్చాల్సిన కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్‌కు తరలుతున్నాయి. తాగునీటి కోసం అల్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రం, కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాల చుట్టూ తిరుగుతుంటే.. చెన్నై దాహార్తి మాటున ఏపీ గతేడాది పోతిరెడ్డిపాడు ద్వారా 179.30 టీఎంసీలు తరలించుకుపోయింది. అందులో చెన్నైకి ఇచ్చింది 8 టీఎంసీలే. తెలుగు రాష్ర్టాల్లో లక్షల ఎకరాలకు ప్రాణాధారమైన నాగార్జునసాగర్‌నుసైతం ప్రశ్నార్ధకంగా మారుస్తున్న పోతిరెడ్డిపాడు.. మానవతా దృక్పథం ముసుగులో దశాబ్దాలపాటు కొనసాగుతున్న కుట్రకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. మద్రాసు నగరానికి తాగునీరు 80వ దశకంలో పెద్ద చర్చనీయాంశం. నగర దాహార్తి తీర్చాలంటే ఎక్కడ్నుంచి నీటిని తరలించాలని నాటి కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ పయత్నాలే చేసింది. కృష్ణాజలాలను పంపిణీచేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ కూడా కృష్ణాజలాల నుంచి చెన్నైకి నీటిని అందించడాన్ని సున్నితంగా తిరస్కరించింది.

భుజాన వేసుకున్న ఆంధ్రప్రదేశ్‌

మద్రాసుకు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదనను పథకం ప్రకారం తెరపైకి తెచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌.. ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరుగకపోవడంతో ఒప్పందాలకు తెరలేపింది. ఒక నగరం దాహార్తితో అల్లాడుతుంటే మానవతా దృక్పథంతో నీళ్లివ్వలేమా? అంటూ కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలను ముగ్గులోకి దింపింది. ఏటా 5 టీఎంసీలే కదా అనే ఉద్దేశంతో ఆ రెండు రా ష్ర్టాలు సుముఖత వ్యక్తంచేయడంతో నాటి ఉమ్మ డి ఏపీ పాలకుల వ్యూహం ఫలించినట్టయింది. ఒక్కొక్క టి 5 టీఎంసీల చొప్పున మద్రాసు దాహార్తి తీర్చడానికి మూడు రాష్ర్టాలు కలిపి 15 టీఎంసీలు ఇచ్చేలా 1976లో ఒప్పందం జరిగింది. అయితే, ఎక్కడి నుంచి తరలించాలనే దానిపై స్పష్టత రాలేదు. 1977లో జరిగిన ఒప్పందంలో శ్రీశైలం నుంచి తీసుకోవాలనే అంశాన్ని చేర్చారు. 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో లైనింగ్‌తో కాలువ నిర్మించాలని, జూలై- అక్టోబర్‌ మధ్యలోనే నీటిని తరలించాలని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పెన్నా నదికి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి కాలువ నిర్మించి నాటి పాలకులు జలదోపిడీకి మార్గం వేశారు. కాలానుగుణంగా శ్రీశైలం కుడిగట్టుకాలువతో దాని ప్రవాహసామర్థ్యం 11,150 క్యూసెక్కులకు పెరుగగా.. వైఎస్‌ హయాంలో ఏకంగా 60,150 క్యూసెక్కులు అయింది.

వందల టీఎంసీలు దోపిడీ

చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు కలిపి కేవలం 34 టీఎంసీలు పారాల్సిన పోతిరెడ్డిపాడులో ఏటా అనేకరెట్ల పరిమాణంలో కృష్ణాజలాలు తరలిపోతున్నాయి. కానీ, చెన్నైకి పట్టుమని 10 టీఎంసీలు ఏనాడూ దక్కలేదు. దశాబ్దాల రికార్డులను పరిశీలిస్తే ఆ నగరానికి ఏడాదిలో గరిష్ఠంగా దక్కింది 3 టీఎంసీలే. 2018-19లో పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నుంచి 115.40 టీఎంసీల జలాలు మళ్లిస్తే.. చెన్నై వరకు వెళ్లింది 2.9 టీఎంసీలే. తమిళనాడు ప్రభుత్వం కేంద్రంతోపాటు కృష్ణాబేసిన్‌ రాష్ర్టాలతో జరిపిన సంప్రదింపులు, చేసిన ఒత్తిడిమేరకు 2019-20లో మొట్టమొదటిసారి గరిష్ఠంగా 8 టీఎంసీలు అందాయి. ఇదే సమయంలో గతేడాది పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ మళ్లించింది ఏకంగా 179.30 టీఎంసీలు కావడం గమనార్హం. చెన్నై తాగునీటి కోసం ఉద్దేశించిన తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్నినీళ్లు పోయాయో.. అంతకు 2 నుంచి 4 రెట్లు కేసీ కెనాల్‌, ఎస్కేప్‌ చానెల్‌, నిప్పులవాగు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు తరలిపోయాయి. 

లోకానికి విప్పి చెబుతున్న తెలంగాణ

పోతిరెడ్డిపాడు కేంద్రంగా జరుగుతున్న జలదోపిడీని ఉమ్మడి ఏపీలో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ నాడు ప్రశ్నించే పరిస్థితి లేకుండాపోయింది. బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రశ్నించినా.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ సమయంలో దీన్ని ఆసరాగా చేసుకొని తదుపరి కేటాయింపుల్లో ప్రయోజనం పొందడంతో మిన్నకుండిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక ఏపీ జలదోపిడీని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఇప్పటికే ఆధారాలతో సహా బట్టబయలుచేసింది. తదనుగుణంగా తనకు న్యాయమైనవాటా దక్కుతుందనే ఆశాభావంలో ఉన్నది. గతంలో పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రత్యేకంగా ఏమీ చేయలేని స్థితి ఉండగా.. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల రూపం లో ఏపీ మరోసారి వేస్తున్న అడుగును అడ్డుకొనేందుకు సుప్రీంకోర్టు వేదికగా న్యాయ పోరాటానికి సిద్ధమయింది.


logo