శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jan 21, 2020 , 03:31:30

ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు

ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు
  • పాలనా వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • రాజధాని ప్రాంత అభివృద్థి అథారిటీ రద్దు
  • టీడీపీ భూకుంభకోణం జాబితా చెప్పిన బుగ్గన
  • ఉపప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే ఉద్యమాలు
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అదేకోవలోనిదన్న మంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రాంతాల్లోని నగరాలు రాజధానులుగా కొనసాగనున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పాలనా వికేంద్రీకరణ బిల్లుకు చట్టసభ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు ఏర్పాటుకానున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సభలో వాడివేడి చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆ బిల్లులను ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే మరో రెండు ప్రాంతాలను కొత్తగా రాజధానులుగా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు టీడీపీ నేతలు వేల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారంటూ ఆర్థికమంత్రి బుగ్గన వివరాలతో సహా బయటపెట్టారు. మొదటినుంచీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న మంత్రి బుగ్గన.. టీడీపీ నేతలు రూ.40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూములను అక్రమంగా కొన్నారని, కంతేరులో హెరిటేజ్‌ పేరిట 15 ఎకరాలు కొన్నారన్నారు.

 శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే.. 

అసెంబ్లీ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలకశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో అన్నిప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ విశాఖలో ఉంటుందని, కర్నూలులో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బోర్డు, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అథారిటీ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. శ్రీభాగ్‌ ఒప్పందంలోనే వికేంద్రీకరణ ఉందని మంత్రి బుగ్గన గుర్తుచేశారు. 1937లో శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధి కోసం  ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

 రాయలసీమ వెనుకబడి ఉందని అప్పుడే గుర్తించారని పేర్కొన్నారు. ఉపప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే ఉద్యమాలు తప్పవని అన్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు అదేకోవకు చెందుతుందని తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పో లిక లేదని, ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉపప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సైతం తెలంగాణ కన్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నదని పేర్కొన్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ వ్యవసాయభూములను రియల్‌ఎస్టేట్‌గా మార్చవద్దని సూచించిందని గుర్తుచేశారు.

చంద్రబాబు భూకుంభకోణాలు వెల్లడి 

రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబా బు, ఆయన బినామీలు పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలు 4,070 ఎకరాల భూ ములను అక్రమంగా కొనుగోలు చేశారని, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌తోపాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కంతేరులో హెరిటేజ్‌ పేరుతో 15 ఎకరాలు కొన్నారని, జీవీఎస్‌ ఆంజనేయులు 40 ఎకరాలు, దినకర్‌, వేమూరి రవికుమార్‌, పయ్యావుల కేశవ్‌, దూళిపాళ నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావుకు భూములున్నాయని చెప్పారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి తాడికొండలో భూములున్నాయని, నారాలోకేశ్‌కు చెందిన బినామీలు వంద ఎకరాల్లో భూములు దోచుకున్నారని ఆరోపించారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్‌ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని, లంక భూములు, పోరంబోకు, అసైన్డ్‌భూముల్లో పాట్లు తీసుకున్నారని తెలిపారు. సుజనాచౌదరి, దుమ్మలపాటి శ్రీధర్‌ కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారని, అనేకమంది టీడీపీ నేతలు రూ.40 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి బుగ్గన వివరించారు.

ప్రైవేట్‌కు అప్పనంగా భూ కేటాయింపులు

టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల భూములను 125 సంస్థలకు అప్పనంగా కేటాయించారని మంత్రి బుగ్గన తెలిపారు. 1,300 ఎకరాలను ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించారని, ప్రైవేట్‌ సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారని గుర్తుచేశారు. ఇంతటి కుంభకోణానికి పాల్పడినచోట రాజధాని ఎలా నిర్మించాలని ప్రశ్నించారు. 

ఆదాయం కంటే అప్పులే ఎక్కువ 

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని మంత్రి బుగ్గన అన్నారు. ఐదేండ్లలో రూ.66 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని చెప్పారు. రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు నిర్మించగలమా? అని ప్రశ్నించారు. 

క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. పాలన వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులపై చర్చించి ఆమోదించింది. సమావేశం హైపర్‌ కమిటీ నివేదికకూ ఆమోదం తెలిపిం ది. రాజధాని ప్రాంత అభివృద్థి అథారిటీ(సీఆర్డీఏ)ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నది. పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, రైతు భరోసాకేంద్రం ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.  

అమరావతికి అన్యాయం చేయడం లేదు: సీఎం జగన్‌

పాలనా వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ .. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, కొత్తగా మరో రెండు రాజధానులు ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, మిగతా ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి వేదికగానే చట్టాలు చేస్తామని చెప్పారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. 


logo