శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jan 28, 2020 , 00:54:33

ఏపీలో శాసనమండలి రద్దు!

ఏపీలో శాసనమండలి రద్దు!
  • అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్‌..ఆమోదించిన సభ

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దుచేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మండలి రద్దుపై అసెంబ్లీలో సోమవారం చర్చ నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు మండలి రద్దుకు అనుకూలంగా ఓటువేశారు. అనంతరం మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశానికి ముందుకు మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. క్యాబినెట్‌ ఆమోదపత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలుపాలని కోరారు. దీనిపై స్పీకర్‌ చర్చచేపట్టారు. ఈ తీర్మానంపై మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 


ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించిన టీడీపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొంటున్నదని విమర్శించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే శాసనమండలి రద్దు నిర్ణయమని చెప్పారు. రద్దుచేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ మండలిని రద్దుచేసినప్పుడు కీర్తిస్తూ ఈనాడులో ఎడిటోరియల్స్‌ రాశారన్నారు. ఆనాడు రామోజీరావు కోసమే మండలిని రద్దుచేశారని, నేడు కోట్ల మంది ప్రజాప్రయోజనాల కోసం రద్దు నిర్ణ యం తీసుకున్నామన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ పార్టీ, శాసనమండలి, ప్రత్యేక హోదాలపై చంద్రబాబు ఎలా మాటలు మార్చారో తెలిపే వీడియోలను స్పీకర్‌ అనుమతితో సభ లో ప్రదర్శించారు. అనంతరం ఓటింగ్‌కుముం దు సభలో సభ్యులుకాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను పక్కన కూర్చోవాలని స్పీకర్‌ సూచించారు. ఆ తర్వాత ఓటింగ్‌ చేపట్టారు. ఓటింగ్‌ పూర్తయ్యాక మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపించనున్నారు. 


logo