గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:36

పసి తెలంగాణపైనా విషమే!

పసి తెలంగాణపైనా విషమే!

  • పుట్టినరోజు నుంచే గాయిగాయ్‌.. 
  • తిన్నచోట తాకట్లు.. పొరుగున చప్పట్లు
  • ఏపీలో చంద్రబాబు ఏం చేసినా గొప్పే..
  • తెలంగాణ ప్రభుత్వం ఎంత చేసినా తప్పే..
  • లేని తప్పులు ఉన్నట్టు.. ఉన్న ఒప్పులు లేనట్టు
  • ఆంధ్రజ్యోతి ప్రతి అక్షరంలోనూ అక్కసే
  • ఆది నుంచీ తెలంగాణ వ్యతిరేక ఫోబియానే

వేలాది బిడ్డలను కోల్పోయి.. అరవై ఏండ్ల వలస పాలన నుంచి విముక్తమైన తెలంగాణ.. ఇంకా తొలి అడుగు కూడా వేయలేదు. ఎన్నో ఆశలతో వలసపాలకులు పెట్టిన కష్టాలన్నింటి నుంచి క్రమంగా బయటపడి.. స్వరాష్ట్రంలో, స్వపరిపాలనలో సుసంపన్నం కావాలని తపన పడుతున్న సమాజం. అలాంటి ముక్కుపచ్చలారని పసి తెలంగాణపైనా రాధాకృష్ణ విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వం కొలువు దీరకముందే ఎకసెక్కాల రాతలు. ఆంధ్రప్రదేశ్‌తో పోలికలు.. అక్కడేదో అద్భుతం జరిగిపోతున్నదని.. ఇక్కడ ఏమీ జరుగటంలేదని      రెండు నాల్కల వార్తలు. వాస్తవంగా ఇప్పుడేమయింది.. ఎవరు అభివృద్ధి చెందారు? ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ప్రపంచానికి తెలిసిన సత్యమే. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక ఒప్పును ఎలాగైనా తప్పు చేయాలి. తప్పులా చూపించడానికి ఎంతకైనా బరితెగించాలి. ఆ తప్పు.. తప్పని బయటపడ్డప్పుడు నాలుక మడతపెట్టాలి. పాత తప్పును     ‘ఇగ్నోర్‌' చేస్తూ.. కొత్తగా మరో బొంకును వెతుక్కోవాలి. రంధ్రాన్వేషణ చేయాలి. ప్రజలపై ప్రేమలు ఒలకబోయాలి. ప్రభుత్వాన్ని తూలనాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఏ ఒక్క మంచినీ మెచ్చుకోవద్దు. మంచి సంకల్పాన్ని ముందుకు సాగనీయవద్దు. ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యనూ తప్పుగా నిరూపించి ప్రజల్లో అపనమ్మకం కలిగించాలి. తమకు ఏం చేతకాదని వాళ్లకే అనిపించేలా చేయాలి. పొరుగున మాత్రం ఏం జరిగినా.. జరుగకపోయినా.. అంతా అద్భుతం జరుగుతున్నట్టు.. జరిగిపోయినట్టు రాసేయాలి. ఇది ఆంధ్రజ్యోతి ఆర్కే అలియాస్‌ రాధాకృష్ణ మార్కు జర్నలిజం. ఇది బహుశా ఇతనికి మాత్రమే సాధ్యమైన జర్నలిజం.లార్డ్‌ మెకాలే నుంచి పుణికిపుచ్చుకున్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక, రాజకీయ విధ్వంస వారసత్వం.

‘ఖలునకు నిలువెల్ల విషము గదరా’  అని సుమతీ శతక కారుడు ప్రవచించిన సూక్తి.. ఆంధ్రజ్యోతి విషయంలో అక్షర సత్యమనిపిస్తుంది. రాష్ట్రం పుట్టినప్పటి నుంచి తెలంగాణపై ఎంత విషం చిమ్మినా.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు నుంచే హైదరాబాద్‌ ప్రతిష్ఠను, తెలంగాణ ప్రభుత్వ మనఃైస్థెర్యాన్ని మసకబార్చేందుకు, దెబ్బతీసేందుకు రాధాకృష్ణ చేయని ప్రయత్నమంటూ లేదు. ఆరేండ్ల తెలంగాణ మనుగడలో రాధాకృష్ణ రాసిన ఏ ఒక్క అక్షరమూ నిజం కాలేదు. ప్రతి అక్షరమూ తెలంగాణ పాలిట దిష్టిచుక్కై రాలిపోయింది. అయినా రాధాకృష్ణ బుద్ధి మారలేదు. మారదు కూడా.  

‘ఉద్యమ నాయకుడిగా పుష్కరకాలంపాటు కేసీఆర్‌ ఏమి చేసినా చెల్లుబాటైంది. ఇకపై ముఖ్యమంత్రి అవుతున్న ఆయన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కాబోతున్న ఆంధ్రప్రదేశ్‌తో అభివృద్ధి విషయంలో  పోటీ పడవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉన్నది. ఎన్నికల హామీలను నెరవేర్చడం అంత కష్టం కాకపోవచ్చు.’‘లోటు బడ్జెట్‌తో మొదలవుతున్న ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంపై అక్కడి ప్రజలకు చంద్రబాబుపై ఎన్నో ఆశలున్నాయి. ప్రస్తుతానికి చంద్రబాబు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని వెంకయ్యనాయుడు, చంద్రబాబు చేయిచేయి కలిపి నడిస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడం అంత కష్టమేమీ కాదు.’

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో  2014 జూన్‌ ఒకటో తేదీన ఇద్దరికీ అభినందనలు చెప్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన పలుకులివి. అన్నం ఉడికిందనడానికి మెతుకులన్నీ చూడక్కరలేదు. ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. ఇక్కడ కూడా అంతే.. రాధాకృష్ణ పేజీ మొత్తం పరిచే కథనాల్లో మూడునాలుగు వాక్యాలు చూస్తే చాలు.. ఆయన ధోరణి ఏమిటో అర్థమవుతుంది. ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ ఏమైనా చేశారట. చెల్లుబాటైందట. సీఎం అయ్యాక ప్రజలు నిశితంగా గమనిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.. పైగా అభివృద్ధి విషయంలో ఏపీతో పోటీ పడాలని హితబోధచేశారు. చంద్రబాబు మాత్రం చాలా గొప్పగా వ్యవహరిసున్నారు.. పైగా వెంకయ్యనాయుడు చేయి కలిస్తే అద్భుతాంధ్ర ఆవిష్కారం ఎంతసేపు అన్నట్టు రాశారు. 

ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ ఏం చేస్తే రాష్ట్రం వచ్చిందో తెలంగాణ ప్రజలకే కాదు.. యావత్‌ దేశానికీ తెలుసు. అభివృద్ధిలో ఎవరు ఎవరితో పోటీ పడ్డారో కూడా ప్రపంచానికి తెలుసు. 2019 ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు ‘రైతుబంధు, కల్యాణలక్ష్మి’   వంటి పథకాలను పేర్లు మార్చి ఎట్లా అమలుచేశారో కూడా అందరికీ విదితమే. జూన్‌ రెండోతేదీ ప్రమాణస్వీకారమనగా.. ఒకటో తేదీ నుంచే ఆంధ్రజ్యోతికి ‘పచ్చ’ కామెర్లు కమ్ముకున్నాయి. ఇప్పటివరకూ ఆ పత్రికకు కానీ, పత్రికాధిపతికి కానీ ఈ జబ్బు తగ్గనే లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన ఆహో... ఓహో... అంటూ వాయిద్యాలు వాయిస్తూ, ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజల సమస్యలంటూ మొసలి కన్నీరు కారు స్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి పిచ్చి ప్రయత్నాలెన్నో చేశాడు. ఆపై చేతులు, మూతులు కాల్చుకున్నా.. ‘ఎలుక తోలు తెచ్చి..’ అన్నట్లుగానే వంకర బుద్ధి మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో 2014 జూన్‌ రెండున తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరగా.. తెలంగాణ సమస్యల సంద్రంలో చిక్కుకున్నదంటూ రాసిన కథనాలను మచ్చుకు కొన్ని మాత్రం పరిశీలిస్తే..


మంత్రివర్గం కూర్పు చేసేదెవరో?

17-12-2014 సీఎం.. ఓ సీతయ్య! ఆయనకు నచ్చినట్లే మంత్రివర్గ విస్తరణ

సాధారణంగా ముఖ్యమంత్రి ఇష్టానికి అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ రాధాకృష్ణకు అది కంటగింపు అయ్యింది. నియంతృత్వంగా కనిపించింది. ఆ ఆక్కసును వెళ్లగక్కేందుకు సీఎం.. ఓ సీతయ్య! అని, అంతర్గత నిరసనలను పట్టించుకోవడం లేదంటూ కుంపటి పెట్టే పిచ్చి ప్రయత్నం చేశారు. ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం కూర్పు మాత్రం ఆయనకు ఇంపుగా కనిపించింది.  

పరిశ్రమలపై అక్కసు

2014 జూన్‌ 3, 25 పారిశ్రామిక తెలంగాణ అతి పెద్ద సవాల్‌.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ

హైదరాబాద్‌ను దెబ్బతీసి.. ఆ మేరకు ఇక్కడి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌ వైపు మళ్లించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచే కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే ఇలాంటి రోత రాతలు వరుసపెట్టి రాశాడు. హైదరాబాద్‌లోని పరిశ్రమల్ని కాపాడుకోవడం సీఎం కేసీఆర్‌ అతి పెద్ద సవాల్‌ అయితే.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలతో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ సాగిందట. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వేగాన్ని పెంచిందట. చెప్పేవాడు చంద్రబాబు అయితే.. రాసేవాడు రాధాకృష్ణ అంటే ఇదే మరి!

రాధాకృష్ణ ఒపీనియన్‌ పోల్‌

01-12-2014 కేసీఆర్‌ కన్నా చంద్రబాబే మెరుగు -ఏబీఎన్‌ ఓపీనియన్‌ పోల్‌లో మెజారిటీ అభిప్రాయం

ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు స్వీకరించి కనీసం ఏడాది కూడా కాలేదు. ఆర్నెల్లలోనే అంతా జరిగిపోయి, ఎవరి సామర్థ్యం ఏమిటో బయటపడిందట. ముఖ్యంగా అభివృద్ధిపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఇస్తున్న హామీల్లో ఎవరివి ఆచరణ సాధ్యంగా ఉన్నాయనే రంధ్రాన్వేషణకు రాధాకృష్ణ బ్యాచ్‌ రంగంలోకి దిగితే.. అత్యధికులు చంద్రబాబే ఆచరణ సాధ్యమైన ప్రకటనలు చేస్తున్నారని జనం చెప్పారట. నిజమే.. చంద్రబాబులా సీఎం కేసీఆర్‌ గ్రాఫిక్స్‌ అమరావతి ప్రకటనలు చేయలేదు కదా. మరి.. చంద్రబాబు చెప్పిన సింగపూర్‌లాంటి అమరావతి కనీసం కండ్ల ముందు కనిపిస్తున్నదా? మన రెండు నాల్కల ఆర్కేకే తెలియాలి. ఇంతకీ.. అంతగా నెత్తిన పెట్టుకొని మెచ్చుకున్న చంద్రబాబును ఏపీ ఓటర్లు 2019లో ఎందుకు చిత్తుగా ఓడగొట్టారు మిస్టర్‌ ఆర్కే?!

శవాలమీద పేలాలు ఏరుకోవడమంటే ఇదే

2014 డిసెంబరు, 7 , ‘రోగం’ కుదిరేదెప్పుడు? - అప్పుడు ఆరోగ్య భాగ్యంలో భళా.. ఇప్పుడు భరోసా ఇవ్వలేక ఢీలా

హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ దవాఖానలపై రాసిన కథనమిది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కాలేదు. అంతకుముందు ఆరోగ్యభాగ్యంలో భళాగా ఉన్న దవాఖానలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే డీలా పడిపోయాయట. అంతేకాదు, నగరంలోని ఈ రెండు వైద్యశాలల్లో నీలోఫర్‌, యునాని వంటి దవాఖానలకు ఉమ్మ డి రాష్ట్రంలో గుండె నొప్పితో వచ్చిన వారు గుండె నిబ్బరంతో వెళ్లేవారట. కానీ తెలంగాణ ఏర్పడిన నెలల్లోనే ఈ దవాఖానల్లో అన్నీ కరువయ్యాయట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు ఆరునెలల్లోనే ఎక్కడికి మాయమయ్యాయి? ఎవరు ఎత్తుకెళ్లారు? అదేదో సినిమాలో చేపల చెరువు ఎత్తుకుపోయారన్నట్టు.. అంతకు ముందు అద్భుతంగా ఉన్న దవాఖానలు తెలంగాణ రాంగానే దారుణంగా మారిపోయాయంట! వినేటోడుంటే.. చెప్పేటోడు ఎంతైనా చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పు. ఇప్పుడు కరోనా దరిమిలా శవాల మీద పేలాలు ఏరుకుంటున్న రాధాకృష్ణకు తెలంగాణ వ్యతిరేక రోగం ఇప్పుడే కాదు.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉన్నదే. ఇప్పుడేదో కొత్తగా వచ్చిన అజీర్తి వ్యాధి ఏం కాదు? 

కరెంటుపై కావ్‌.. కావ్‌..

2014 జూన్‌, 27 , చీకట్లో నగరం - విద్యుత్తు కోతలతో బతుకు దుర్భరం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో విద్యుత్తు కోతలతో తెలంగాణ అంతా అంధకారంలో కూరుకుపోయిందనే వ్యాఖ్యలతో కథనం.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఆ రోజుకు 25 రోజులు గడిచాయి. మరెందుకు రాశారు?! ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టె పట్టుకొని మరీ విభజనతో తెలంగాణ అంధకారంలోకి పోతుందని పిల్లి శాపాలు పెట్టాడు కదా. అది నిజమని చెప్పేందుకే ఈ కథనాలు. వాస్తవంగా ఏపీలోనూ అప్పటికి లోటు కరెంటుతో విద్యుత్‌ కోతలున్నాయి. కానీ ఆ విషయాన్ని కథనం మధ్యలో ఇస్తారు గానీ ప్రధానంగా అంతా తెలంగాణనే చీకట్లో ఉందని కవర్‌ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తక్కువచేయాలి. ఆంధ్రప్రదేశ్‌ లోపాలను తక్కువగా చూపాలి.. చూపకున్నా ఓకే.. ఇదీ రాధాకృష్ణ రాతల సారాంశం. 

సేద్యంపై మొసలి కన్నీళ్లు

2014 ఆగస్టు, 07 , కన్నీటి సేద్యం - గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం - తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి - ఆంధ్రజ్యోతి పరిశీలన

తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడ లక్షల ఎకరాల్లో పంటలతో రైతులు విరాజిల్లుతున్నదని, రాష్ట్ర విభజన తర్వాత సాగు విస్తీర్ణం తగ్గి రైతులు కన్నీటి సేద్యం చేస్తున్నారంటూ బొంకాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అదీ ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనగా చెప్పుకొచ్చా రు. ప్రభుత్వం కొలువుదీరి అప్పటికి 2 నెలలు అయ్యింది. పైగా వర్షాభావ పరిస్థితులు. అంతకుముందు వలసపాలనలో తెలంగాణలో వ్యవసాయం సుసంపన్నంగా వర్ధిల్లినట్టు.. తెలంగాణ రాగానే మొత్తం కునారిల్లినట్టు కథనాలు. ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతులు ఆనందంగా ఉంటే.. వాళ్లకు సాగునీరు, కరెంటు లభించి ఉంటే.. అసలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే వచ్చేది కాదు కదా.. ఆ ఇంగితం ఆంధ్రజ్యోతి పత్రికకు లేకుండాపోయింది. 

ఇక్కడ బురద.. అక్కడ అత్తరు

2014 సెప్టెంబరు, 16 , రాజకీయ నడక.. పాలన పడక - ఆయన కార్యాలయంలోనే అధికారం కేంద్రీకృతం

‘కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన వారు అనతి కాలంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించి, అందరి మన్ననలు పొందాలనుకుంటారు. కానీ తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ఈ మూడు నెలల కాలంలో పాలనపై పెద్దగా దృష్టి సారించకుండా.. రాజకీయ క్రీడలోనే మునిగిపోవడం చర్చనీయాంశంగా మారిం ది.’ ఇదీ ఈ కథనం తాలూకు కట్టు కథ. పైగా తెలంగాణ సీఎంవోలో అంతా రహస్యమేనంటూ రాతలు. రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజునుంచే ప్రభుత్వం దీర్ఘకాలికంగా తెలంగాణను వేధిస్తున్న ఒక్కో  సమస్యపై దృష్టి సారించింది. కాబట్టే ఆరునెలల్లో విద్యుత్‌ కోతలు మాయమైపోయినయి. మూడేండ్లలో కాళేశ్వరం పూర్తయింది. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, భగీరథ, గురుకులాలు, టీఎస్‌ ఐపాస్‌ వంటి 450కి పైగా పథకాలు ‘ఆయన కార్యాలయం’లోనే పురుడు పోసుకొని అమలవుతున్నా యి. కానీ చంద్రబాబు రెండు కండ్లతో చూసే రాధాకృష్ణ రెండు నాల్కలకు ఇవేం రుచిస్తాయి. వాళ్లకు కావాల్సిందల్లా ఇక్కడ బురద జల్లాలి. అక్కడ అత్తరు జల్లాలి. 


logo