గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:27

ఉద్యమంపై కలంపోటు

ఉద్యమంపై కలంపోటు

  • రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ విరహ రాతలే
  • ఆంధ్రజ్యోతి అక్షరాలు.. తెలంగాణపై గాయాలు
  • ఆదినుంచి ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఆర్కే ప్రణాళిక
  • తొలుత ఉద్యమ నేతపై లేనిపోని తప్పుడు వార్తలు
  • ఆపై.. ఉద్యమంలో అసాంఘిక శక్తులంటూ కథనాలు
  • హైదరాబాద్‌ను ముడిపెట్టి అడ్డుకునేందుకు కుట్రలు
  • వెకిలిరాతలతో వేలమంది ఆత్మహత్యలకు ఆజ్యం

ఆ అక్షరాలు.. ఆనాటి తెలంగాణ ఉద్యమానికి గాయాలు! ఉరకలెత్తే ఉద్యమాన్ని అపహాస్యం చేసిన విపరీతాలు! పట్టుసడలిపోయేలా పన్నిన కుట్రలు.. అమాయక తెలంగాణ బిడ్డల ఉసురు తీసిన ఉన్మాద రూపాలు! ఉద్యమంపైనా.. ఉద్యమ నేతలపైన నిరంతరం విషం చిమ్మిన రాక్షసానందాలు! 

రాష్ర్టాన్ని సాధించుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఎదురైన అనేక ఆటుపోట్లలో.. సీమాంధ్ర మీడియా కలంపోట్లే ఎక్కువంటే ఆశ్చర్యంలేదు! అందులోనూ ఆంధ్రజ్యోతి పొడిచిన పోట్లకు లెక్కేలేదు! తెలంగాణపై ప్రతి వార్తలోనూ వ్యతిరేకత.. ప్రతి కథనం కల్పితం.. ప్రతి విశ్లేషణలోనూ విషం! ఏది ఏమైనా తెలంగాణ రాకూడదనే కసి.. ఇంతచేసినా వచ్చేస్తుందేమోనన్న ఆందోళన.. అన్నింటినీ దాటుకుని స్వరాష్ట్ర కల సాకారమవుతున్న వేళ.. దానినీ చిదిమిపారేయాలన్న ఉక్రోషం! ప్రతిదశలోనూ నిర్లజ్జగా అడ్డంపడిపోవడమే నైజంగా సాగిపోయాయి ఆర్కే దగాకోరు అక్షరాలు! 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణచివేయటానికి సీమాంధ్ర నేతల ప్రయత్నాలన్నీ ఒక ఎత్తయితే.. సీమాంధ్ర మీడియా.. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి కుయుక్తులు మరో ఎత్తు. 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయం వరకూ అర్కే అక్షరాలు ఉద్యమానికి చేసిన గాయాలు అన్నీఇన్నీకావు. ఒక దశలో ఆర్కే పైత్యం ఎంతదాకా వెళ్లిపోయిందంటే.. సమైక్యవాదం దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారని ఓ దిక్కుమాలిన లాజిక్‌ చెప్పేంత స్థాయికి! విద్యార్థులపై మావోయిస్టు ముద్రవేసి.. వారిని పిట్టల్లా కాల్చివేయాల్సిందేననే భావన కల్పించే రాయడమేకాదు.. హైదరాబాద్‌ ఐటీ గుండుసున్నా అయిపోవడం ఖాయమని, సీమాంధ్రులు ఇక్కడ బతకడం ఇక కష్టమేనని విద్వేష భావనలు రెచ్చగొట్టేందుకూ ఆర్కే అక్షరాలు బరితెగించాయి. వాటన్నింటినీ ఒకసారి గమనిస్తే.. 

పథకం ప్రకారం ఉద్యమ నేతపై రాళ్లు


అదిరిందయ్యా చంద్రం! 

కొత్త ఇల్లూ.. కొత్త కారూ..

ఈసారి ఎన్నికలు టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు కలిసి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్‌.. ఎన్నికల తర్వాత కూడా అదే కొత్తదనాన్ని కొనసాగిస్తున్నారు.నేత కత.. రైతు వెత.. అంటూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వేసిన పక్కా ప్లాంటెడ్‌ వార్తలివి. ఇప్పుడు ఏ ఒక్క రైతుకు బాధ వచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అంటూ దుమ్మెత్తిపోసే రాధాకృష్ణకు.. అప్పట్లో కరెంటులేక, నీళ్లు రాక తెలంగాణ రైతు ఎండిపోయిన పంటల్ని తగులబెట్టుకుంటున్న సమయంలో ఉమ్మడి పాలకులను ప్రశ్నించడం ముఖ్యం కాదు. తెలంగాణ రైతు తరఫున గళం వినిపించడం అంతకంటే ప్రధానం కాదు. ఉద్యమనేతపై రాళ్లు వేయాలి. అందుకే ఆ వార్త పక్కనే కేసీఆర్‌ బొమ్మ వేసి.. కొత్త కారు, కొత్త ఇల్లు అంటూ వెటకారపు మాటలు. ఏం?! ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పట్లో కారు కొనలేదా? కొత్త ఇల్లు కట్టుకోలేదా? వరంగల్‌లో రైతు పంటను తగలబెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిబోయి.. దానికీ ఉద్యమ నేతకు లింకు పెట్టి విషయాన్ని పక్కదారి పట్టించడం. ఒకవైపు ఉమ్మడి పాలకుడిని కాపాడటం, మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం! ఇదీ ఆర్కే మార్కు జంట కుట్రలు. 

2009 మే, 1తగలబడుతున్న రైతు బతుకు..

వరంగల్‌లోనూ కన్నీటి మంట, ఎండిన పంటకు నిప్పుపెట్టిన రైతు.. చెరువు నీరందక వరంగల్‌ జిల్లాలో మరో గిరిజన రైతు భూక్యాపంతులు పంటకు నిప్పు పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న మెదక్‌ జిల్లాలో కరెంటు లేక నీరందక గిరిజన రైతు లంబాడ గంగారం వరి పంటను కాల్చుకుంటే.. 

2009 డిసెంబరు, 4 తెలంగాణ బిడ్డలపై అసాంఘిక ముద్ర!

తెలంగాణ ఉద్యమం హైజాక్‌ అందుకే యూనివర్సిటీలకు 15 రోజుల సెలవులు విధ్వంస కార్యక్రమాల్లో మాజీ మావోయిస్టులు

- ఈసారీ ఒక అక్షరానికి రెండు కోణాలు. తెలంగాణ ఉద్యమం హైజాక్‌ అంటూ.. కేసీఆర్‌ చేతుల్లో ఉద్యమం లేదనే పాఠకులపై రుద్దడం.. మరోవైపు విద్యార్థులను మావోయిస్టులుగా చిత్రీకరించడం. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న వేళ దానిపై విధ్వంస ముద్ర వేసేందుకు సాగిన కుట్ర ఇది. ప్రభుత్వానికి పోలీసు, నిఘావర్గాల సమాచారం అంటూ.. తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లా కాల్చివేయాలనే పరోక్ష భావన. అంతేకాదు.. విద్యార్థుల ముసుగులో మాజీ మావోయిస్టులు ప్రవేశించారంటూ పతాక శీర్షికలో కథనాలు.

2009 అక్టోబర్‌, 13ఎల్లికి ఎగేయడం.. మల్లికి సగేయడం..

తెలంగాణపై కేసీఆర్‌ రాజీ? - తెలుగు ప్రజలు తన్నుకోరాదన్నదే నా ఉద్దేశం అని విస్పష్టగా ప్రకటిస్తున్నారు. సమైక్యవాదం దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారనడానికి ఇది కచ్చితంగా సంకేతమేనని రాజకీయ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే రక్తం ఏరులైపారుతుందని గతంలో హెచ్చరించిన కేసీఆరే.. అన్ని ప్రాంతాలు సమానమేనని, ఎక్కడివారైనా హక్కులకు భంగం వాటిల్లకూడదని చెప్తున్నారు.

- ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏదైనా ఆవేశపూరిత ప్రకటన చేస్తే దాన్ని చిలవలు పలవలు చేయడం, సీమాంధ్ర నేతలతో మళ్లీ తిట్టించడం ఆయన హాబీగా మారిపోయింది. ఇదే ఆర్కే తన చెత్త పలుకుల్లో ‘ఇవేం విద్వేషపూరిత ప్రకటనలు’ అంటూ దొంగ సూచనలు చేయడం. కేసీఆర్‌ రెండు ప్రాంతాలు సమానమేనని మాట్లాడితే మాత్రం ఆయన తెలంగాణపై రాజీ పడినట్లు! ఎంతసేపు సీమాంధ్ర నేతల్ని హెచ్చరించాలి.. ఉద్యమ నేత భాషపై ఆర్కే సూక్తులు వల్లించాలి!! ఇదో రకం కుట్ర.

2009 డిసెంబరు, 5ఎంతటి వేళాకోళం!

కేసీఆర్‌ ఢిల్లీ పిలుపును కోరుకుంటున్నారు. అయితే గతంలో ఒక సందర్భంలో కేసీఆర్‌.. సోనియాను, ఆమె సన్నిహితులను తీవ్రంగా దూషించారని, ఇది తెలిసి ఆమె చాలా ఆగ్రహించారని, అందువల్ల అదిష్ఠానం పిలుపు రావడం అనుమానమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కోరుకుంటున్నట్లు నిమ్స్‌ నుంచి జైత్రయాత్ర జరగడం సాధ్యంకాకపోవచ్చు. ఆయన హెచ్చరించినట్టు శవయాత్ర జరగడానికీ ప్రభుత్వం అనుమంతిచదు!! 

- తెలంగాణ ఉద్యమమంటే ఆర్కేకు ఎంతటి వేళాకోళమో ఈ రాతలను గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్రం రాదనే పూర్తి భరోసాలో రాలిన అక్షరాలే ఇవి. ఒకవైపు ఉద్యమానికి ప్రచారం కల్పిస్తున్నామంటూ ముసుగు వేసుకొని.. తీరా తన పెన్ను నుంచి రాల్చే అక్షరాల్లో మాత్రం అసలు స్వరూపాన్ని బయటపెట్టడం! ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా... తెలంగాణ రాదు సరికదా.. కేసీఆర్‌ చనిపోయిన తర్వాత శవయాత్రకు ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వదంటూ బలుపు మాటలు.

2009 డిసెంబరు, 12  అక్షరాల అక్కసు..

తెలంగాణ సెంటిమెంట్‌ నేపథ్యంగా ఉన్న కేసీఆర్‌ను బలోపేతం చేసి తెరపైకి తేవడం, ఆ క్రమంలోనే రాష్ర్టాన్ని విభజించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో అటు జగన్‌ను, ఇటు బాబును దెబ్బతీయాలన్నది కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎత్తుగడ. దీని అమలు బాధ్యతను, అహ్మద్‌పటేల్‌, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ, ఆంటోనీలతో కూడిన మేడమ్‌ సోనియాగాంధీ కోటరీ స్వయంగా చేపట్టింది. తెలంగాణ సాధన కోసం అప్పటికే ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయాన్ని ప్రకటించిన కేసీఆర్‌తో ఆయన తమ వ్యూహం గురించి వెల్లడించినట్లు తెలిసింది. ఇక తర్వాత పరిణామాలన్నీ ఇందులో భాగమే! రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడడం, వాటి నుంచి బయటపడడానికి దేశానికి ఏళ్లూ పూళ్లూ పట్టడం మొదటినుంచీ ఉన్నదే! 

- ఎంత అక్కసో చూశారా! డిసెంబరు 9 ప్రకటన చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఆర్కే పెట్టిన అక్షర శాపాలివి. ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్‌ రాష్ర్టాన్ని ఇచ్చిందనే పదాలు రాయడానికి కూడా మనసు రాలేదు. ఎంతసేపూ తన దోస్తు చంద్రబాబు ప్రయోజనాలు, వాళ్లకు ఉమ్మడి శత్రువు అయిన జగన్‌ను దెబ్బతీయడం.. ఇదే ధ్యాస. ముఖ్యంగా కేసీఆర్‌ దీక్ష వల్ల రాష్ట్రం ఏర్పడిందని చెప్పేందుకు కూడా అయిష్టత. అందుకే కాంగ్రెస్‌ ఈ ప్రయోజనాలతోనే ప్రకటన చేసిందంటూ రాతలు. ఇక్కడ ఇంకో విషయం.. సోనియా కోటరీ అంటూ ప్రణబ్‌ను చేర్చిన ఆర్కే, ఆంధ్ర మీడియా ఆ తర్వాతి కాలంలో అసలు ప్రణబ్‌ అందుబాటులో లేనందునే ప్రకటన వచ్చింది.. ఆయనుంటే ప్రకటన వచ్చేదేకాదనీ బొంకారు.

2013 డిసెంబరు, 8రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఆర్కే ఆందోళన

ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ అసెంబ్లీ తీర్మానం చేసినా ములాయంసింగ్‌కు భయపడి కేంద్రం దాని జోలికి వెళ్లదు. బీజేపీ కూడా ఆ విషయం మాట్లాడదు. విదర్భ కావాలని అక్కడి ప్రజలు కోరుతున్నా శరత్‌పవార్‌ కోసం ఆ విషయం పట్టించుకోరు. గూర్ఖాలాండ్‌ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నా ప్రణబ్‌ముఖర్జీకి ఇష్టం లేదు కనుక ప్రజల ఆకాంక్ష కేంద్రం చెవికెక్కదు. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఎప్పుడో ఒకప్పుడు ఈ దేశ సమగ్రతకు చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. సీమాంధ్ర ప్రజలు తాము దేశంలో భాగంగా ఎందుకు ఉండాలని భవిష్యత్తులో ఉద్యమాలు వచ్చే ప్రమాదం లేదా? 

- నిన్నటిదాకా తెలంగాణ ఏర్పాటు కాదని రాసిన చేతులకు రాష్ట్ర ఏర్పాటుదిశగా కేంద్రం అడుగులు వేయడంతో వణుకు మొదలైంది. 2009 ప్రకటన తర్వాత నెలకొన్న మానసిక దుర్భలత్వం మళ్లీ మొదలైంది. అందుకే మళ్లీ కేంద్రాన్ని ఆడిపోసుకుంటూ రాతలు. దేశంలో అక్కడ డిమాండ్లు, ఇక్కడ డిమాండ్లు ఎవరివీ పట్టించుకోలేదు.. కానీ తెలంగాణను మాత్రమే పట్టించుకుంటారా? సీమాంధ్రులు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? అంటూ తన సొంత పైత్యాన్ని అక్షరాల్లో వెల్లడించాడు. 

2009 డిసెంబరు, 7: ఉద్యమంపై విధ్వంస ముద్ర!

ఐటీ కంపెనీల్లో కలవరం! ఐటీ రంగం భారీగా నష్టపోయే ప్రమాదముందని అధికారి వ్యాఖ్య. నగరంలో 50 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా పడి ఉన్నది. ఇది ఎప్పుడు భర్తీ అవుతుందా? అని డెవలపర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో నగరంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు వీరిలో కూడా భయాందోళనలు పెంచుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి. 

ఉద్యమం మరింత ఉధృతం అవుతుండటంతో హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందనే సాకును తెరపైకి తెచ్చేందుకు వండినదే ఈ వార్త. ప్రభుత్వం ఉద్యమాన్ని మరింత అణచివేయాలనే రెచ్చగొట్టేలా సాగాయి ఈ కథనాలు. అన్ని రంగాలు నష్టపోతున్నాయంటూ తప్పుడు సమాచారంతో వరుస కథనాలు. ఉద్యమం కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందంటూ మొసలి కన్నీరు. 

2009 డిసెంబరు, 11తెలంగాణ సంతోషంలో ఉంటే ఎలా?!

ఒకటి కాదు.. పదకొండు! - టీఆర్‌ఎస్‌ స్ఫూర్తితో డిమాండ్లు - పెండింగులో తొమ్మిది ప్రత్యేక విన్నపాలు: కేంద్ర హోంశాఖ.. గూర్ఖాలాండ్‌, బుందేల్‌ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, హరితప్రదేశ్‌, మిథిలాంచల్‌, కూర్గ్‌, సౌరాష్ట్ర  ఇలా అన్నీ తెరపైకొచ్చాయి. 

- తెలంగాణ ఆకాంక్షకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేసిన రెండు రోజులకే ఈ కథనం. డిసెంబరు 9న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటన ఆనందంలో ఉన్న తెలంగాణవాదుల్లో మళ్లీ అలజడి నింపేందుకు కుట్ర. రాదనుకున్న తెలంగాణ ఎలా వచ్చింది? అనే మథనం. అందుకే దేశవ్యాప్తంగా కాలగర్భంలో కలిసిపోయిన ప్రత్యేక రాష్ర్టాల ప్రతిపాదనలు ఆంధ్రజ్యోతిలో ప్రత్యక్షం. రాష్ట్రం వస్తున్నదన్న సంతోషంలో తెలంగాణ సమాజం సంబరపడొద్దనే దుగ్ధ. దేశవ్యాప్తంగా ఉన్న ‘ప్రత్యేక’ డిమాండ్ల సరసన తెలంగాణ చేరినందున ప్రకటన వచ్చినా మీ కల నెరవేరదంటూ రాక్షసానందం పొందే ప్రయత్నం.

2010 జనవరి, 9మావోయిస్టుల ముద్ర

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేస్తే మావోయిస్టుల కారిడార్‌ విస్తరిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తనను కలిసినవారి వద్ద ఇటీవల తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇప్పట్లో తెంగాణ ఏర్పాటుచేసే ఆలోచనలో కేంద్రం లేదని చెప్పవచ్చు. నక్సలైట్లు పెచ్చరిల్లుతారని అధికారికంగా ప్రకటించలేదు కనుక, ఆయా నాయకులకు లోపాయికారీగా బ్రెయిన్‌ వాష్‌ చేసి పంపించి ఉంటారని అనుమానించవలసి ఉంటుంది. కేంద్రం భావిస్తున్నట్లు తెలంగాణవాదాన్ని మావోయిస్టులు చేజిక్కించుకుంటారో లేదో తెలియదుగానీ సమస్యను ఇలాగే దీర్ఘకాలం నానబెడితే మాత్రం మావోయిస్టులు తెలంగాణలో కచ్చితంగా బలపడే అవకాశం ఉంది. 

- తెలంగాణ ఉద్యమంపై అప్పటివరకు విధ్వంసాలు, విద్వేషపూరిత ప్రకటనలు, అసాంఘిక శక్తులు ఇలా అనేకరకాల ముద్రలు వేసిన రాధాకృష్ణ.. తెలంగాణ వ్యతిరేక ముఠా కుట్రల ఆదేశానుసారం మావోయిస్టుల వైపు మలిపాడు. రాష్ట్రం ఇస్తే మావోయిస్టుల మయం అవుతుందంటూ ప్రణాళికాబద్ధంగా ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆర్కే మరో అడుగు ముందుకేసి.. అసలు తెలంగాణ ఉద్యమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఆరాటపడ్డాడు. అందుకే సమస్యను ఇలా సాగదీయకుండా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయాలని, లేకపోతే రాష్ట్రం ఇస్తేనే కాదు ఇయ్యకుండా ఇలా ఉంచినా మావోయిస్టులు బలపడతారంటూ అనేకసార్లు రాశాడు. ఈ బొంకులు తన నోటి నుంచి వస్తే బాగుండదని.. దానికి ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చాయనే కలరింగ్‌.

2009 డిసెంబరు, 5నరంలేని నాలుక.. నీతిలేని పెన్ను!

ఉద్యమ నిర్వహణకు విద్యార్థి సంఘాలు సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ)గా ఏర్పడ్డాయి. నిజానికి ఇదొక ఆసక్తికర, ప్రశంసాకర సన్నివేశం. గత కొన్నేళ్లుగా సామాజిక అంశాలతో సంబంధం కోల్పోయి, కేవలం కెరీర్‌ ఆధారిత మార్కెట్‌ ఎకానమీలో ఉద్యోగాల వేటపైనే దృష్టిని పరిమితం చేసిన విద్యార్థిలోకం ఒక రాజకీయ, సామాజిక అంశంపై ఈ స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడటం ఆహ్వానించగదగినది. అసోంలో ఆసు ఆధ్వర్యంలో విద్యార్థులు ఇలాగే ఉద్యమించి, తామే నాయకత్వంగా ఎదిగి, తర్వాత రాజకీయ శక్తిగా మారిన అనుభవం ఉంది. 

2010 జనవరి, 23 నీతిలేని పెన్ను!

కాంగ్రెస్‌ రాజకీయాల గురించి తెలియని అమాయక తెలంగాణ జనం, ఏదో ఒనగూరుతుందని నమ్మి, తమ బతుకులను తామే నాశనం చేసుకుంటున్నారు. సీమాంధ్రకు చెందిన విద్యార్థులు ఉద్యమాలకు స్వస్తి చెప్పి, తమ చదువును కొనసాగిస్తూ ఉండగా, రాజకీయ నాయకుల వలలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, చదువులను అటకెక్కించి రోడ్లపైకి చేరారు. ఈ పోటీ ప్రపంచంలో ఒక విద్యా సంవత్సరం నష్టపోతే జరిగే అనర్థాన్ని వారికి వివరించి చేప్పేవారు ఎవరు? 

2010, జనవరి 16 విద్యార్థులపైనా నక్సలైట్ల ముద్ర!

విద్యార్థి జేఏసీ వెనుక మావోయిస్టులు ఉన్నారని కేంద్రం గట్టిగా అనుమానిస్తున్నది. ఈ కారణంగానే భవిష్యత్తులో విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే బల ప్రయోగం ద్వారా అణచివేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటుచేస్తే మావోయిస్టుల కారిడార్‌ విస్తరిస్తుందని, సగం దేశం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తనను కలిసిన ఒకరిద్దరి వద్ద స్వయంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. తెలంగాణ పేరిట గత నవంబరులో ప్రారంభమైన ఆట చాలాకాలంపాటు కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికలకు మరో నాలుగేళ్లకు పైగా వ్యవధి ఉన్నందున అంతవరకు సినిమాను చూపిస్తూనే ఉంటారు. చర్చలు అని కొంతకాలం, ఏకాభిప్రాయ సాధన పేరిట మరికొంతకాలం నాటకం కొనసాగుతూనే ఉంటుంది.

- 2009, డిసెంబరు 9 ప్రకటన వరకు ఉద్యమంలో విద్యార్థులు ఉంటే పెద్దగా పట్టించుకోని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. అసలు ఉద్యమం నుంచే వారిని వేరుచేయాలనే కుతంత్రాన్ని అమలుచేశాడు. అందులోభాగంగానే విద్యార్థులపై మావోయిస్టుల ముద్ర వేసేందుకూ వెనుకాడలేదు. ఈ ముద్ర వల్ల ఎంతమంది అమాయక విద్యార్థులపై పోలీసులు ఎంత అరాచకాన్ని ప్రదర్శిస్తారో రాధాకృష్ణకు తెలియంది కాదు. కానీ పత్రిక ముసుగులో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు తన అక్షరాల్ని ఆయుధాలుగా వాడుకున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఆట, సినిమాతో పోలుస్తూ.. తన ఇష్టానుసారంగా వికృతాక్షరాలు వెదజల్లాడు. నాలుగేండ్లపాటు ఇదో నాటకంలా సాగుతుందని, విద్యార్థులు ఉద్యమాన్ని వీడాలనేది ఆయన అక్షరాల్లోని ఆంతర్యం. 

చూశారా! డిసెంబరు 9 ప్రకటన రాకముందు వరకు ఒక నాటకం. వచ్చిన తర్వాత మరో నాటకం. విద్యార్థుల్ని ఉద్యమం నుంచి వేరు చేసేందుకు ఎంత పన్నాగమో! ప్రకటన ముందు వరకైతే.. అసలు విద్యార్థులు ఇలాంటి ఉద్యమాల్లోకి రావడమనేది ప్రశంసించే విషయమట. తాను ఆహ్వానిస్తున్నాడట. రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఇదో మెట్టు అన్నట్టు రాశాడు. తెలంగాణ రావడం ఖాయమని తేలిపోయాక విద్యార్థుల చదువులేంకావాలంటూ మొసలి కన్నీటి రాతలు. మరి అంతకుముందు నువ్వే కదా.. విద్యార్థులకు రాజకీయ, సామాజిక అంశాలపై చైతన్యం ఉండాలని రాసింది. నీకు నీతి, జాతి అంటూ ఏమైనా ఏడిస్తే కదా అక్షరం మీద నిలబడేందుకు!!

2012 జనవరి, 7అక్షరాలతో హత్యలు!

తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం సుముఖంగా లేదనీ, గుర్ఖాలాండ్‌ తరహాలో కొంతకాలంపాటు రాజ్యాంగ ప్రతిపత్తితో కూడిన ప్రాంతీయ మండలి ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందని పలువురు నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం రోజులు వెళ్లదీస్తున్నది. ఇంత బలహీనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అనే సాహసోపేత నిర్ణయం తీసుకోగలుగుతుందంటే నమ్మడం కష్టం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చైతన్యం పొంది రాజకీయ పార్టీలను నిలదీయగలిగితే, వాటి అసలు స్వరూపం బయటపడుతుంది. టీఆర్‌ఎస్‌ మినహా మిగతా రాజకీయ పార్టీలను నిలదీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. 

డిసెంబరు 9 ప్రకటన తర్వాత కొన్నాళ్లపాటు.. ఇదేం ఉద్యమం, ఇదేం అరాచకం? అంటూ కథనాలు. ఇక ఢిల్లీలో రాజకీయంగా స్తబ్దత నెలకొనడంతో మళ్లీ వెకిలి రాతలు. కేంద్రం తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో లేదని, తిరిగి తెలంగాణ ప్రజలు చైతన్యం పొందాలంటూ రెచ్చగొట్టే మాటలు. తెలంగాణ బిడ్డలు ఆందోళన చెంది, అసువులు బాసింది ఇలాంటి రోతల రాతల వల్లే. కేంద్రం తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో లేదంటూ సొంత, ఉద్దేశపూర్వక పైత్యాలు వార్చడం వల్లనే వేలమంది యువకులు నిలువునా దహించుకుపోయింది. 

2013, జూన్‌ 16ఇన్‌స్టంట్‌ కాఫీతో పోలిక

ఉద్యమ నాయకుల రాజకీయ ఆరాటం ముందు ప్రజల ఆకాంక్ష చిన్నబుచ్చుకుంటోంది. తమకు తెలంగాణ కావాలని ప్రజల్లో ఉన్నా, వస్తుందన్న నమ్మకంగానీ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారు సాధిస్తారన్న భరోసాగానీ ప్రజలకు కలగడంలేదు. మరో పది మాసాల్లో ఎన్నికలు జరగనున్నందున తెలంగాణ నాయకుల భాష మారింది. ఓట్లు, సీట్లపైనే దృష్టి కేంద్రీకరించారు. ఉద్యమంపై ప్రజలకు ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్లీమళ్లీ రాజేయడానికి అదేమీ ఇన్‌స్టంట్‌ కాఫీ కాదు.

- ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షను ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు, సీమాంధ్ర నేతలు ఎంత పరిహసించారో ఇప్పటికీ తెలంగాణ సమాజం మరచిపోదు. తెలంగాణను ఇడ్లీ, దోశలతో పోల్చిన నాయకులను చూశాం. కానీ వారంతా ఇతర రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు. కానీ తెలంగాణ గడ్డ మీద మీడియా వ్యాపారాన్ని చూసుకుంటున్న ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా తెలంగాణ ఉద్యమాన్ని అక్షరాల సాక్షిగా పరిహసించిన సందర్భాలు కోకొల్లలు. అందులో భాగమే ఇది. ఏకంగా తెలంగాణ ఉద్యమాన్ని ఇన్‌స్టంట్‌ కాఫీతో పోల్చి ఆయన తన అక్షర కావరాన్ని చూపించాడు. 

2014 ఫిబ్రవరిదింపుడు కళ్ళం ఆశ!

తాజా సమాచారం ప్రకారం, విభజన బిల్లును పరోక్షంగా అడ్డుకొనడానికి బీజేపీ సిద్ధపడుతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలపడుతున్నట్టు సమాచారం అందడంతో ఆ పార్టీ స్నేహం కోసం బీజేపీ నాయకులు ఇంతకుముందు కంటే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేస్తే 30 వరకు లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశాన్నట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. ఎన్డీయేలో ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయి. టీడీపీ కలిస్తే మూడు అవుతాయి. జాతీయ రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు వంటి వారిని కలుపుకొని వెళ్లడం అవసరమనీ, ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాంటే ఎన్డీయేకు లభించే బలం సరిపోదనీ, కొత్త పార్టీల సహకారం అవసరం కనుక, కొత్త మిత్రులను సమీకరించే బాధ్యతను బీజేపీ అగ్రనాయకులు చంద్రబాబు అప్పగించారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కోరుతున్నట్టు ప్రస్తుతానికి విభజనను అడ్డుకోవాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది.

- తెలంగాణ ఏర్పాటు లాంఛనమేన్న పరిస్థితుల్లోనూ రాధాకృష్ణ మానసిక పరిస్థితి ఇది. ఆ ఏర్పాటు ప్రక్రియను కండ్లతో చూసి కూడా ఏదో దింపుడు కళ్లెం ఆశ. తన దోస్తు చంద్రబాబు ఏదైనా చేయకపోతాడా? గతంలో ఢిల్లీలో తిప్పిన చక్రాలు ఇంకా మిగిలి ఉంటే వాటిని బయటికి తీసి తిప్పకపోతాడా? అని ఆశ! అంతేకాదు తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు ‘మీకు రాజకీయంగా లాభం ఉన్నది చూడండి’ అంటూ ప్లాంటెడ్‌ సలహాలు! అయినా.. అరచేతితో సూర్యడిని ఆపడం ఎవరి తరం? అట్లనే ఉదయించే సూర్యుడిలా తెలంగాణ వచ్చింది. ఇలాంటి ఆర్కేలను చీకట్లోకి నెట్టింది.


logo