బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:58

ఆంధ్ర మీడియా శవ వీక్షణ వాంఛ

ఆంధ్ర మీడియా శవ వీక్షణ వాంఛ

  • తెలంగాణపై ఓర్వలేనితనం
  • కట్టు కథలతో కనికట్టు చేసే ప్రయత్నం
  • ఉమ్మడి పాలననాటి కుట్రలకిది కొనసాగింపు
  • చేసేది దొంగపని.. పత్రికాస్వేచ్ఛ అంటూ రోత రాతలు

ఇవాళ తెలంగాణలో కొన్ని మీడియాసంస్థలు శవాలను చూడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కుప్పలు తెప్పలుగా శవాలు కనిపిస్తే తప్ప అవి శాంతించేలా కనిపించడం లేదు. ఇవాళ ప్రపంచం పరిస్థితి ఏమిటి? మనిషిని చూసి మనిషే బెదిరిపోయే ఈ దుస్థితినుంచి మోక్షమెపుడు? అనే ఆలోచనలు లేవు. ఒకసారి ఇంటినుంచి కాలు బయటపెట్టి తిరిగి వచ్చిన వాళ్లు.. పొరపాటున కరోనా సోకి ఉంటదా? అన్న ప్రశ్న వేధిస్తుంటే నిద్రలేని రాత్రులు గడిపే విషయమూ పట్టదు. కేసులు పెరగాలి. శవాలు పెరగాలి. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. అంతే! నిన్నమొన్నటిదాక టెస్టులు అన్నారు. ప్రభుత్వం టెస్టులు పెంచడంతో ఇపుడు శవాల మీద పడ్డారు. ఏడ్చేవాడికి కారణాలు కావాలిగానీ ఏడ్పు నటించేవాడికి కారణంతో పని ఏముంది? 

భారతదేశం కర్మభూమి. ధర్మభూమి. అందుకే ఇక్కడ పురాతన సాహిత్యమంతా మానవ నైతిక వర్తనకు పట్టం గట్టింది. అలాంటి సాహిత్యంలో ఒక ఆణిముత్యం సుభాషిత త్రిశతి అనబడే భర్తృహరి సుభాషితాలు. ఇది దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. దాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. తొలుత ఎలకూచి బాలసరస్వతి అనే కవి జటప్రోలు సంస్థానంలో ప్రౌఢాంధ్ర భాషలో అనువదిస్తే దాన్ని కొంత సరళంగా కంకంటి పాపరాజు.. మరింత సరళమైన భాషలో ఆ తర్వాతి కాలంలో ఏనుగు లక్ష్మణకవి అనువదించారు. అన్నికాలాలకు అన్ని ప్రాంతాలకు వర్తించే ఎన్నో ధర్మమార్గాలు, నీతిసూత్రాలు అందులో ఉన్నాయి. అలాంటి పుస్తకమొకటి ఎవరైనా రాధాకృష్ణకు ఇస్తే బాగుండు. ఎందుకంటే పాపం వారం వారం నియంతృత్వం, ప్రజాస్వామ్యం అనే నిందారోపణలు తప్ప ఆయనకు కొత్త నీతి సూత్రాలు ఏవీ దొరుకుతున్నట్టు లేదు. సదరు పుస్తకం చదవడం వల్లనైనా ఆయనకు మరిన్ని నీతిసూత్రాలు లభించి.. తద్వారా జ్ఞాన గవాక్షాలు తెరుచుకునే అవకాశం ఉండేది. 

తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ తెలంగాణ ప్రభుత్వం మీద తన అక్కసు అంతా బయట పెట్టుకున్నారు. కరోనా విషయంలో కోర్టులు చెప్పిన మాటలు రోజులు దాటుతున్నా ఇంకా ఆయన చెవుల్లో మృదుమధురంగా మార్మోగుతున్నట్టున్నాయి. ఆ పారవశ్యం మొత్తం తన పలుకుల్లో కుమ్మరించేశాడు. అంతేకాదు.. ఆ మాటలు విని ప్రభుత్వాలు సిగ్గుపడాలట. తన వంతు వారాంతపు తీర్పుకూడా ఇచ్చేశాడు.. సిగ్గుపడటానికి బదులు ఎదురుదాడికి దిగుతారా అని కన్నెర్ర చేశాడుకూడా. సరే ఆయన పలుకు, ఆయన కండ్లు.. ఎర్ర చేసుకున్నా ఏం రాసుకున్నా ఆయన ఇష్టం. ఎటొచ్చీ కుంటి గాడిదకు జారిందే సాకు అన్నట్టు ఈ సాకుతో తెలంగాణపై విషం కక్కడంతోపాటు సోషల్‌ మీడియాలో వచ్చే ఏబ్రాసి కామెంట్లన్నీ ఈ పలుకుల్లో కుమ్మరించేశారు. ప్రభుత్వం కోర్టులపై దుష్ప్రచారానికి దిగిందట. ధిక్కారానికి పాల్పడుతున్నదట. అన్ని విషయాల్లో ప్రపంచానికే ఆదర్శమని చెప్పుకునే తెలంగాణ. కరోనా విషయంలో ఎందుకు ఆదర్శంగా లేదని నిలదీతలు. నాలుగు సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచానికి ఆదర్శమైపోరట. వైద్యరంగం మీద విశ్వాసం కల్పించలేకపోయారని చెప్పేశాడు. ఇంకేం దొరకలేదేమో సోషల్‌మీడియాలో వచ్చిన కామెంట్లు ‘గాంధీ మాత్రమే కరోనా దవాఖానిన్ని అని కేసీఆర్‌ అన్నారు. మంత్రులు ప్రైవేటు దవాఖానలకు పోతున్నారు. ఉస్మానియా నీళ్లు కేసీఆర్‌ తప్పే. సచివాలయం వద్దన్నా కడుతున్నపుడు ఉస్మానియా ఎందుకు కట్టలేదు..’ వంటి కామెంట్లన్నీ ఇందులో కాపీ పేస్టుచేశాడు. సరే రాజ్యంగం విలువలు అంటూ సోది సరేసరి. దీనికి తోడు పత్రికలో పతాక శీర్షికల్లో తెలంగాణలో మరణాలు దాస్తున్నారని ఆరోపణలు చేస్తాడు. తెలంగాణ మీద దుగ్ధ. కుప్పలు తెప్పలుగా శవాలు లేవటం లేదే అని బాధ వద్దన్నా కన్పిస్తునే ఉంది. 

సరే.. కొత్త పలుకులోకి వెళ్తే ప్రభుత్వం కోర్టుల ఆదేశాలు పాటించేబదులు కోర్టులనే తప్పుపట్టే విధంగా అధికారులతో మాట్లాడించిందని ఓ ఆరోపణ. వాస్తవానికి సీఎం నిర్వహించిన సమావేశంలో అధికారులు తాము ఎదుర్కుంటున్న అనేక సమస్యలు ప్రస్తావించారు. తాము ఎంత కష్టపడ్డా గుర్తించడానికి బదులు బురద చల్లుతున్నారని, ముఖ్యంగా మీడియా కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నదని, వేలమందికి సేవచేసే క్రమంలో దొర్లే చిన్న చిన్న తప్పులను భూతద్దంలో పెట్టి చూపుతున్నదని ఆవేదన పడ్డారు. మరోవైపు కోర్టుల్లో ఏకంగా 87 పిటిషన్లమీద తిరగాల్సి వస్తున్నదని.. తమ విధుల నిర్వహణకు ఇది ఇబ్బందిగా ఉన్నదని వారన్నారు. ఇందులో దాడి ఏమున్నదో రాధాకృష్ణకే తెలియాలి. 

టెస్టులతో కరోనా పోతుందా?...

హైకోర్టు ఆక్షేపించినట్టు తెలంగాణలో టెస్టులు తక్కువ సంఖ్యలో చేయడం వాస్తవం కాదా? అంటాడు రాధాకృష్ణ. అసలు టెస్టులకు కరోనా కట్టడికి మధ్య సంబంధమేమిటో ఈయన చెప్తాడా? ప్రస్తుతం కరోనా విషయంలో అంతా నిరక్షరాస్యులే. దీన్ని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్ధ్దారిత విధానం ఉన్నదా? అందునా కరోనాలో సుమారు వందలకు పైగా రకాలున్నాయని ఇందులో స్వల్ప ప్రభావం కలిగిన వాటినుంచి తీవ్ర పరిణామాలకు దారితీసేవి ఉన్నాయని చెప్తున్నారు. నిన్నమొన్నటిదాక 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయన్నారు. ఇవాళ మన రాష్ట్రంలోనే నెలరోజుల తర్వాత లక్షణాలు బయటపడ్డ వైనం వెలుగుచూసింది. పోనీ టెస్టులు చేయడం వల్ల కరోనా తగ్గిన అనుభవాలు ఏ దేశంలోనైనా ఉన్నాయా? 

ఇటీవల బ్రిటిష్‌ ప్రధాని కరోనా విషయంలో తాను ఇంకా ముందే మేలుకొని లాక్‌డౌన్‌ పెట్టి ఉండాల్సింది.. ఆలస్యం వల్ల నష్టం వాటిల్లిందని అంగీకరించారు. అదే సమయంలో మరో మాట కూడా చెప్పారు. ‘నేను కరోనా విషయంలో నిరక్షరాస్యుడిని. దాని గురించిన వివరాలు ఏవీ నాకు తెలియవు. 

అందువల్ల నిపుణుల సూచనలు పాటించాల్సివచ్చింది’ అని. ఏ ప్రభుత్వమైనా అంతే. ప్రపంచానికి కరోనాను అరికట్టే విషయంలో గొప్పగొప్ప అనుభవాలు ఎక్కడన్నా రెడీమేడ్‌గా ఉన్నాయా? ఆయా దేశాల్లోని నిపుణుల సూచనల మేరకే వ్యవహారం నడుస్తున్నది. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన వైద్యులున్నారు. కేసీఆర్‌ చాలామంది నిపుణుల సలహాలు తీసుకున్నారు. అందువల్లనే కంటైన్‌మెంట్‌ విధానం.. హోం ఐసొలేషన్‌ విధానం అమలు చేయగలిగారు. ఇంతాచేసి టెస్టుల మీద కేసులు వేసిన వారికి ఇలాంటి పరిజ్ఞానం ఏమన్నా ఉన్నదా? కోర్టు ఆ విషయంలో ఏవైనా నిపుణుల సలహాలు స్వీకరించిందా? మనకైతే తెలియదు. అవును.. తెలంగాణలో నిన్న మొన్నటిదాక హైదరాబాద్‌తోపాటు ఒకటిరెండు జిల్లా కేంద్రాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి ఉన్నది. పల్లెల్లో ప్రజలు కట్టడి పాటించడం వల్ల అక్కడ వ్యాప్తి జరుగలేదు. వ్యాధి వ్యాప్తి ఉన్నచోటే టెస్టులు చేయడం వల్ల సంఖ్య తక్కువగా కనిపించింది. 

అవును ఆదర్శమే...

‘తెలంగాణ ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకున్నారు’ అని రాధాకృష్ణ అక్కసు వెలిగక్కారు. అవును.. కరోనా విషయంలో తెలంగాణ ఆదర్శంగానే వ్యవహరించింది. రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాకముందే గాంధీలో ప్రత్యేకవార్డు పెట్టింది తెలంగాణ. విదేశాలనుంచి వచ్చిన వారిని వచ్చినట్టుగా నేరుగా ఐసొలేషన్‌కు పంపింది. లాక్‌డౌన్‌ మొదట ప్రకటించింది తెలంగాణ. కరీంనగర్‌ ఉపద్రవం ఎదురైనపుడు కంటైన్‌మెంట్‌ విధానం అమల్లోకి తెచ్చింది తెలంగాణయే. ఆ తర్వాతే అన్ని రాష్ర్టాలు పాటించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించగానే పేదలు ఇబ్బంది పడకుండా.. లాక్‌డౌన్‌ విఫలం కాకుండా పేదలకు 12 కిలోల బియ్యం, 1500 నగదు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏ లెక్కల్లోకి రాని ఏ కార్డు లేని వలస కార్మికులకు కార్డు లేకుండా బియ్యం.. నగదు ఇచ్చింది తెలంగాణయే. కంటైన్‌మెంట్‌లో ఇంటింటికీ కూరగాయలు సరుకులు అందుబాటుకు తెచ్చింది.

కరోనా భయంతో అంతా ఇంట్లోంచి బయటకు రాని సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను దింపడమే కాకుండా.. నిరంతరంగా పేదలకు సరుకులు పంచింది తెలంగాణలోనే. ఊరూరా వాడవాడ సర్పంచులతో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించింది తెలంగాణ. కేంద్రం నిఘా నిద్రపోతున్నపుడు మర్కజ్‌ విపత్తును బయటపెట్టింది తెలంగాణయే. మొదటి దశలోనే అది బయటపడిందిగాని లేకుంటే దేశం శవాలదిబ్బగా మారి ఉండేది. దేశంలో మరే సీఎం చేయలేని విధంగా తన ప్రసంగాలతో ప్రజలకు విపత్తును వివరించి. కర్తవ్యాన్ని తెలియచెప్పింది తెలంగాణలోనే. సీఎం ప్రసంగాలతోనే కరోనా సీరియస్‌నెస్‌ ప్రజలకు తెలిసింది. దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలో తెలిసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనంత బలవర్ధక ఆహారాన్ని గాంధీలో అందించింది తెలంగాణ. ఎనభై ఏండ్ల వృద్ధులను, నిండు గర్భిణులను కూడా గాంధీలో కరోనానుంచి కాపాడింది తెలంగాణ. డాక్టర్లు.. పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకాలిచ్చి ముందుకు నడిపింది తెలంగాణ. కేవలం కరోనా రోగులకోసమే టిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ. కరోనా వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్నది, హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి హెల్త్‌కిట్లు ఇంటికే పంపుతున్నది తెలంగాణ.

ఆరేండ్లలోనే..

అన్నిరంగాల్లో ఆదర్శమని చెప్పుకునే తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారని రాధాకృష్ణ ఎకసెక్కాలాడారు. ఇపుడు నోరు మూతపడింది గాని.. రైతుల ఆత్మహత్యల సందర్భంలోనూ ఇలాంటి ఎత్తిపొడుపులే ఇదే కొత్త పలుకులో వినిపించాయి. కొత్త రాష్ట్రం పునర్నిర్మాణంలో సందర్భానికి అనుగుణంగా ప్రాధాన్యాలను ఎంచుకోవలసి వస్తుంది. ఉన్న వనరులను వాడుకోవాల్సి వస్తుంది. ఆ మేరకు కేటాయింపులు చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వాలు అరవైఏండ్లు వైద్యరంగాన్ని సర్వనాశనం చేశాయి. రాష్ర్టావతరణ నాటికి వైద్యరంగం పూర్తిగా ప్రైవేటు దయాదాక్షిణ్యాలకు వదిలి ప్రభుత్వం చేతులు దులుపుకున్న స్థితి ఉన్నది. ఆరేండ్లలోనే అంతా మాయం కాదు. అధికారం చేపట్టిన తర్వాత ఉస్మానియా ఫీవర్‌ హాస్పిటల్‌ సహా అనేక దవాఖానలను కేసీఆరే స్వయంగా సందర్శించారు. చరిత్రలో ప్రప్రథమంగా వైద్యశాలలవారీగా నిధులిచ్చారు. దవాఖానల్లో మరమ్మతులు నిర్వహించుకోవడానికి నిధులు కేటాయించారు. గత ప్రభుత్వాలకన్నా మిన్నగా వైద్యరంగానికి కేటాయింపులుచేశారు. ఒకనాడు కనీసం మార్చేందుకు దుప్పట్లు కూడా లేని దశనుంచి రోజుకొకటిగా రంగుల దుప్పట్లు మారుస్తున్నారు. డయాలిసిస్‌ సౌకర్యాన్ని జిల్లాలకు కూడా విస్తరించారు. ఏ సౌకర్యాలు మెరుగుపడకుండానే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయా? రాధాకృష్ణ చెప్పాలి. 

ఇదిగో ఇవీ లెక్కలు 

ఇంతకూ రాధాకృష్ణ చెప్పినట్టు తెలంగాణ వైద్యరంగంలో వెనుకబడి లేదు. 2019-20 సంవత్సరానికి వైద్యరంగాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నది. సాక్షాత్త్తు నీతిఆయోగ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. గత ఆరేండ్లలో ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాల రేటు బాగా తగ్గింది. రాష్ట్రంలో 96 శాతం ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరుగుతున్నాయి. కంటివెలుగు వంటి పథకం అమలుతో రాష్ట్రంలో వృద్ధులకు రెండో జీవితం లభించింది. గతంతో పోలిస్తే ప్రభుత్వ దవాఖానలకు 23 శాతం రోగులు అదనంగా వస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక నాలుగు మెడికల్‌ కాలేజీలు అదనంగా వచ్చాయి. టీకాల కార్యక్రమం 96 శాతానికి చేరింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదేం కాదు. నీతిఆయోగ్‌ ప్రకటించినవే. 43 డయాలిసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. మృతదేహాలను గ్రామాలకు చేర్చే వాహనాలు,   గర్భిణులను దవాఖానలకు తీసుకురావటం, ప్రసవానంతరం తరలించే వాహనాలు సమకూర్చిందికూడా కేసీఆర్‌ ప్రభుత్వమే. జిల్లా దవాఖానల్లో ఒక్క ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లేని స్థితినుంచి 20 హాస్పిటల్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ జరిగాయి కాబట్టే దేశంలో తెలంగాణకు మూడోస్థానం వచ్చింది. పాపం రాధాకృష్ణకు ఇది తెలిసినట్టు లేదు. 

ఎలాగైనా ఏడ్వవచ్చు

ఇంత చెప్తున్న ఆయన ఆభిమానించే ఆసియా టార్చ్‌లైట్‌ ఆంధ్రలో అధికారంలో ఉన్నకాలంలో దవాఖానలో శిశువులను చీమలు తినేసిన వైనాలు, శవాలను ఎలుకలు కొట్టేసిన వైనాలు చోటు చేసుకొన్నాయి. ఆ చంద్రుడు ఆంధ్రను పాలించిన ఐదేండ్లలో అక్కడి వైద్యశాలల గురించి తమ పత్రిక ఏనాడన్నా బాధ పడిందా? ఇవాళ ఆ రాష్ట్ర మంత్రులు ఇదే కరోనా వైద్యం కోసం ఇక్కడికి రావడం ఏం చెప్తున్నదో చెప్పాలి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా చూసినా తెలంగాణ, ఆంధ్రనే కాదు, ఏ రాష్ట్రంలోనూ వైద్యసౌకర్యాలు అంత గొప్పగా లేవు. ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకునే గుజరాత్‌లోనే ఈ మధ్య అహ్మదాబాద్‌ ప్రభుత్వ దవాఖాన.. చీకటి గదికన్నా అధ్వానమని అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించింది. రోగులను జంతువుల్లా చూస్తున్నారని కూడా అన్నది. మధ్యప్రదేశ్‌లోని ఓ వైద్యశాలలో కంచాలు లేక చేతుల్లో ఆహారం వడ్డించిన ఘటనలు పత్రికల్లోనే వచ్చాయి. పక్క రాష్ట్రంలోని దవాఖానలో పందులు స్వైరవిహారం చేస్తున్న వార్తలూ చూశాం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న ఏ దేశంలోనైనా వైద్యసౌకర్యాలు ఈ స్థాయిలోనే ఉంటాయి. విపత్తులు విరుచుకుపడుతున్నపుడు ఏ దేశంలోనూ ఎన్ని దవాఖానలున్నా సరిపోవు. అమెరికా వంటి దేశంలోనే న్యూయార్క్‌లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మరిచి తెలంగాణలో ఏదో వైద్యం అసలే అందనట్టు.. విఫలమైనట్టు రాధాకృష్ణవంటి అవగాహన లేని వారు మాత్రమే అంటారు. నిన్నటిదాక టెస్టులన్నారు. ఇవాళ మరణాలంటున్నారు. ఏడ్చేవాడికి రీజన్‌ కావాలిగానీ ఏడుపు నటించేవాడికి ఏమవసరం? దేన్ని చూసైనా ఏడ్వవచ్చు. 

కరోనా- గాంధీ

ఏదైనా విమర్శ సొంత తెలివి ఉపయోగించి చేస్తే ఫలిస్తుందిగానీ.. కాపీ పేస్టు చేస్తే ఏమతుంది? రివర్సవుతుంది.. ‘కరోనా సోకిన వారెవరైనా గాంధీకి పోవాల్సిందే అని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు మంత్రులు మాత్రం ప్రైవేటు దవాఖానల్లో చేరుతున్నారు. దీనికి సంజాయిషీ ఇవ్వాలి’ అనే సోషల్‌ మీడియా కామెంట్‌ను కూడా ఇందులో వాడేశాడు. తెలంగాణలో కరోనా వ్యాప్తి తొలిదశలో ప్రైవేటు వైద్యాన్ని నిషేధించారు. గాంధీని పూర్తిస్థాయి కరోనా దవాఖానగా మార్చారు. ఆ సందర్భంగా ప్రైవేటు వైద్యశాలలకు అనుమతి అంశం ప్రస్తావనకు వచ్చినపుడు కేసీఆర్‌ ఆ మాట చెప్పారు. ప్రైవేటుకు అనుమతినివ్వబోము. ఎవరైనా గాంధీలోనే వైద్యం చేయించుకోవాలి అన్నది సారాంశం. ఆ తర్వాత దశలో వ్యాధి వ్యాప్తి పెరిగిన సమయంలో ప్రైవేటు వైద్యానికి అనుమతి లభించింది. ఆ మేరకు మంత్రులే కాదు.. విపక్షానికి చెందిన వీహెచ్‌ కూడా ప్రైవేటు దవాఖానలోనూ వైద్యం చేయించుకున్నారు. 

ఆపడమే వాళ్ల పని

‘ఉస్మానియా దవాఖానకు ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయన్నారు.. మరి విపక్షాలు కాదన్నా సచివాలయం కడుతున్నారు కదా’ అనే మరో సోషల్‌ మీడియా పలుకును పలికించారు. కానీ ఒక్క ఉస్మానియానే కాదు.. కళాభారతి కూడా ఆగిపోయింది. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపు కూడా ఆగింది. ఎర్రమంజిల్‌లో.. రక్షణభూముల్లో సచివాలయ ప్రతిపాదన ఆగింది. కంటోన్మెంటు గుండా ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా విపక్షాల కారణంగా ఆగిపోయింది. కోర్టుల్లో ఇబ్బంది తొలిగినవి ముందుకు వెళ్తున్నాయి. మిగిలినవి నిలిచిపోతున్నాయి. కాళేశ్వరం కూడా ఇలా అడ్డంకులనుంచి బయటపడిందే. ఉస్మానియాకు హెరిటేజ్‌ చట్టాలనుంచి చాలా గొళ్లాలున్నాయి. కేసులు పూర్తికాలేదు. థర్టీ ఇయర్స్‌ జర్నలిజంకు ఈ విషయం తెలియదనుకోవాలా? 

నాలుగు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసినంత మాత్రాన ప్రపంచానికి ఆదర్శమైపోరు.. అంటాడు రాధాకృష్ణ. ఈ రాష్ట్రంలోని మంత్రులో కార్యకర్తలో అలా అనుకుంటే నీ కొచ్చిన నొప్పేమిటి? ఆదర్శం అనే పదాన్ని రాధాకృష్ణ ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే.. ప్రపంచానికి ఆదర్శమని ఎందుకు ప్రకటించుకున్నారో సంజాయిషీ ఇవ్వండి అంటాడు. ఇది జర్నలిజమేనా? ఎవరికి సంజాయిషీ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మిషన్‌ భగీరథలు, కాకతీయలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయా లేదా? కేంద్ర మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా ప్రస్తావించిందా లేదా? రైతుబంధును ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా పేర్కొన్న విషయం నిజం అవునా కాదా? రెండ్రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినోడే భారతరత్నకు అర్హుడైనపుడు.. కేసీఆర్‌ పథకాలు ప్రపంచానికి ఆదర్శం కాకుండా పోతాయా? 

విపక్షాలూ.. విశ్వసనీయత

ప్రతిపక్షాలు, మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే కార్యక్రమం చేపట్టారని రాధాకృష్ణ అభ్యంతరం. అదేదో వాళ్లకు ఉన్నట్టు. బతుకమ్మ చీరలు పంచితే ఓర్చుకోలేక తగులబెట్టినవి అవో ప్రతిపక్షాలు.. వాటికి ఓ విశ్వసనీయత.. ప్రాజెక్టులు కడుతుంటే కేంద్రానికి ఫిర్యాదులు.. కోర్టుల్లో వరుస కేసులు. ఇవీ ప్రతిపక్షాలు. కేసీఆర్‌ను ఓడించేదాక గడ్డం తీయనని ఒకడు.. ఎవరి గడ్డాన్నో కేసీఆర్‌కు అతికిస్తా అనే మరొకడు.. వీళ్లు ప్రతిపక్షాలు. శవాలను కబ్జాలో పెట్టుకొని రాజకీయాలు నడిపినోడు.. మహిళా రాజకీయనేతలను అవమానకరంగా దూషించినోడు.. వీళ్లు ప్రతిపక్షాలు. వాటికో విశ్వసనీయత. వాటిని పనిగట్టుకొని దెబ్బతీయడం. ఆ పనేదో ఎన్నికలు వస్తే ప్రజలే చూసుకుంటారు. ఇక మీడియా విశ్వసనీయత అనే గొప్ప మాటలు చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో మీడియాకు ఉన్న విశ్వసనీయత ఏ పాటిదో ఏ పాన్‌డబ్బా వాలాను అడిగినా చెప్తాడు. ఒక పార్టీని నేరుగా భజాన మోసి మీడియా విశ్వసనీయత దెబ్బ తీసిందెవరో అందరికీ తెల్సు. కొత్తగా పోస్టుమార్టం చేస్తే చంద్రజ్యోతే అందరికన్నా ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది. అయినా పత్రికలు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం మాటలు వినడానికి బాగుంటాయి. 

అయితే అలాంటి ప్రజాస్వామ్యం పరిఢవిల్లే వాతావరణం కావాలనుకున్నప్పుడు పత్రికలు కూడా అంత నిష్కళంకంగా ఉండాలి కదా? ఉన్నాయా? లేక ఎజెండాలు పెట్టుకుని పనిచేస్తున్నాయా? మేం కడుపునిండా కక్ష పెట్టుకుని విషం చిమ్ముతాం.. మీరుమాత్రం ప్రజాస్వామ్యమంటూ బుద్ధావతారాలుగా ఉండాలనడం ఏం నీతి? చంద్రబాబుకు గొడుగు పట్టడమే డ్యూటీగా పెట్టుకున్న జీవితకాలపు పాలేర్లు.. పత్రికల స్వేచ్ఛ గురించి నీతులు వల్లించడం వింతే మరి. పొద్దున్నే చంద్రబాబు దొడ్లో పేడ ఎత్తి అలుకుచల్లి వయ్యారాలు పోతూ.. తెలంగాణ లోగిళ్లలో ముగ్గులను కసికొద్ది చెరిపేసే వగలమారి పాత్రికేయులనుంచి ప్రజాస్వామ్య సూత్రాలు నేర్చుకోవాలనడం హాస్యాస్పదం. పత్రికలు పత్రికాస్వేచ్ఛ అనేది ఎజెండాలు పెట్టుకొని దాడులుచేసే మీడియా మాఫియాకు వర్తించదు. ఆ మాటకొస్తే మంచికి మంచి.. చెడుకు చెడు. నిజాయితీగా ప్రచురించే పత్రికలూ తెలంగాణలో ఉన్నాయి. వాటినుంచి ఏ ఫిర్యాదు లేదు. తమ పాచికలు పారని ఇలాంటి అపర శకుని మామల నుంచి తప్ప. విలువల గురించి ఇంత కన్నీరు గార్చిన రాధాకృష్ణ.. గతంలో కేసీఆర్‌ విశాఖ పర్యటనలో ఆయనకు స్వాగతం పలికిన ప్రజలను చూసిన కోణమేమిటి? రాసిన కోణమేమిటి? అదికూడా ఒక పాత్రికేయమేనా? చెప్పాలి. 

ఆదర్శం అనే పదాన్ని రాధాకృష్ణ ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే.. ప్రపంచానికి ఆదర్శమని ఎందుకు ప్రకటించుకున్నారో సంజాయిషీ ఇవ్వండి అంటాడు. ఇది జర్నలిజమేనా? ఎవరికి సంజాయిషీ ఇవాలి? ఎందుకు ఇవ్వాలి? మిషన్‌ భగీరథలు, కాకతీయలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయా లేదా? కేంద్ర మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా ప్రస్తావించిందా లేదా? రైతుబంధును ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా పేర్కొన్న విషయం నిజం అవునా కాదా? రెండ్రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినోడే భారతరత్నకు అర్హుడైనపుడు.. కేసీఆర్‌ పథకాలు ప్రపంచానికి ఆదర్శం కాకుండా పోతాయా? 

తాము ఎంత కష్టపడ్డా గుర్తించడానికి బదులు బురద చల్లుతున్నారని, ముఖ్యంగా మీడియా కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నదని, వేలమందికి సేవచేసే క్రమంలో దొర్లే చిన్న చిన్న తప్పులను భూతద్దంలో పెట్టి చూపుతున్నదని వైద్యులు ఆవేదన పడ్డారు. మరోవైపు కోర్టుల్లో ఏకంగా 87 పిటిషన్లమీద తిరగాల్సి వస్తున్నదని.. తమ విధుల నిర్వహణకు ఇది ఇబ్బందిగా ఉన్నదని వారన్నారు. ఇందులో కోర్టుల మీద దాడి ఏమున్నదో రాధాకృష్ణకే తెలియాలి.

ఏ సౌకర్యాలు మెరుగుపడకుండానే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయా? రాధాకృష్ణ చెప్పాలి. ఇంత చెప్తున్న ఆయన ఆభిమానించే ఆసియా టార్చ్‌లైట్‌ ఆంధ్రలో అధికారంలో ఉన్నకాలంలో దవాఖానలో శిశువులను చీమలు తినేసిన వైనాలు, శవాలను ఎలుకలు కొట్టేసిన వైనాలు చోటు చేసుకొన్నాయి. ఆ చంద్రుడు ఆంధ్రను పాలించిన ఐదేండ్లలో అక్కడి వైద్యశాలల గురించి తమ పత్రిక ఏనాడన్నా బాధ పడిందా? 

మీడియా పోషించిన పాత్ర ఏమిటి?

నిజానికి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అటు కేంద్రం ఇటు రాష్ర్టాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. అవే కాదు.. వ్యవస్థలో భాగమైన పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అనేక వ్యవస్థలు చాలా గొప్పగా పనిచేశాయి. వాళ్లు వీళ్లు అని లేకుండా అని రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కరోనా కట్టడి విషయంలో ఎప్పటికపుడు అధికారుల సమీక్షలు నిర్వహించి మహమ్మారిని ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దేశమంతా లాక్‌డౌన్‌ గొప్పగా అమలుచేశాయి. వీధుల్లోకి పురుగుకూడా అడుగుపెట్టకుండా గట్టి చర్యలు చేపట్టి ప్రజలతో శభాష్‌ అనిపించుకున్నాయి. దాని ఫలితంగానే అంతకుముందు తాము విలన్లుగా భావించే పోలీసులను, వ్యతిరేకభావనతో చూసే వైద్యులను ప్రజలు దేవుళ్లుగా కొనియాడారు. అందుకే తొలిదశ రెండు నెలలు కరోనా కట్టడి అద్భుతంగా జరిగింది. 

అదే ఊపు మరో రెండు నెలల కొనసాగిఉంటే కరోనా వ్యాప్తి పూర్తిగా నిలిచిపోయి ఉండేది. కానీ ఈ దశలో ఇద్దరు సీఎంలు, మీడియా అత్యుత్య్సాహం పరిస్థితిని నాశనం చేశాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేపట్టిన బస్సుల్లో వలసకార్మికుల తరలింపు కార్యక్రమంతో ఢిల్లీలో వలసకార్మికులు లక్షల సంఖ్యల్లో రోడ్లమీదికి వచ్చారు. అంచనా మేరకు బస్సులు సరిపోక తమ ఊళ్లకు నడక ప్రారంభించారు. మీడియా ఈ నడకలను హైలైట్‌చేస్తూ ప్రసారాల మీద ప్రసారాలు చేసింది. వీళ్ల మీద పోలీసుల లాఠీచార్జిలు, రసాయన ద్రావకాల పిచికారీలు, వందల కిలోమీటర్ల నడక అంటూ మానవీయ కథనాలతో హోరెత్తించింది. దీని ప్రభావం దేశంలో మొత్తం వలస కార్మికుల మీద పడింది. అప్పటిదాకా బయట కాలు పెట్టడానికి జంకిన వీరు రోడ్లమీదికి వచ్చారు. వలస కార్మికులు అనే సున్నిత అంశం కారణంగా పోలీసులు చూస్తుండి పోయారు.

ఈ వలసలు కరోనా వ్యాప్తికి పునాదులయ్యాయి. లాక్‌డౌన్‌ భగ్నమైంది.  లాక్‌డౌన్‌ ముగింపు దశకు వచ్చినపుడు కేంద్రం సీఎంలతో సమావేశం పెట్టింది. అప్పటికి దేశంలో కరోనా కట్టడిలోనే ఉన్నది. లాక్‌డౌన్‌ ఒక్కటే కరోనాను ఎదుర్కొనే ఆయుధమని అంతా బలమైన నిర్ణయానికి వచ్చారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకున్నాయి. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితి ఉంది. ఈ సందర్భంగా సీఎంలంతా ప్రధానితో చర్చించారు. కరోనా కట్టడికి మరో రెండు నెలలు లాక్‌డౌన్‌ పొడిగించాలని.. అదే సమయంలో కేంద్రం ఉదారంగా నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేందుకు ఆసరా కల్పించాలని కోరాయి. సీఎం కేసీఆర్‌ చెప్పిన హెలికాప్టర్‌ మనీ అన్నది ఇదే. ఇందుకోసం అవసరమైతే నోట్లు అధికంగా ముద్రించి ఇవ్వాలని కూడా రాష్ర్టాలు విజ్ఞప్తిచేశాయి. నిజానికి అదే జరిగి ఉంటే.. ఇంకో రెండు నెలలు లాక్‌డౌన్‌ కొనసాగి ఉంటే కరోనా పూర్తిగా అంతర్థానమయ్యేది. కానీ కేంద్రం ఇటు నిధులివ్వకపోవడంతోపాటు లాక్‌డౌన్‌ ఎత్తేసింది. దేశీయ విమానాలు రైళ్లు ప్రారంభించింది. దీనితో అప్పటిదాక ఉన్న కట్టడి గంగలో కలిసింది. రైళ్లలో వచ్చేవారు కరోనాను మోసుకొచ్చి విస్తరింపచేశారు. పరిస్థితి ఎవరి చేతుల్లో లేకుండా పోయింది.

తెలుగు రాష్ర్టాల్లో మీడియాకు ఉన్న విశ్వసనీయత ఏ పాటిదో ఏ పాన్‌డబ్బా వాలాను అడిగినా చెప్తాడు. ఒక పార్టీని నేరుగా భజాన మోసి మీడియా విశ్వసనీయత దెబ్బ తీసిందెవరో అందరికీ తెల్సు. కొత్తగా పోస్టుమార్టం చేస్తే చంద్రజ్యోతే అందరికన్నా ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది. 

పత్రికాస్వేచ్ఛ అనేది ఎజెండాలు పెట్టుకొని దాడులుచేసే మీడియా మాఫియాకు వర్తించదు. ఆ మాటకొస్తే మంచికి మంచి.. చెడుకు చెడు. నిజాయితీగా ప్రచురించే పత్రికలూ తెలంగాణలో ఉన్నాయి. వాటినుంచి ఏ ఫిర్యాదు లేదు. తమ పాచికలు పారని ఇలాంటి అపర శకుని మామల నుంచి తప్ప. 

ప్రపంచ దేశాలతో పోలిస్తే రెండో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అతి తక్కువ మరణాలు నమోదయ్యాయి. దీనికి మోదీ ప్రభుత్వాన్ని తప్పు పడదామా? మరణాలు తక్కువ నమోదు కావడానికి అనేక కారణాలుంటాయి. దాన్ని ప్రశంసించాల్సిందిపోయి మరణాలు ఎందుకు తక్కువ ఉన్నాయి? మరణాలు లేవేం? అని ప్రశ్నించడం ఏం విధానం?

మరణాలన్నీ కరోనావి కావు!!

ఖమ్మం జిల్లాలోని ఒక ఊళ్లో ఈ మధ్య రెండురోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అంతా కరోనా లక్షణాలున్నవారే. వీరి మరణం కరోనా వల్లేనని గగ్గోలు. ఈ మరణాలను ప్రభుత్వం ప్రకటించలేదని శోకాలు. వాస్తవాలు పరిశీలిస్తే తేలింది ఏమిటి? చనిపోయిన ముగ్గురూ వయోవృద్ధులు. అనేక రుగ్మతలున్నాయి. ఒకాయనకు హార్ట్‌ ఆపరేషన్‌ కూడా అయింది. ఈ పరిస్థితిలో కరోనా లక్షణాలుండటంతో వైద్యం అందిస్తున్నారు. చనిపోయాక సమీక్షలో వీరిలో హార్ట్‌ పేషెంట్‌ గుండె ఆగిపోయి చనిపోతే మరో ఇద్దరు తమ రుగ్మతల కారణంగా చనిపోయారని తేలింది. కేవలం కరోనా లక్షణాలున్నవన్న కారణంగా వీటిని కరోనా మరణాలుగా ప్రకటించడం సాధ్యపడదని వైద్యులు చెప్పారు. వీరి డెత్‌ సర్టిఫికెట్‌ సైతం అదేరీతిలో ఉంటుందన్నారు. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది. కరోనా వార్డుల్లో చేరి ఇతర రుగ్మతల కారణంగా చనిపోయినా సరే.. వారి డెడ్‌బాడీల అంత్యక్రియల విషయంలో కరోనా మృతులకు మల్లే జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతకాలం కరోనా వార్డులో ఉన్నాడు ఇతరులకు ప్రమాదం వాటిల్లకుండా ఆ మృతదేహాలను కూడా అదేరీతిలో జాగ్రత్తలతో అంత్యక్రియలు జరిపిస్తారు. అంతమాత్రాన ఇవి కరోనా మరణాలు కావు. 

ఎందుకు ప్రకటించరు?

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సందర్భంలో మరణాల సంఖ్యను ప్రకటించే పద్ధతి ఎక్కడాలేదు. అమెరికా ట్విన్‌టవర్స్‌ కూలినపుడు ఎంతమంది మరణించారో ప్రకటించలేదు. చైనా వూహాన్‌లో మృతుల వాస్తవ సంఖ్యనూ ప్రకటించలేదు. మన దేశంలో మతకల్లోలాలు, తుఫాన్లు, సునామీ వంటి విపత్తుల్లో కూడా అసలు సంఖ్యను ప్రకటించే ఆనవాయితీ లేదు. కలరా, మశూచి, ప్లేగు వ్యాధుల సమయంలో కూడా ప్రకటనలు చేయలేదు. కరోనా విషయమూ అంతే. దేశంలోని అనేక రాష్ర్టాలో ప్రకటిస్తున్న సంఖ్యలకు వాస్తవ దృశ్యానికి చాలా తేడా ఉన్నది. అమెరికాలో ఓ వైపు శవాలు పూడ్చడానికి స్థలంలేక చుట్టూరా ఉన్న దీవులను ఎంచుకుంటున్న దృశ్యానికి, అక్కడ ప్రకటిస్తున్న సంఖ్యలకు పొంతనే లేదు. ఇటలీలో ఎంతమంది బలయ్యారో ఎవరూ చెప్పలేదు. అన్నింటి అంతఃస్సూత్రం ఒకటే. ప్రజలు భయభ్రాంతులు కాకూడదు. వ్యవస్థమీద విశ్వాసం కోల్పోకూడదు. అదే ప్రజల మీద ప్రభుత్వం అదుపు పోయి అరాచకం చెలరేగుతుంది. ఉద్వేగాలు చెలరేగితే ఉన్మాదం ఆవహిస్తుంది.  


logo