ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:55

ఆంధ్రజ్యోతి వివరణ ఇవ్వాలి

ఆంధ్రజ్యోతి వివరణ ఇవ్వాలి

  • అన్నీ కొవిడ్‌ మరణాలు కావు
  • వార్తపై జీహెచ్‌ఎంసీ ఖండన
  • సంజాయిషీ ఇవ్వాలంటూ పత్రికకు లేఖ
  • సాధారణ మృతదేహాలకూ జాగ్రత్తలు
  • అందుకే కొవిడ్‌ కేసుల్లా కనిపిస్తున్నాయి
  • కొందరు సాధారణ మృతదేహాలను సైతం అంత్యక్రియల నిమిత్తం అందిస్తున్నారు
  • వాటినీ దహనం చేస్తున్నాం: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ శ్మశానవాటికల్లో తాము జరిపిస్తున్న అంత్యక్రియలన్నీ కొవిడ్‌ మృతులవి కాదని జీహెచ్‌ఎంసీ స్పష్టంచేసింది. కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు జారీచేసిన నిబంధనల ప్రకా రం అన్ని ముందుజాగ్రత్తలను తీసుకొంటున్నామని, మృతదేహాలను పూర్తిగా కవర్‌చేసి అంబులెన్సుల్లో క్రిమిసంహారక మందులను స్ప్రేచేసి శ్మశానవాటికలకు తరలిస్తున్నామని తెలిపింది. ఇదేసమయంలో కొవిడ్‌ మరణాలు కాని వాటికి కూడా ఇవే జాగ్రత్తలు తీసుకొంటున్నందువల్ల బయటినుంచి చూసేవారికి అవన్నీ కొవిడ్‌ మరణాలుగా అనిపిస్తాయని పేర్కొన్నది. 

ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కరోనా మరణాలకు సంబంధించి ప్రచురించిన వార్తపై జీహెచ్‌ఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్ని మరణాలను కరోనా వల్ల మరణించినట్లుగా చిత్రీకరించడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ వార్తకు సంబంధించి సంజాయిషీ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ఆంధ్రజ్యోతిని కోరింది. ఈ మేరకు ఆంధ్రజ్యోతి పత్రికకు సవరణ పంపించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణ పరిస్థితుల్లో ప్రతిరోజూ 120 నుంచి 150 మరణాలు సంభవిస్తుంటాయని, వీటికి ఆయా ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లో అంత్యక్రియలు జరుగుతుంటాయని తెలిపింది. 

మామూలు రోజుల్లో వీటికి సంబంధించిన సమాచారం ఉండదని, ప్రస్తుత వాతావరణంలో మరణాలను ఐదు క్యాటగిరీలుగా గుర్తించి, జీహెచ్‌ఎంసీ సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని స్పష్టంచేసింది. దీంతోపాటు అనుమానాస్పద మృతులు, వారిని తరలించేందుకు వినియోగించిన అంబులెన్సుల వివరాలను స్పష్టంగా పేర్కొన్నది. సాధారణ పరిస్థితుల్లో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే బాధ్యత జీహెచ్‌ఎంసీ తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ మరణాల అంత్యక్రియల విషయంలో కూడా ఆయా కుటుంబాలు జీహెచ్‌ఎంసీ సహకారాన్ని కోరుతున్నాయని సంస్థ తెలిపింది. 

స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత వల్ల అంత్యక్రియలు జరిపించటంలో కొవిడ్‌ మరణాలు కానప్పటికీ జీహెచ్‌ఎంసీ సహకారం కోరుతున్నారని వెల్లడించింది. ఏటా మరణాల సంఖ్య పెరుగుతుంటే ఈ ఏడాది మాత్రం నమోదైన మరణాలు తక్కువగా ఉన్నాయని గణాంకాలు విడుదలచేసింది. గత మూడేండ్లుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన వివరాలను పరిశీలిస్తే కొవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో మరణాల సంఖ్యలో పెరుగుదల లేదు. 2018, 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో జరిగిన మరణాలు పరిశీలిస్తే ఏ ఏడాది తక్కువగా మరణాలు నమోదైనట్లు స్పష్టమవుతున్నది. 

అంబులెన్స్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌లో తప్పు

సోమవారంనాటి నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటిపేజీలో ప్రచురితమైన ‘మరణం కాదు.. రణమే. చితిమంటలపై చలికాచుకుంటున్న ఆంధ్రజ్యోతి’ కథనంలో సీ భాస్కర్‌, ఎస్‌ శ్రీనివాసచారి, పీ శేషగిరి అనే కరోనా అనుమానితుల మృతదేహాలను తరలించిన అంబులెన్స్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు టీఎస్‌13యూబీ 4948గా అచ్చయ్యింది. ఈ మృతదేహాలను టీఎస్‌13ఈ యూబీ4984 అనే రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉన్న అంబులెన్స్‌లో తరలించారు.
logo