శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:04:41

మరణం కాదు.. రణమే..

మరణం కాదు.. రణమే..

 • చితిమంటలపై చలికాచుకుంటున్న ఆంధ్రజ్యోతి
 • కరోనా వైరస్‌ లేని శవాలతో తప్పుడు లెక్కల కథనం
 • జీహెచ్‌ఎంసీ మానవతా సాయంపైనా కరోనా కల్పిత దుష్ప్రచారం
 • తెలంగాణలో మరణాలు ఒక్కశాతం లోపే
 • జాతీయస్థాయిలో రికవరీ 63.45 శాతమే
 • రాష్ట్రంలో రికవరీ 76.45%.. దేశంలోనే రెండోస్థానం
 • కరోనా భయంతో జీహెచ్‌ఎంసీకి సహజమరణాల 
 • శవాలనూ అప్పగిస్తున్న కుటుంబ సభ్యులు
 • మానవతా దృక్పథంతో వాటినీ దహనం చేస్తున్న సిబ్బంది

కష్టమంటే ఏమిటో తెలంగాణకు తెలుసు. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే బతుకును దేవులాడుకోవడమూ తెలుసు! ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకుని బతుకును చిగురింపజేసుకునే నిరంతర వసంతకాల అన్వేషి తెలంగాణ వాసి!

మానవాళి చరిత్రలో కనీవినీ ఎరుగని మహమ్మారితో పోరాడుతున్నాం మనం. కంటికి కనిపించని చిన్ని వైరస్‌తో  భూగోళమంతా భయానక యుద్ధం చేస్తున్న సన్నివేశమిది. వైరస్‌ ఆనవాళ్లు అంతుబట్టక, మట్టుబెట్టే మార్గం కనిపించక శాస్త్ర ప్రపంచమే తలపట్టుకున్న సందర్భమిది. ప్రాణాలు రక్షించే వాళ్లే ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్న విషమ సమయమిది! కన్ను మూస్తే మరణం.. కన్ను తెరిస్తే జననం.. రెప్పపాటు జీవితం అని తెల్వనిది ఎవరికి? అయినా మనలను కాపాడేందుకు వందలాది ప్రభుత్వ వైద్య సిబ్బంది మృత్యువుకు ఎదురు నిలిచి పోరాడుతున్నారు. మన ఊపిరిని నిలబెట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు వారి ఊపిరిని పణంగా ఒడ్డుతున్నారు. రోజుల తరబడి ఇంటికి పోకుండా, గంటల తరబడి మల మూత్రాదులకూ వెళ్లకుండా, రోగులకు నర్సులు భరోసా ఇస్తున్నారు.

మరి సామాజిక బాధ్యత గల మాస్‌ మీడియా చేయాల్సిందేమిటి? దేశమూ దేహమూ... ఇల్లూ, ఒళ్లూ... మందూ మాకూ.. ఏది భద్రమో, ఏది కాదో తెలియని... తనవారే పరవారవుతున్న విపత్కాలంలో.. కరోనా విషాద వార్తలు మాకిక వద్దు మొర్రో అని సామాన్యుడు తల్లడిల్లుతున్న తరుణంలో.. పత్రికలు చేయాల్సింది ఏమిటి? జనానికి మనోధైర్యమివ్వాలా? చావు భయం కలిగించాలా? మనం వినిపించాల్సింది ఆర్తనాదాలు, ఆంబులెన్సుల రొదలనా? వైద్యుల విజయ గీతికలనా? మనం నమోదు చేయాల్సింది కరోనా విజేతల గుండె ధైర్యాన్నా.. విలాపాల ఆలాపననా? చితిమంటల్ని ఎగదోయాలా? ఆర్తజనుల్లో విశ్వాస జ్వాలల్ని రగిలించాలా? 

ఏది సంచలనమో.. ఏది మనః చంచలమో తెలియని దౌర్భాగ్యమా? ఇది జర్నలిజమా? జనం పట్ల దౌర్జన్యమా? తెలంగాణ పట్ల తెంపరితనమా? అరవై ఏండ్ల ఆంధ్రా పెత్తనంలో ఇలాంటి పచ్చి అబద్ధాల పిచ్చిరాతల్ని తెలంగాణ ఎన్ని చూసి ఉంటుంది! ఎన్నిసార్లు ఎదురునిలిచి గెలిచి ఉంటుంది! 

మనోధైర్యమే కరోనాకు మందు పిరికితనమే కరోనాకు ఆలంబన మనం ఎటువైపు ఉండాలి? ధైర్యం వైపా? దైన్యం వైపా? ప్రజల వైపా? కరోనా వైపా?

అయినా చావునెవరు దాచిపెట్టగలరు? శవాలను లెక్కగట్టి ఏం మూటగట్టుకుంటారు? చితిమంటల చీకటి వెలుగుల్లో ఏ ఉషోదయాలు చూస్తారు? 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడంలో ఆంధ్రజ్యోతిది అందెవేసిన చెయ్యి. ఒకటికాదు.. రెండు కాదు.. ఇప్పటికి అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బురదజల్లేందుకు.. అబద్ధాలను నిజాలుగా చేసేందుకు బరితెగించింది. రాష్ట్రంలో ప్రతిరోజూ వందలమంది కరోనాతో చనిపోతున్నట్టు ఓ బూటకపు కథనాన్ని వండిన ఆంధ్రజ్యోతి.. మరోసారి తన కూటనీతిని బయటపెట్టుకొన్నది. ప్రపంచంలోనే భారతదేశంలో రికవరీ రేటు ఎక్కువగా, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతున్నది. 

దేశంలో అనేక ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో రికవరీ రేటు 76.45 శాతంగా నమోదవుతున్నది. రికవరీ రేటులో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉన్నది. మరణాల రేటులోనూ 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 2.3 శాతం నమోదుకాగా, మన రాష్ట్రంలో మరణాల రేటు 0.86 శాతంగా ఉన్నది. ఇంత విస్పష్టంగా జాతీయస్థాయిలో గణాంకాలు చెప్తుంటే.. కరోనా మరణాలు కానివాటిని కూడా అవునని చెప్పడానికి గోబెల్స్‌ కథనాలకు పూనుకొన్నది. తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా కథనాలు వండుతున్న ఆంధ్రజ్యోతి.. తాజాగా కరోనానూ తనకు అనుకూలంగా మలచుకొంటున్నది.  


ఎనభై లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు 120 నుంచి 150 మరణాలు సంభవించడం సహజం. ఈ మరణాలు కూడా పలు రకాలుగా జరుగుతున్నాయి. ప్రమాదాలకు గురై.. దవాఖానల్లో చికిత్స పొందుతూ చనిపోయినవారు కొందరైతే.. ఇతర జబ్బులకు వైద్యం చేయించుకొంటూ చనిపోయేవాళ్లు ఇంకొందరు. ఇంట్లో సహజంగా చనిపోతున్న వారు కూడా ఉన్నారు. వీరు కాకుండా క్యాన్సర్‌, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులబారిన పడి కోమార్బిడ్‌ కండిషన్‌లో మృత్యువాత పడుతున్నవారున్నారు. తాజాగా కరోనా అనుమానితులు, కరోనా నిర్ధారణ జరిగిన వారిలో సంభవిస్తున్న మరణాలున్నాయి. 

మార్చి నుంచి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక దృక్పథంలో మార్పు సంభవించింది. కరోనా భయంతో ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రావడంలేదు. సహజంగా చనిపోయినా, ఇతరేతర కారణాల వల్ల చనిపోయినా బంధువులను, కుటుంబ సభ్యులను కరోనా భయం భయంకరంగా వెంటాడుతున్నది. దవాఖానల్లో ఎవరైనా చనిపోతే మృతదేహాలను అప్పగిస్తామన్నా తీసుకుపోవడంలేదు. దీనికి తోడు కాలనీల్లో, బస్తీల్లో, గ్రామాల్లో మృతదేహాలను తరలించడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఏ మృతదేహాన్ని చూసినా.. కరోనా భయం వణికిస్తున్నది. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. మోయడానికి నలుగురు కూడా రావడంలేదు. దవాఖానల్లో చనిపోతే ఇంటికి తీసుకొనిపోకుండా అదే హాస్పిటల్‌ అంబులెన్సులో శ్మశానానికి తరలిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించి అంత్యక్రియలు చేయిస్తున్నది. వివిధ సందర్భాల్లో కుటుంబ సభ్యులు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీలను సంప్రదించి అంబులెన్సులను పిలిపించి మరీ మృతదేహాలను అంతిమసంస్కారం కోసం అప్పగిస్తున్నారు.  ఇంతటి విపత్కర పరిస్థితిలో బాధ్యతాయుతంగా ప్రజల్లో భయాన్ని పోగొట్టి.. మనోధైర్యాన్ని పెంచాల్సిన ఒక పత్రిక.. ప్రభుత్వం మీద అక్కసు వెళ్లగక్కడానికి కరోనాను వాడుకోవడం దౌర్భాగ్యం. నిజానిజాలను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. శ్మశానానికి వచ్చిన ప్రతి అంబులెన్సులోనూ కరోనా మృతులే ఉన్నట్లు తప్పుడు కథనాలు వండిన ఆంధ్రజ్యోతి.. తెలంగాణ ప్రజానీకం పట్ల ఎక్కడలేని దుర్మార్గానికి ఒడిగట్టింది. కరోనాను కట్టడిచేయడంలో కానీ, రాష్ట్రవ్యాప్తంగా వైద్యసదుపాయాలు విస్తరింపజేయడంలో కానీ, ప్రజల్లో అవగాహన కల్పించడంలోకానీ.. దేశవ్యాప్తంగా కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఇతర రాష్ర్టాలను అప్రమత్తంచేయడంలో కానీ, దశలవారీగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను జాతీయస్థాయి సంస్థలే కొనియాడుతున్నాయి. 

కరోనా మరణాలను ఆడిట్‌ చేసేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం  ఓ కమిటీని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. ఈ కమిటీ అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలను కూడా అందిస్తుంది. ఆంధ్రజ్యోతిలో చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రోజూ వందల మంది చనిపోవడం నిజమే అయితే.. అది దాచేస్తే దాగేదేనా? ఇప్పటికి హైదరాబాద్‌లో గగ్గోలు పుట్టేది కాదా? ఒకవేళ ప్రభుత్వం దాచిపెట్టినా.. ప్రజల్లో ఆ సమాచారాన్ని ఆపడం సాధ్యమేనా? ఇవన్నీ తెలిసీ.. ఆంధ్రజ్యోతి ఇలాంటి తప్పుడు కథనాన్ని ప్రచురించడం తెంపరితనం కాదా? ఆరున్నర దశాబ్దాల ఆంధ్ర పెత్తనంలో ఇలాంటి పిచ్చిరాతలను, తప్పుడు ప్రచారాలను తెలంగాణ ఎన్ని చూసి ఉంటుంది? 

వారంరోజుల రికవరీ రేటు.. డిశ్చార్జిలు

తేదీ
రికవరీ శాతం
డిశ్చార్జి
19-07-2020
72.05
1,831
20-07-2020
74.12
1,885
21-07-2020
76.00
2062
22-07-2020
76.33
1281
23-07-2020
74.10
1,661
24-07-2020
74.95
1,007
25-07-2020
76.45
998


వాస్తవాలు ఏమిటి?

రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు సత్ఫలితాలిస్తుండటం వల్లనే పరిస్థితి నియంత్రణలో ఉన్నది. లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించడం, తక్షణం వైద్యం అందించడం, వ్యూహంతో ముందుకు వెళ్తుండటంతో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. హైదరాబాద్‌ దవాఖానలతోపాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వరకు చికిత్సను విస్తరించడంతో ప్రాథమిక స్థాయిలోనే వైరస్‌ బారి నుంచి బాధితులు బయటపడుతున్నారు. ఇక తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి ప్రభావవంతమైన మందులను హోం ఐసొలేషన్‌, దవాఖానల్లో అందించడంతో మెజారిటీ బాధితులు కోలుకుంటున్నారు. శనివారం వరకు రాష్ట్రంలో 54,059 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించగా, ఇందులో 41,332 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యరు. ఈ క్రమంలో దేశంలో అత్యధిక రికవరీ రేటు 87 శాతంతో ఢిల్లీ తొలిస్థానంలో ఉండగా, 76 శాతం రికవరీ రేటుతో తెలంగాణ రెండోస్థానానికి చేరింది. 

అదుపులో మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 2.3 శాతంగా ఉండగా, మన రాష్ట్రంలో 0.86 శాతంగా ఉన్నది. పెద్దమొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం అదుపులోనే ఉన్నది. వైరస్‌ సోకినవారిలో 85% మందికి ఎలాంటి ప్రమాదం లేకపోగా, కేవలం 5% మందికి మాత్రమే అత్యవసర సేవలు అవసరం అవుతున్నాయి. ఇలాంటివారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. రూ.30 వేల విలువ చేసే టోస్లీజుమాబ్‌ వంటి అత్యవసర, విలువైన మందులను బాధితులకు ఉచితంగా అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నది. దీంతో మరణాల రేటు ఒకశాతం లోపునకే పరిమితమైంది. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల శాతం మాత్రం తగ్గుతున్నది.

ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానల్లో పడకల వివరాలు


పడకలు
భర్తీ
ఖాళీలు
ఐసొలేషన్‌
11,928
627
11,301
ఆక్సిజన్
3,537
1,190
2,347
ఐసీయూ
1,616
317
1,299
మొత్తం
17,081
2,134
14,947


ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా పడకలు

రాష్ట్రంలోని అన్ని కొవిడ్‌ దవాఖానల్లో కలిపి 17 వేల పైచిలుకు పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఐసొలేషన్‌, ఆక్సిజన్‌, ఐసీయూ సదుపాయంతో ఉన్న పడకలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇందులో 2 వేల పడకలు మాత్రమే భర్తీ కాగా, దాదాపు 15 వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క గాంధీ దవాఖానలోనే 1,890 పడకలు ఉండగా, 1,075 పడకలు మాత్రమే రోగులతో భర్తీ అయినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి 61 దవాఖానల్లో కరోనా చికిత్స అందిస్తుండగా, 55 ప్రైవేటు దవాఖానల్లో చికిత్స కొనసాగుతున్నది.

జిల్లాల్లో 323 నిర్ధారణ కేంద్రాలు

ఆర్టీపీసీఆర్‌, యాంటీజెన్‌ కిట్ల ద్వారా రాష్ట్రంలో పెద్దమొత్తంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రభుత్వం పరిధిలో 16, ప్రైవేటు పరిధిలో 23 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షలు జరుగుతున్నాయి. కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాలు తెలుసుకునే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను అన్ని జిల్లాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగా పెద్దమొత్తంలో కిట్లను సమకూర్చుకొని జిల్లాలకు పంపిణీచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పీహెచ్‌సీ, అర్బన్‌ పీహెచ్‌సీ, బస్తీ, కమ్యూనిటీ, జిల్లా, ఏరియా దవాఖానల్లో వైరస్‌ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు మొత్తం 323 కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 15 వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తుండగా, త్వరలో వీటిని 25 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది.

మరణాలు అధికంగా ఉన్న రాష్ర్టాలు

గుజరాత్‌

4.21%  

మహారాష్ట్ర

3.65% 

మధ్యప్రదేశ్‌

2.97% 

ఢిల్లీ

2.94%

పశ్చిమబెంగాల్‌

71.69%

ఉత్తర్‌ప్రదేశ్‌

2.18% 

కర్ణాటక

1.97%

రాజస్థాన్‌

1.74%  

తమిళనాడు

1.65%

ఆంధ్రప్రదేశ్‌

1.11%


జాతీయస్థాయి కంటే మెరుగ్గా

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. శనివారం వరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే రికవరీ రేటు 76.45 శాతంగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. జాతీయస్థాయిలో రికవరీ రేటు 63.45 శాతంగా ఉండగా, తెలంగాణలో అంతకంటే మెరుగ్గా ఉండటం హర్షించదగ్గ పరిణామమని వైద్యనిపుణులు చెప్తున్నారు. హోంఐసొలేషన్‌తోపాటు దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తుండటంతో ప్రతిరోజూ సగటున 1,500 మంది దాకా వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో దవాఖానల్లో ఉన్నవారి కంటే మూడోవంతు మంది కరోనాను జయించి క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు.


 • లాక్‌డౌన్‌ కాలంలో:  2020 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నమోదైన మరణాలు తక్కువ
 • లాక్‌డౌన్‌ తర్వాత మరణాల సంఖ్య కొద్దిగా పెరిగింది. అయితే 2019లో నమోదైన మరణాలతో పోల్చితే తక్కువే.
 • ఇంట్లో లేదా ప్రైవేట్‌ దవాఖానల్లో కొవిడ్‌ అనుమానంతో (కొవిడ్‌ టెస్ట్‌ చేయనివారు) మరణించిన రోగిని కూడా గాంధీ దవాఖాన స్వీకరిస్తున్నది.
 • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులను చివరి నిమిషంలో గాంధీకి తీసుకువచ్చినా చేర్చుకుంటున్నారు.
 • గాంధీలో కరోనా అనుమానిత కేసులను కూడా స్వీకరిస్తున్నారు. వారిలో ఎవరైనా మరణిస్తే వారికి నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆ భౌతికకాయాలను దహనసంస్కారాలకు తీసుకెళ్లడానికి బంధువులు నిరాకరిస్తున్నారు.
 • రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న కొవిడ్‌ రోగుల కోసం గాంధీలో ఇంటెన్సివ్‌ కేర్‌ బెడ్‌లను 100 నుంచి 500లకు పెంచడంతో పాటు 1500 ఆక్సిజన్‌ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు.
 • అంబులెన్స్‌ డ్రైవర్ల సమ్మె, దహనవేదికల మరమ్మతులు, వర్షాల కారణంగా ఇటీవల కొన్ని మృతదేహాలను తరలించడంలో కొంత ఆలస్యం అయ్యింది.


logo