e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ బాసరలో ప్రాచీన విగ్రహాలు

బాసరలో ప్రాచీన విగ్రహాలు

  • బుద్ధుడు, ఖండోబా, మమ్మాయిలుగా గుర్తింపు
  • వెలుగులోకి తెచ్చిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
బాసరలో ప్రాచీన విగ్రహాలు

హైదరాబాద్‌, మే 30 (నమస్తే తెలంగాణ): వ్యాసుడు ప్రతిష్ఠించిన సరస్వతీ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన బాసరలో కొత్త తెలంగాణ చరిత్రబృందం.. ఒక బుద్ధుడి విగ్రహంతోపాటు శివలింగం, రెండు దేవతామూర్తులు, అయ్యదేవర విగ్రహాన్ని గుర్తించింది. ఇందులో ఒకటి చాళుక్యుల కాలంనాటిదని, మిగిలినవి 14, 15 శతాబ్ధాలకు చెందినవిగా భావిస్తున్నారు. ఇప్పటికే బాసరలో జైనశాసనాలు, సతిశిలలు, వీరగల్లు శాసనాలను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌ (బాసర).. తాజాగా బాసరకు కొద్దిదూరంలోని ఉపగ్రామమైన మైలాపూర్‌లోని రామ్మోహన్‌కు చెందిన పొలం వద్ద బావిగడ్డపై చెట్లచాటున ఉన్న బుద్ధశిల్పంతోపాటు పలు ఇతర విగ్రహాలను గుర్తించారు. బుద్ధుని విగ్రహం 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. బుద్ధుడు ధ్వాన స్థితిలో, భూస్పర్శముద్రలో కనిపిస్తున్నాడు. బుద్ధుని శిల్పాన్ని బాసరపౌరులు చెక్కించుకొని ఆరాధించి ఉంటారని చరిత్రకారులు స్థపతి శివనాగిరెడ్డి తెలిపారు. శివలింగం చాళుక్యశైలికి చెందిన వర్తులాకారపు అంచులున్న పానపట్టంలో ప్రతిష్ఠించి ఉన్నది. అమ్మదేవతల విగ్రహాలు విశ్వకర్మలు కొలిచే మమ్మాయిలు.

ఈ దేవతలిద్దరూ చతుర్భుజులుగా చెప్తున్నారు. చాముండ దేవతవలే చేతిలో త్రిశూలం, ఢమరుకాలు, ముందు చేతుల్లో ఖడ్గం, పానపాత్రలు ధరించి ఉన్నారు. దేవత కాళ్లకింద రెండు శిరస్సులున్నాయి. అయ్యదేవర విగ్రహం పురుషదేవుడైన మైలారదేవునిదని చెప్తున్నారు. మైలారుదేవుడినే మల్లన్న దేవుడని తెలుగు, కర్ణాటక రాష్ర్టాలవారు పిలుస్తారు. ఖండోబా అని మహారాష్ర్టులు కొలుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి ఖండేరాయుని జాగ అని పేరున్నది. ఈ పురుషదేవుడు కూడా చతుర్భుజుడే. పై చేతుల్లో త్రిశూలం, ఢమరుకాలు, ముందు చేతుల్లో ఖడ్గం, రక్షపాత్ర ధరించి ఉన్నాడు. నుదుట మూడోకన్ను, మెలితిప్పిన మీసాలున్నాయి. ఈ ఖండోబారాయుడు సిద్ధాసనంలో ఉన్నాడు. ఈ విగ్రహాలను గుర్తించడంతో మైలాపూర్‌లో ఒకప్పుడున్న శివలింగంతో ఖండేరాయుని గుడి, మమ్మాయి గుడి, బుద్ధుని ఆరాధనా క్షేత్రాలను వెలుగులోకి తెచ్చినైట్లెందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వివరించింది. ఇవి బాసరపై రోహిల్లాలు దాడిచేసినప్పుడు ప్రజలను కాపాడిన మక్కాజీ పటేల్‌ భద్రపరిచిన విగ్రహాలు కావచ్చని స్థానికులు చెప్తున్నారు. దీనికి చేరువలో సూదులమ్మ గుడి కూడా ఉన్నది. మరికొద్ది దూరంలో గుడిస్తంభాలతో కట్టిన అషుర్‌ఖాన, ముగ్గురు ముస్లిం స్త్రీలకు చెందిన సమాధులు ఉన్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు దేవాలయాల ప్రాంగణమని అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాసరలో ప్రాచీన విగ్రహాలు

ట్రెండింగ్‌

Advertisement