సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 02:48:52

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి రథం పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇది షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేశారా అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లాలోనూ గతంలో ఇలాంటి సంఘటన జరిగిందని, మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అప్పట్లో రథానికి నిప్పు పెట్టాడని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 62 ఏండ్ల క్రితం పూర్తిగా టేకు కలపతో తయారుచేశారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన రథం కాలిపోవడం రాష్ర్టానికి అరిష్టమని, బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.


logo