శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:34

రహ‘దారుణం’

రహ‘దారుణం’

  • హైవేల నిర్వహణకు నిధులివ్వని కేంద్రం
  • రాష్ట్ర ప్రభుత్వ లేఖలకు స్పందించని నాయ్‌
  • వర్షాలకు 6 ఎన్‌హెచ్‌ల పరిధిలో 22 చోట్ల ధ్వంసం
  • తాత్కాలిక పునరుద్ధరణకు రూ.2.23 కోట్లు
  • శాశ్వత పనులకు రూ. 9.78 కోట్లు అవసరం
  • నాయ్‌కి రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ రహదారుల నిర్వహణను కేంద్రం గాలికి వదిలింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(నాయ్‌)కు లేఖలు రాసినా స్పందన కరువైంది. ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ఆరు జాతీయ రహదారులు 22 చోట్ల దెబ్బతిన్నాయి. ఈ ఎన్‌హెచ్‌ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 2.23 కోట్లు, శాశ్వత పనులకు రూ. 9.70 కోట్లు అవసరమని, వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ గురువారం నాయ్‌కి లేఖ రాసింది. 

గత ప్రతిపాదనలకే దమ్మిడీ విదిల్చని కేంద్రం

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్వహణ ఏండ్లుగా అటకెక్కింది. ప్రతి ఏటా వర్షానికి గుంతలు పెద్దవి కావడమే తప్ప నాయ్‌ అధికారులూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకపోగా, గతంలో మంజూరు ఇచ్చిన వాటినీ అర్ధాంతరంగా ఆపేసింది. ఏండ్లుగా ఇదే పరిస్థితి ఉండటం.. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలతో జాతీయరహదారులు అధ్వానంగా తయారయ్యాయి. 

రాష్ట్ర 435 కిలోమీటర్ల పొడవునా కేంద్రం ఆధీనంలోని రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.234.97 కోట్లు మంజూరు చేయాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయమై గత నెల 3న రోడ్లు,భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి నాయ్‌ చైర్మన్‌కు లేఖ రాసినా స్పందన కరువైంది. 

చకచకా మరమ్మతులు

భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు వెంటవెంటనే మరమ్మతులు చేసున్నాం. మొత్తం 22 చోట్ల రహదారులు దెబ్బతినగా 19 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తి చేశాం. మరో మూడు రహదారుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

- గణపతిరెడ్డి, ఈఎన్సీ, రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖ   

logo