బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:45:52

ఏడేండ్లుగా దక్కని పాస్‌పుస్తకం

ఏడేండ్లుగా దక్కని పాస్‌పుస్తకం

  • కోర్టులో గెలిచినా కనికరించని రెవెన్యూ అధికారులు
  • నల్లగొండ జిల్లా గుర్రంపోడు తాసిల్‌లో వృద్ధురాలి నిరసన

గుర్రంపోడు: అన్యాక్రాంతమైన తమ భూమిని కోర్టు ద్వారా తిరిగి పొందినా రెవెన్యూ అధికారులు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల వైఖరికి నిరసనగా కుమారుడితో కలిసి తాసిల్దార్‌ కార్యాలయంలో బైఠాయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుర్రంపోడులో సోమవారం చోటుచేసుకున్నది. మండలంలోని చేపూ రు గ్రామానికి చెందిన శంభు లక్ష్మమ్మ 1976లో తన భర్త మల్లయ్య చనిపోవడంతో ఒక్కగానొక్క కుమారుడు వీరేశంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. ఇదే అదునుగా భావించి కొందరు 13.07ఎకరాల ఆమె భూమిని అక్రమంగా పట్టాచేసుకున్నారు. దీంతో బాధితురాలు కోర్టుకు వెళ్లి భూమిని దక్కించుకున్నారు. ఏడేండ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. భూమిని ఆన్‌లైన్‌లో తన పేరిట నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు సహకరించకపోవడంతో సోమవారం సాయంత్రం తాసిల్దార్‌ చాంబర్‌లో కూర్చొని నిరసన తెలిపారు. పాస్‌పుస్తకాలు ఇవ్వాలని వేడుకున్నారు. అధికారులకు కనికరం లేకుండా పోయిందని తల్లీకొడుకులు వాపోయారు. తాసిల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో స్థానిక ఎస్సై సైదులు జోక్యంచేసుకొని నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.


logo