మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 21:42:52

'విద్యార్థులకు మేలు జరిగే విధంగా విద్యా విధానం'

'విద్యార్థులకు మేలు జరిగే విధంగా విద్యా విధానం'

హైద‌రాబాద్ : ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 వల్ల విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోకుండా రాష్ట్రంలోని విద్యార్థుల‌కు మేలు జరిగే విధంగా విద్యను అందించాలన్నదే ఈ ప్రభుత్వ తపన అని మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ అన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, ఇతర విద్యా సంబంధ అంశాలపై బుధ‌వారం న‌గ‌రంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశ‌మైంది.  ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆగిపోకుండా ఉండాలని ఆన్‌లైన్ విద్య అందిస్తున్న‌ట్లు తెలిపారు. 86 శాతం మందికి ఆన్‌లైన్ విద్య అందుతుంది అనేది సర్వే ద్వారా తెలిసిందన్నారు.

విద్యార్థులకు విద్య అందించడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. పాఠశాలల పున: ప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. రాష్ట్రంలోని విద్యాలయాలలో కామన్ రూల్ పెట్టుకొని విద్యావ్యవస్థ నడిచే విధంగా నిబంధనలు రూపొందించాల‌న్నారు. తెలంగాణ ప్రభుత్వంలో విద్య అందరికి సమానమేన‌న్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో ఎలాంటి బేధాలు లేకుండా విద్యా వ్యవస్థ నడిపించాల‌న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో ఈ నిబంధనలు ఒకే విధంగా ఉండాలన్నారు. ఈ స‌మావేశంలో విద్యా శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల అధికారులు పాల్గొన్నారు.logo