బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 13:12:39

ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల మార్గదర్శకాల్లో సవరణ

ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల మార్గదర్శకాల్లో సవరణ

సిద్దిపేట : కొవిడ్ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, సురక్షిత విధానంలో నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం స్టార్ క్యాంపెయినర్ల కు సంబంధించి సవరించిన తాజా మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు.

గతంలో జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి గరిష్ఠంగా స్టార్ క్యాంపెయినర్లు గా 40 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ జాబితాను 30 మందికి కుదించిందన్నారు. అలాగే గుర్తింపు లేని నమోదు కాబడిన రాజకీయ పార్టీల నుంచి గరిష్ఠంగా స్టార్ క్యాంపెయినర్లు గా 20 మందికి అవకాశం ఉండగా.. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ జాబితాను 15 మందికి కేంద్ర ఎన్నికల సంఘం పరిమితం చేసిందని ఆయన తెలిపారు.

ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి 10 రోజుల్లోగా రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహించే స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలను తాజా మార్గదర్శకాల ప్రకారం సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రాజకీయ పార్టీలు సమర్పిస్తే సవరించిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులోగా తిరిగి సమర్పించాల్సి ఉంటుందన్నారు. స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచార కార్యక్రమం నిర్వహించే కనీసం 48 గంటల ముందు జిల్లా ఎన్నికల అథారిటీకి ప్రచార అనుమతుల కోసం రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

కొవిడ్ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు సురక్షిత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి కోరారు.


logo