శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:41

ప్రాణం నిలుపడమే శ్వాసగా..

ప్రాణం నిలుపడమే శ్వాసగా..

  • ఆపత్కాలంలో అండగా అంబులెన్స్‌ సిబ్బంది
  • కరోనాపై అలుపెరుగని పోరులో ముందువరుస
  • కష్టకాలంలో మడమతిప్పని రథసారథులు 

వైద్య పరిభాషలో ‘గోల్డెన్‌ అవర్‌' అత్యంత కీలకం. అది ప్రమాదమైనా.. కరోనాతో సతమతమవుతున్నా.. మెరుపువేగంతో దూసుకొచ్చి నిమిషాల వ్యవధిలో దవాఖానకు చేర్చేబాధ్యతలో నిమగ్నమవుతున్నారు అంబులెన్స్‌ డ్రైవర్లు, సిబ్బంది. ఫోన్‌చేస్తే చాలు.. మేమున్నామని వచ్చి వాలుతున్నారు. క్షణాల్లో దవాఖానలకు చేర్చి కరోనా రోగుల ఊపిరికి ఊపిరవుతున్నారు. ప్రధానంగా 108 సిబ్బంది కరోనా రోగులను దవాఖానలకు చేర్చే విధుల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. 

ఒక్కరోజు కూడా లీవ్‌ తీసుకోవట్లే 

మా కుటుంబసభ్యులు డ్యూటీకి వెళ్లవద్దని వారిస్తున్నారు. అయినా మేం డ్యూటీలు చేస్తూనే ఉన్నాం. నెలలో ఒక్క రోజు కూడా లీవ్‌ తీసుకోకుండా పనిచేస్తున్నాం. రోజుకు 12 గంటలపాటు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కొవిడ్‌ పేషెంట్ల దగ్గరికి పీపీఈ కిట్లు వేసుకుని వెళ్తున్నాం.  

- శ్రీనివాస్‌రెడ్డి, 108 డ్రైవర్

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ కష్టకాలంలో పలువురు బాధి తుల ప్రాణాలు నిలుపడంలో అంబులెన్స్‌ సిబ్బంది పాత్ర సైతం ప్రముఖమైనదే. రోగి సమాచారం వచ్చింది మొదలు దవాఖానకు చేర్చేవరకు అంబులెన్స్‌ డ్రైవర్లు, సిబ్బందిదే బాధ్యత. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో వీరు.. అందరికన్నా ముందుండి పోరాడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్‌ డ్రైవర్లు సిబ్బంది కలిపి మొత్తం దాదాపు 1500 మంది వరకు నిత్యం కరోనా పోరులో తమవంతుగా శ్రమిస్తున్నారు. రోగులను తరలించే క్రమంలో వీరూ కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 20 మంది కరోనా బారిన పడ్డారు.

తినేముద్ద పక్కన పెట్టి సేవలకు..

‘ఫలానా ఏరియాలో రోగికి శ్వాస ఆడటం లేదు..అర్జెంట్‌గా దవాఖానకు తీసుకెళ్లాలి’ అని ఫోన్‌ వచ్చిందే ఆలస్యం.. తినే ముద్ద కూడా పక్కన పెట్టి పరుగులు పెడుతున్నారు. కరోనా సోకి హోంక్వారంటైన్‌లో ఉన్న వారి దగ్గరి నుంచి కరోనా లక్షణాలున్న అనుమానితుల వరకు ప్రతి ఒక్కరిని తాకక తప్పదు. అందుకే వారుకూడా డాక్టర్ల మాదిరిగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకున్న గంట వరకైతే ఇబ్బంది ఉండదు. గంటలతరబడి ఉంటే చెమట, ఇతర సమస్యలతో నరకం అనుభవించక తప్పదు. కొన్నిసార్లు రోగిని సకాలంలో వైద్యశాలకు చేర్చినా బెడ్‌ ఖాళీలేకపోతే గంటల తరబడి వెంట ఉండాల్సిందే. ఇలాంటి బాధలన్నీ భరిస్తూ సేవలందిస్తున్నారు. ఒక ప్రాణం కాపాడే మహాక్రతువులో తాము భాగస్వాములవుతున్నామన్న చిరునవ్వుతో నిత్యం విధులకు పునరంకితమవుతున్నారు. 

ఛీత్కారాలు భరిస్తూ సేవలు

ఆపద వేళ రథసారథుల్లా ముందుండే వీళ్లకు నివాసప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ‘మీరు అంబులెన్స్‌ల్లో రోగులను ముట్టుకొని వస్తున్నారు. మీరుంటే మాకు రోగాలు అంటుకుంటాయి’ అంటూ కొందరు ఇంటి యజమానుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లను తీసుకొస్తున్న వారు కుటుంబాలకు దూరంగా కనీసం వారం రోజుల వరకు గడపాల్సి వస్తున్నది. తమకు కరోనా సోకినా, ఆ ఇబ్బంది ఇంట్లో వారికి రాకూడదన్న ఉద్దేశంతో విధులు నిర్వర్తిస్తున్నారు. 

మరిన్ని సదుపాయాలు కల్పించాలి 

కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌వారియర్స్‌లో ముందుండేది మేమే. అనుమానితుల నుంచి పాజిటివ్‌ పేషెంట్ల వరకు అందరినీ దవాఖానకు తీసుకురావాలి. ఏ పరిస్థితిలోనైనా సరే విధులు నిర్వర్తించేందుకు మేం సిద్ధం. ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేస్తున్న మాకు కనీస వసతులు కల్పించాలి. కొవిడ్‌ విధుల్లో ఉంటున్న మా సిబ్బందికి రోజుకు రూ.400 ఇవ్వాలని నిబంధనలు ఉన్నా, హైదరాబాద్‌లో ఉండి డ్యూటీలు చేస్తున్నవారికి ఒక్కరూపాయి ఇవ్వడం లేదు. జిల్లాల నుంచి వచ్చిన వారికి రూ.150 ఇస్తున్నారు. హైదరాబాద్‌లో డ్యూటీ చేసే వారికి వసతి, మంచి ఆహారం కల్పించాలని కోరుతున్నాం.

-అశోక్‌ పల్లె, తెలంగాణ రాష్ట్ర 108 ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌

తినడానికీ తీరికుండదు 

రోజుకు 10 నుంచి 11 వరకు కొవిడ్‌ కేసులు వస్తుంటాయి. ప్రతి కేసూ ఎమర్జెన్సీనే. ఎక్కడ నిమి షం ఆలస్యం చేసినా ప్రా ణాలకే ముప్పు. అందుకే కాల్‌ వచ్చిన వెంటనే బయలుదేరుతున్నాం. కొన్నిసార్లు సమయానికి తిండి తినే తీరిక ఉండదు. రోజంతా పీపీఈకిట్లు వేసుకుని ఉండాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయినా ఒక ప్రాణం కాపాడుతున్నామన్న తృప్తి ఉంటుంది.

- రాజశేఖర్‌రెడ్డి, 108 సిబ్బంది


logo