బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:46

దళితులకు సాంకేతిక విద్య అంబేద్కర్‌ లక్ష్యం

దళితులకు సాంకేతిక విద్య అంబేద్కర్‌ లక్ష్యం

  • ఇందులోనే ఎక్కువ ప్రయోజనాలని ఊహించారు 
  •  జాతీయవెబినార్‌లో బోయినపల్లి వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బడుగు, బలహీనవర్గాలవారికి ఉన్నత విద్య అందాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోరుకున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఆర్ట్స్‌, లా కోర్సుల్లో కంటే.. శాస్త్ర, సాంకేతికవిద్యతోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అంబేద్కర్‌ ఆనాడే కోరుకున్నారని చెప్పారు. దళితులు శాస్త్ర, సాంకేతిక విద్యలో పాలుపంచుకోలేకపోయారని పేర్కొన్నారు. శుక్రవారం ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అండ్‌ హిజ్‌ ఫర్‌ దళిత్‌ ఎడ్యుకేషన్‌' అంశంపై జరిగిన జాతీయ వెబినార్‌లో వినోద్‌కుమార్‌ ఢిల్లీ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్నంత ఆధునిక శాస్త్రసాంకేతిక విద్య ఆనాడు లేనప్పటికీ ఈ రంగాల్లో ప్రత్యేకంగా విద్యాసంస్థలు మాత్రం నెలకొల్పారని చెప్పారు. ఈ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయని భావించిన అంబేద్కర్‌.. దళితులకు కూడా శాస్త్రసాంకేతిక విద్య అందాలని కోరుకున్నారని తెలిపారు. అంబేద్కర్‌ చొరువతో దళితులకు ఈ అవకాశం కలిగిందని, ఇండస్ట్రియల్‌ యూనిట్లు అయిన ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌, రైల్వే వర్క్‌షాప్‌లలో ఎక్కువ అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. దళిత విద్యార్థుల కోసం ఐఐటీలు, ఎన్‌ఐటీలు, టెక్నికల్‌ యూనివర్సిటీలు, ఎడ్యుకేషనల్‌ హబ్స్‌, రీసెర్చ్‌ గ్రాంట్స్‌, ఉద్యోగాలు కల్పించే ఏర్పాటుచేశాయని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉండేలా ఒక వ్యవస్థను నిర్మించాలని కోరుకున్నారని చెప్పారు. అంబేద్కర్‌ బ్రిటిష్‌ విద్యావిధానాన్ని వ్యతిరేకించలేదని, దానికి మానవత్వాన్ని ఇవ్వాలనుకున్నారని, ఉన్నతమైన మనుషులను తయారుచేసే విద్యావ్యవస్థ ఉండాలని కోరుకున్నారని వివరించారు. ఇది ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతుందని భావించారని అన్నారు.logo