శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 00:19:35

పారిశ్రామికవేత్తలే అంబాసిడర్లు

పారిశ్రామికవేత్తలే అంబాసిడర్లు

  • దెబ్బతిన్న పరిశ్రమలకు ప్రభుత్వం బాసట 
  • పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరో నా సంక్షోభంతో దెబ్బతిన్న పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ చెప్పారు. పరిశ్రమలను ఆదుకొనే విధాన రూపకల్పనకు ప్రభుత్వం వివిధ పారిశ్రామికవర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నదని తెలిపారు. పరిశ్రమల యజమానులే ప్రభుత్వానికి అంబాసిడర్లని, వారి ద్వారా ఇక్కడి సానుకూల పరిస్థితులను ఇతరులకు వివరించడానికి అవకాశముంటుందన్నారు. ఆదివారం అసోచామ్‌ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ వల్ల కొన్ని పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినగా మరికొన్నింటిపై ప్రభావం తక్కువగా ఉందని, వాటన్నింటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతివ్వటంతో అన్ని పరిశ్రమలు నడుస్తున్నాయని తెలిపారు.  సమావేశంలో హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌చౌతాలా, ఒడిశా, ఏపీ పరిశ్రమలశాఖల మంత్రులు శంకర్‌మిశ్రా, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డీపీఐఐటీ కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.


logo