బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:27

తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ కేంద్రం

తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ కేంద్రం

 • ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి
 • ఓ విదేశీ  కంపెనీ ఒక రాష్ట్రంలో ఇంత పెట్టుబడి పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి
 • మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ఫలితం
 • డాటా సెంటర్‌ పరిధిలో మూడు ఏజెడ్‌లు
 • 2022 నుంచి అందుబాటులోకి ఏడబ్ల్యూఎస్‌
 • అమెజాన్‌ పెట్టుబడులపై కేటీఆర్‌ హర్షం 

మరిన్ని కంపెనీలు రానున్నాయి..

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఈ పెట్టుబడి తరువాత అనేక కంపెనీలు తమ  డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. తెలంగాణ రాష్ర్టానికి అమెజాన్‌కు మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం కాగలదన్న విశ్వాసం ఉన్నది. ఐటీ శాఖ మంత్రి  కే తారకరామారావు

తెలంగాణ కీర్తి కిరీటంలో మరో మాణిక్యం. ఓ వైపు ఐటీ.. మరోవైపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో దేశంలోనే శిఖరాయమానంగా వెలుగుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొట్టమొదటిసారి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తరలివచ్చింది. ప్రపంచశ్రేణి బహుళజాతి సంస్థ అమెజాన్‌.. హైదరాబాద్‌ కేంద్రంగా తన కార్యకలాపాలను విస్తరించబోతున్నది. ఐటీ రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద వెబ్‌సర్వీసెస్‌ డాటా సెంటర్‌ను స్థాపించడానికి  ఏకంగా రూ.21 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించడం తెలంగాణ పెట్టుబడుల చరిత్రలో కీలకమైన మైలురాయి. ఒక బహుళజాతి సంస్థ ఇంత భారీ మొత్తంలో దేశంలో పెట్టుబడి పెట్టడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సమాచార భద్రతకు అత్యంత సురక్షిత స్థావరంగా హైదరాబాద్‌ను ప్రపంచం గుర్తించింది. అందుకే ఇక్కడ సర్వర్లు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. కరోనా, ఆర్థిక మాంద్యాలు.. హైదరాబాద్‌కు పెట్టుబడుల వరదను నిరోధించలేకపోతున్నాయంటే కారణం ప్రభు త్వ సులభతర వాణిజ్య విధానం, పారిశ్రామిక విధా నం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహమే. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఆరేండ్లుగా చేస్తున్న కృషికి ఫలితాలు ఒక్కటొక్కటిగా కనిపిస్తున్నాయి. 

 • ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద పెట్టుబడి
 • మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ఫలితం
 • హైదరాబాద్‌లో వెబ్‌ సర్వీసెస్‌ కేంద్రం ఏర్పాటు 
 • దీని పరిధిలో మూడు అవైలబిలిటీ జోన్లు
 • 2022 నుంచి అందుబాటులోకి  అమెజాన్‌ పెట్టుబడులపై కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్‌ సంస్థ తమ రెండో వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దాదాపు రూ.20,761 కోట్ల (2.77 బిలియన్‌ డాలర్ల) పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌ ముందుకొచ్చినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం వెల్లడించారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌గా ఎంచుకున్నదని తెలిపారు. ఈ సెంటర్‌ను 2022లో అందుబాటులోకి తెస్తామని అమెజాన్‌ సంస్థ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో గురువారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో అమెజాన్‌ సంస్థ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అమెజాన్‌ సంస్థతో తాను వరుసగా జరిపిన సమావేశాల కృషి ఫలితమే ఈ పెట్టుబడి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పారదర్శక, వేగవంతమైన విధానాల వల్లనే రాష్ర్టానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్‌ లాంటి ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశమున్నదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అమెజాన్‌ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ లాంటి డాటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్‌ ఎకానమీ, ఐటీ రంగం మరింత వృద్ధి చెందనున్నాయి. దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లకు మరింత ఊతం లభించనుంది. ఫలితంగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో యువతకు ఉపాధి లభించనుంది.

మూడు అవైలబిలిటీ జోన్లు

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రీజియన్‌లో మూడు అవైలబిలిటీ జోన్లు (ఏజెడ్‌) ఉంటాయని, వీటిలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇవన్నీ ఒకే రీజియన్‌లో ఉన్నప్పటికీ.. ప్రతి డాటా సెంటర్‌ దేనికదే స్వతంత్రంగా పనిచేస్తుందని వివరించారు. తద్వారా విద్యుత్‌ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న ఏషియా పసిఫిక్‌ అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రీజియన్‌.. 2022 ప్రథమార్థంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. 

భారత్‌లో మరింత విస్తరణ: అమెజాన్‌

భారత్‌, ఆస్ట్రేలియా, గ్రేటర్‌ చైనా, జపాన్‌, కొరియా, సింగపూర్‌ దేశాల్లో తొమ్మిది ఏడబ్ల్యూఎస్‌ రీజియన్లు, 26 ఏజెడ్‌లు ఉన్నాయని, వాటికి తోడుగానే హైదరాబాద్‌లో మూడు ఏజెడ్‌లతో ఒక ఏడబ్ల్యూఎస్‌ను నెలకొల్పుతున్నామని పునీత్‌ చందోక్‌ తెలిపారు. ప్రపంచమంతటా మౌలిక సదుపాయాల వసతి ఉన్న ప్రాంతాల్లో తమకు 77 ఏజెడ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌, ఇండొనేషియా, జపాన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో త్వరలో ఐదు ఏడబ్ల్యూఎస్‌లను, 15 ఏజెడ్‌లను ప్రారంభించనున్నామని తెలిపారు. డాటా రంగంలో తమ ఏడబ్ల్యూఎస్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలతో పోటీ పడుతుందని పేర్కొన్నారు. మరింత మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్న బిల్డర్లు, వాణిజ్యవేత్తలకు సాధికారత కల్పించడమే ఈ దేశంలోని తమ మిషన్‌ లక్ష్యమని వెల్లడించారు. భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో తాము ఒక చోదకశక్తి ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో తాము ఏడాదో లేక రెండేండ్లపాటో ఉండేందుకు రాలేదని సుదీర్ఘకాలం తమ కార్యకలాపాలను కొనసాగించనున్నామని స్పష్టంచేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తమ ముంబై రీజియన్‌ను 2016లో ప్రారంభించిందని, గత ఏడాది మే నెలలో తమ మూడో ఏజెడ్‌ను ఆవిష్కరించిందని చందోక్‌ గుర్తుచేశారు. ఈ దేశంలో పలు బ్యాంకులు, ఆటోమొబైల్స్‌, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు తమ సేవలు పొందుతున్నాయని తెలిపారు. ఏడబ్ల్యూఎస్‌ అకాడమీ, ఏడబ్ల్యూఎస్‌ ఎడ్యుకేట్‌ సంస్థల ద్వారా స్థానిక డెవలపర్లు, విద్యార్థులు, రాబోయే తరం ఐటీ లీడర్లలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  

వెబ్‌ డెవలపర్లకు, స్టార్టప్‌లకు లాభం

అమెజాన్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ వెబ్‌సిరీస్‌ ద్వారా వేల సంఖ్యలో వెబ్‌ డెవలపర్లకు, స్టార్టప్‌లకు, ఐటీ కంపెనీలకు లాభం చేకూరనుంది. భారీ ఎత్తున డాటా సెంటర్లు అందుబాటులోకి రాను న్న నేపథ్యంలో ఈ-కామర్స్‌, ప్రభుత్వరంగం, బ్యాంకింగ్‌, విద్య తదితర రంగాలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ (ఇండియా, సౌత్‌ ఏషియా) పునీత్‌ చందోక్‌ చెప్పారు. భారత్‌ వంటి అభివృద్ధికి అవకాశమున్న మార్కెట్‌లో తమ విస్తరణ బహుళ ప్రయోజనకారిగా ఉండగలదని పేర్కొన్నారు. 

మరిన్ని డాటా సెంటర్లు : మంత్రి కేటీఆర్‌

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా రూ.20,761కోట్లు పెట్టుబడిగా తెలంగాణకు రావడం పట్ల ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తంచేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక చర్చలను దావోస్‌ పర్యటనలో ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా వస్తున్న పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని పేర్కొన్నారు. ఈ పెట్టుబడి తరువాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని, అ లాంటి వారందరికీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అమెజాన్‌ లాంటి ప్రఖ్యాత కంపెనీ తమ భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడాన్ని బట్టి ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతున్నదన్నారు. పారదర్శకత, వేగవంతమైన విధానాల వల్లనే భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన విధానాల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఇప్పటికే ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతోపాటు ఇన్నోవేటివ్‌ స్టార్టప్‌లకు, నైపుణ్యం కలిగిన మావన వనరులకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారిందని పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికి అమెజాన్‌కి మధ్య ఉన్న బంధం మరిం త బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్‌ తన అతి పెద్ద కార్యాలయానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు.