శనివారం 06 జూన్ 2020
Telangana - May 18, 2020 , 00:52:32

వావ్‌.. తెలంగాణ రాణీకి వావ్‌

వావ్‌.. తెలంగాణ రాణీకి వావ్‌

  • కామారెడ్డి జిల్లాలో అద్భుత కట్టడం
  • మైమరిపించే శిలాకృతులతో దిగుడు బావి
  • ఆదరణ లేక ధ్వంసమవుతున్న చారిత్రక నిర్మాణం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: గుజరాత్‌లోని రాణీకి వావ్‌ ప్రపంచానికి సుపరిచితం. ప్రపంచవారసత్వ నిర్మాణంగా యునెస్కో గుర్తించిన ఈ కట్టడం ఇప్పటికీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. భూగర్భంలోకి తొలుచుకుంటూ నిర్మించిన ఈ బావి దానికదే ప్రత్యేకం. అచ్చం అలాంటి నిర్మాణమే తెలంగాణలో కూడా ఉంది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఉన్న ఈ అద్భుత నిర్మాణం ఆదరణకు నోచక మరుగునపడి శిథిలమవుతున్నది. 

అనేక ప్రత్యేకతలు..

సాధారణంగా చూస్తే ఈ నిర్మాణం ఒక నీళ్లబావిలా కనిపిస్తుంది. కానీ దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతువరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మెట్ల వరుసలు, రహస్య ద్వారాలు, ఆహ్లాదకరంగా సేదతీరేందుకు విశాలమైన గదులతో పలు అంతస్తులుగా దీనిని నిర్మించారు. ఈ కట్టడానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలో ఆరు రహస్య ప్రవేశ ద్వారాలున్నప్పటికీ ప్రధాన ద్వారం మినహా ఎటుచూసినా మూసి ఉన్నట్టే కనిపిస్తుంది. రహస్య ద్వారంగుండా లోపలికి వెళితే సరాసరి దిగుడుబావి రెండో అంతస్థులోకి చేరుకుంటాము. అక్కడి నుంచి మరింత కిం దికి దిగేందుకు మెట్లు ఉన్నాయి. ప్రధాన ద్వారంవద్ద స్వాగత తోరణంలాగా భారీ స్థూప నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. వీటిపై వైష్ణవ సంప్రదాయంలోని శంఖము, చక్రము వాటి మధ్య వృషభం గుర్తులు చెక్కారు. వీటికి ఇరువైపులా పుష్పాలంకరణలు అద్భుతంగా చెక్కి ఉన్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి దీనిని 18వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫీయత్తులో లిఖించబడింది.

దిగుడు బావిని పరిరక్షించాలి

చారిత్రక నేపథ్యం ఉన్న దిగుడు బావిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.  దీనిని కాపాడుకుంటే మన చరిత్ర గొప్పతనాన్ని భావితరాలకు అందించినట్లు అవుతుంది. చెత్తాచెదారంతో బావిని పూడ్చేస్తున్నారు. కనీస మరమ్మతులు చేస్తే పరిరక్షించిన వాళ్లం అవుతాం.

- శశిప్రీతం, లింగంపేట నివాసి

చరిత్రను వెలికితీయాలి

పాపన్నపేట సంస్థానం చాలా పెద్దది. పాపన్నపేట పాలకులు ఇక్కడఅనేక ఆలయాలు నిర్మించారు. అందులో ఈ రాతి కట్టడం ఒకటి అని పూర్వీకులు చెప్పేవారు. పరిశోధిస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలుంటాయి. 

- వంశీ, లింగంపేట నివాసి


logo