మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 04:15:17

మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు

మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు

  • సరస్వతి, పార్వతి పంప్‌హౌజుల్లో 4 మోటర్లు ఆన్‌
  • నంది, గాయత్రిలో  2 మోటర్ల చొప్పున.. 
  • నేటి ఉదయం నుంచి లక్ష్మి పంప్‌హౌజ్‌లోనూ.. 
  • ఎస్సారార్‌ నింపడమే లక్ష్యంగా తరలింపు

హైదరాబాద్‌/పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మోటర్లు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఎత్తిపోతలు మొదలుకావడం ఇదే ప్రథమం. గతంలో నంది, గాయత్రి పంప్‌హౌజుల్లో మోటర్ల ద్వారా ఎస్సారెస్పీ వరదకాలువ నింపేందుకు నీటిని ఎత్తిపోశారు. అయితే గోదావరి నది నుంచి జలాల ఎత్తిపోత మాత్రం ఇప్పుడే మొదలైంది. అంచెలంచెలుగా ఎత్తిపోత పరిమాణాన్ని పెంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులు కూడా ముమ్మరంగా సాగుతున్న దరిమిలా ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో రోజుకు మూడు టీఎంసీల జలాల ఎత్తిపోత సాకారం కానున్నది. 

జలాశయాలకు తరలింపు..

గోదావరి బేసిన్‌లో వానకాలం సీజన్‌ జోరుగా మొదలవడంతో ప్రాజెక్టుల పరిధిలోని చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయి. అయితే ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాశయాలన్నింటినీ నింపేందుకు కార్యాచరణ మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు మోటర్లను ఆన్‌చేశారు. తొలుత లింక్‌-2లోని నంది, గాయత్రి పంప్‌హౌజుల్లో రెండు చొప్పున మోటర్లను ప్రారంభించారు. అనంతరం సరస్వతి, పార్వతి పంపుహౌజుల్లోనూ నాలుగు చొప్పున మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోతల మొదలుపెట్టారు. సరస్వతి పంప్‌హౌజ్‌లోని 1, 3, 5, 7వ పంపులను ఆన్‌ చేసి 11,600 క్యూసెక్కుల నీటిని పార్వతి పంపుహౌజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. సరస్వతి బరాజ్‌లో 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.23 టీఎంసీల నీరు ఉన్నది. దీంతో పంప్‌లను ఆన్‌ చేసి ఎగువన గల పార్వతి బరాజ్‌లోకి రోజుకు  ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ఉన్న పార్వతి పంప్‌హౌజ్‌లోని నాలుగు మోటర్లను ఆన్‌ చేసి రోజూ టీఎంసీ నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర (ఎస్సారార్‌) జలాశయానికి గోదావరి జలాల తరలింపు మొదలైంది. కాగా, కీలకమైన లక్ష్మి పంపుహౌజ్‌లో బుధవారం ఉదయం మోటర్లను ప్రారంభించనున్నట్లు కాళేశ్వరం ఈఎన్సీ ఎన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. తొలుత నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్న అధికారులు.. క్రమంగా వాటిసంఖ్యను పెంచుతూ రోజుకు రెండు టీఎంసీల జలాల్ని ఎస్సారార్‌కు తరలించనున్నారు.

ప్రస్తుతం నీటి నిల్వలు ఇలా..

ప్రస్తుతం గోదావరిపై ఉన్న ప్రధాన జలాశయాన్ని తక్కువ నీటి నిల్వలతో ఉన్నాయి. గతంలో ఉన్న నిల్వల్ని వానకాలం పంటలకు అందించేందుకు చాలారోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నది. ఎస్సారార్‌లో ఉన్న నిల్వను లోయర్‌ మానేరు ద్వారా కాకతీయ కాల్వకు వదిలి వేలాది చెరువులను నింపుతున్నారు. ఎల్లంపల్లి జలాశయంలో 20.18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.63 టీఎంసీల నిల్వ ఉన్నది. దిగువన ఎస్సారార్‌లో 25.87 టీఎంసీలకుగాను కేవలం 4.36 టీఎంసీల నిల్వ ఉన్నది. లోయర్‌ మానేరు డ్యాంలో 24.07 టీఎంసీలకుగాను 10.43 టీఎంసీలు ఉన్నది. వీటితోపాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లోనూ నీటి నిల్వలు కావాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటర్లను ప్రారంభించింది.


logo