గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 00:37:05

జెనరిక్‌ ముసుగులో డ్రగ్‌ తయారీ

జెనరిక్‌ ముసుగులో డ్రగ్‌ తయారీ

  • రూ.7 కోట్లు విలువైన అల్ఫ్రాజోలమ్‌ స్వాధీనం
  • సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన గుంటూరువాసి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఎస్సీ చదివాడు.. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశాడు. చదువు, ఉద్యోగ అనుభవంతో సొంతంగా అల్ఫ్రాజోలమ్‌ను తయారుచేశాడు. కల్లు సొసైటీలతోపాటు మత్తుబాబులకు అక్రమంగా విక్రయిస్తూ సొమ్ముచేసుకొంటున్నాడు. పక్కా సమాచారంలో సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన గోవింద్‌రెడ్డి బీఎస్సీ చదివాడు. హైదరాబాద్‌కు వచ్చి ఓ ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఈ క్రమంలో రూ.కోట్లు సంపాదించాలని ఆశపడ్డాడు. చదువు, పనిచేసిన అనుభవం అతని ఆలోచనకు తోడైంది. వెంటనే ప్రకాశం జిల్లా త్రివంతకపురానికి మకాం మార్చాడు.

అక్కడ కొంత పొలం కొనుగోలు చేసి జెనరిక్‌ మెడిసిన్‌ తయారు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి పొందాడు. దీనిని అడ్డం పెట్టుకొని వివిధ మత్తు పదార్థాలకు సంబంధించిన ముడి సరుకులను సేకరించి వాటికి పలు రసాయనాలను జోడించి అల్ఫ్రాజోలమ్‌ను తయారుచేశాడు. కిలో రూ.3 లక్షల చొప్పున ఏపీ, తెలంగాణలో అమ్ముతున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో దాదాపు రూ.7 కోట్ల విలువైన అల్ఫ్రాజోలమ్‌ను నిల్వ ఉంచాడు. దీనిని అధిక ధరకు విక్రయించేందుకు యత్నిస్తుండగా, పక్కా సమాచారంతో సైబరాబాద్‌ పోలీసులు గోవింద్‌రెడ్డితోపాటు మరో ఏడుగురిని అరెస్టుచేశారు.


logo