మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 22:29:23

విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించండి

విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించండి

హైదరాబాద్ : విద్యార్థులకు విధించే శిక్షలు వారిలో పరివర్తన తెచ్చేవిగా ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. వరంగల్‌ నిట్‌కు చెందిన విద్యార్థులు గంజాయి వినియోగించిన కేసులో వారిని పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తూ జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌ ధర్మాసనం విలక్షణ ఆదేశాలను జారీచేసింది. విద్యార్థులు తమ తప్పును అంగీకరించినందున పరీక్షలు, తరగతులకు అనుమతించాలని, ప్రస్తుత విద్యాసంవత్సరం ముగింపు వరకు హాస్టల్‌, మెస్‌ అడ్మిషన్‌ను నిషేధించి క్యాంపస్‌ బయటకు పంపించాలన్నది. 

పిటిషనర్లు హన్మకొండలోని శ్రీరామకృష్ణ సేవాసమితి నిర్వహించే నారాయణసేవలో పాల్గొని పేదలకు సేవ చేయాలని ఆదేశించింది. దానివల్ల వారికి జీవితం అంటే ఏమిటో? సమాజంలోని పేదలతో పోలిస్తే తాము ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నామో? తెలుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు నిట్‌ సెనేట్‌ విధించిన శిక్షకు ధర్మాసనం పలు మార్పులు చేసింది. డ్రగ్స్‌ వినియోగం నేపథ్యంలో విద్యాసంస్థలు విద్యార్థులపై నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించింది. యాంటీ డ్రగ్స్‌ క్లబ్‌ను ఏర్పాటుచేసి.. విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.logo
>>>>>>