ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Dec 17, 2020 , 01:18:36

జూన్‌నాటికి అన్ని యూనిట్లు రెడీ

జూన్‌నాటికి అన్ని యూనిట్లు రెడీ

  • జెన్‌కో సాంకేతికతతోనే పూర్తిస్థాయిలో పనులు
  • ఇంజినీర్లు, ఆర్టిజన్లు, సిబ్బందికి అభినందనలు
  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు
  • శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం పనుల పరిశీలన

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లను జూన్‌నాటికి పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు. మంగళ, బుధవారాల్లో జెన్‌కో ఉన్నతాధికారులతో కలిసి శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బందితో పనులపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. శ్రీశైలం జల విద్యుత్‌ కేం ద్రం పునరుద్ధరణ పనులు పూర్తి భద్రతా ప్రమాణాలతో శరవేగంగా సాగుతున్నాయని ప్రకటించారు. ఇప్పటికే 2 యూనిట్లను పునరుద్ధరించి 300 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరునాటికి మరో యూనిట్‌ సిద్ధమవుతుందని, మార్చినాటికి మరో 2 యూనిట్లను ప్రారంభిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఎక్కువగా దెబ్బతిన్న నాలుగో యూనిట్‌ కూడా జూన్‌నాటికి అందుబాటులోకి వస్తుందని, ఈ యూనిట్‌ జనరేటర్‌, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే వానకాలం సీజన్‌ జూన్‌నాటికి మొత్తం 6 యూనిట్లను సిద్ధంచేసి రివర్సబుల్‌ పంపింగ్‌ ద్వారా 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అగ్ని ప్రమాదం వల్ల దెబ్బతిన్న భూగర్భ జల విద్యుత్‌ కేంద్రాన్ని పునరుద్ధరించడాన్ని సవాలుగా స్వీకరించామని, మరే ఇతర సంస్థల సహకారం తీసుకోకుండానే పూర్తిగా తెలంగాణ జెన్‌కో అధికారుల సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం, పనితీరుతోనే పునరుద్ధరణ పనులను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో భారీ వ్యయం తప్పిందని అన్నారు. ప్రమాదం జరిగిన నాటినుంచి పునరుద్ధరణ కోసం డైరెక్టర్లు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఇతర ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని, వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్లు సచ్చిదానందం, వెంకట్రాజం, అజయ్‌, జగత్‌రెడ్డి, జల విద్యుత్‌ కేంద్రం సీఈ ప్రభాకర్‌, ఎస్‌ఈ ఈగ హనుమాన్‌, జల విద్యుత్‌ కేంద్రం సీఈ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo