శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:08

ఆన్‌లైన్‌లో మరిన్ని రవాణా సేవలు

ఆన్‌లైన్‌లో మరిన్ని రవాణా సేవలు

  • మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన మంత్రి అజయ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ సేవలందించడంలో రాష్ట్ర రవాణాశాఖ మరో ముందడుగు వేసింది. కొత్తగా మరో 5 రకాల సేవలను ఆన్‌లైన్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీశాఖ సమన్వయంతో 1.డూప్లికేట్‌ ఎల్‌ఎల్‌ఆర్‌, 2. డూప్లికేట్‌ లైసెన్సు పొందడం, 3. బ్యాడ్జి మంజూరు, 4. స్మార్ట్‌కార్డు పొందడం (పాత లైసెన్సు ఇచ్చి కొత్తది తీసుకోవడం), 5. లైసెన్సు హిస్టరీషీట్‌ పొందడం వంటి సేవలను ప్రారంభించింది. పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం రవాణాశాఖలో ఐదురకాల ఆన్‌లైన్‌ సేవల్ని ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఇకనుంచి ఈ సేవలు పూర్తిస్థాయి ఆన్‌లైన్‌లోనే పొందచవచ్చని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదని కొన్ని రిజిస్ట్రేషన్‌ సేవలను ఆన్‌లైన్‌ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. 

దేశంలోనే తొలి రాష్ట్రం

దేశంలోనే బిగ్‌డాటా, ఏఐ, ఎంఎల్‌, డీప్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతతో కార్యాలయానికి వెళ్లకుండా సిటిజన్‌ సేవలను అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. వాహన పరీక్ష, భౌతికంగా తనిఖీచేయాల్సిన సేవలు మినహా రవాణాశాఖ అన్ని సేవలన్నీ కార్యాలయానికి వెళ్లకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో ఫెస్ట్‌ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఎం-గవర్నెన్స్‌, టీయాప్‌ ఫోలియో ద్వారా ఈ సేవల్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. లైసెన్సు, లెర్నింగ్‌ లైసెన్సు, పర్మిట్‌, రిజిస్ట్రేషన్‌ ఇలా మరో 12 రకాల ఆన్‌లైన్‌ సేవలను త్వరలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, జాయింట్‌కమిషనర్లు రమేశ్‌, మమతాప్రసాద్‌, టీఎస్‌టీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.logo