మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 11:48:32

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట‌: రేపు జ‌రుగనున్న దుబ్బాక ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. దుబ్బాకలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు ఉద్యోగులు చేరుకుంటున్నారు. మండలాల‌ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల స‌మాగ్రిని ఉద్యోగుల‌కు అందిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్య‌మ‌య్యింది. అక్టోబర్‌ 9న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపు (ఈనెల 3న‌) పోలింగ్‌ జరుగనున్నది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘నోటా’తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. ఒక్కో బూత్‌లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. రేపు పోలింగ్‌ నిర్వహించి, ఈనెల 10న సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌటింగ్‌ నిర్వహించనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున దివంగ‌త‌ రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత పోటీలో ఉన్నారు. ఇప్ప‌టికే ఉపఎన్నిక ప్ర‌చారం ముగిసింది. 20 రోజుల‌పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరుఫున ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.