సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:49

యూరియాపై ఆందోళనవద్దు

యూరియాపై ఆందోళనవద్దు

  • రాష్ట్రంలో అవసరమైనమేర అందుబాటులో
  • నెలాఖరుకల్లా కేంద్రం నుంచి రాష్ర్టానికి జూలై కోటా
  • ఎరువుల కొరత అంటూ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
  • కరోనా నేపథ్యంలో రైతులకోసం అన్ని ముందస్తు చర్యలు
  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన మేర ముందస్తుగానే అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతాంగంలో ఆందోళన కలిగించేలా కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని రైతులెవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా నేపథ్యం, వాతావరణ పరిస్థితులను అంచనావేస్తూ రైతులకోసం ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నదని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకారసంఘాలు, మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ వద్ద ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం 1.56 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని చెప్పారు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగానికి పలు మినహాయింపులతో వెసులుబాటు కల్పించారని.. రాష్ర్టానికి అవసరమైన ఎరువులపై కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నార ని తెలిపారు. ఈ వానకాలానికి అన్నిరకాల ఎరువులు కలిపి 22.30 లక్షల టన్నులు అవసరమని, ఇందులో 10.50లక్షల టన్నులు యూరియా అవసరమని చెప్పారు. ఈ మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, దీన్ని దశలవారీగా రాష్ర్టానికి తీసుకువస్తున్నామన్నారు. 

జూలై కోటాలో 1.06 లక్షల టన్నులు సరఫరా

కేంద్రం నుంచి జూలై కోటా రావడంలో ఆలస్యం కావడంతో సీఎం కేసీఆర్‌.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రితో స్వయంగా మాట్లాడారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. తానుకూడా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసి అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని కోరానన్నారు. స్పందించిన కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలు పెట్టిందని చెప్పారు. ఈ నెల కోటాలో 2.05లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. 1.06 లక్ష ల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నదని తెలిపారు. మిగిలిన మొత్తా న్ని ఈ నెలాఖరుకల్లా అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖపై సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో వ్యవసాయానికి తెలంగాణ ఇచ్చిన మినహాయింపులను గుర్తించిన కేంద్రం.. ఇతరరాష్ర్టాలూ అనుసరించాలని సూచించిందన్నారు. కరోనా సమయంలోనూ రైతుల పంటలను వందశాతం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 36 గంటల్లో 56 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.logo