మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 02:05:40

కరీంనగర్‌లో ఉధృతంగా స్క్రీనింగ్‌

కరీంనగర్‌లో ఉధృతంగా స్క్రీనింగ్‌

  • రెండోరోజు 50,910 మందికి థర్మల్‌ పరీక్ష
  • విదేశాల నుంచి వచ్చినవారికి ఎడమచేయిపై స్టాంపు 
  • 374 మందికి వేస్తాం: మంత్రి గంగుల వెల్లడి 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ ఉధృతంగా కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఇండోనేషియాకు చెందిన ఎనిమిది మంది మత ప్రచారకులు కరీంనగర్‌లో రెండురోజులు గడిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోరోజైన శుక్రవారం 13,428 గృహాల్లోని 50,910 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. 23 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. 11 మందికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండటంతో హోం క్వారంటైన్‌చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇప్పటివరకు 374 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించామని, వీరి ఎడమచేయిపై ప్రత్యేకస్టాంపు ముద్రించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

శనివారం సాయత్రంలోపు ఈ ప్రక్రియ పూర్తిచేసి గృహాలకు పరిమితం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు కార్పొరేషన్‌ పరిధిలో 950 మంది వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు, వైద్యబృందాల సర్వే, స్క్రీనింగ్‌ను మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంక, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, నగర కమిషనర్‌ క్రాంతి పర్యవేక్షించారు. 


logo
>>>>>>