మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:19

ఇంటర్‌ సెకండియర్‌లో అందరూ పాస్‌

ఇంటర్‌ సెకండియర్‌లో అందరూ పాస్‌

  • అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
  • కంపార్ట్‌మెంటల్‌ పాస్‌గా ప్రభుత్వం ప్రకటన
  • 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
  • 31లోగా కాలేజీలకు మార్కుల జాబితాలు
  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. గతనెల విడుదలచేసిన ఫలితాల్లో ఫెయిలైన సెకండియర్‌ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటన విడుదలచేశారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖంపట్టని నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మంత్రి తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైనవారిని కంపార్ట్‌మెంటల్‌ పాస్‌చేస్తామని చెప్పారు. మార్కుల జాబితాలో కంపార్ట్‌మెంటల్‌లో పాసైనట్టు ఉంటుందని వివరించారు.

ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ నెల 31 లోగా అన్ని జూనియర్‌ కాలేజీల నుంచి మార్కుల జాబితాను పొందవచ్చని మంత్రి తెలిపారు. మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నవారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని చెప్పారు. సెకండియర్‌లో కంపార్ట్‌మెంటల్‌ పాస్‌అయిన విద్యార్థులు త్వరలో జరిగే జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌, తదితర అన్ని జాతీయస్థాయి పరీక్షలకు హాజరుకావచ్చని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులు మాత్రం వచ్చేఏడాది మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల సమయంలో సప్లిమెంటరీ రాయాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేయడం, ఫెయిలైన సెకండియర్‌ విద్యార్థులను పాస్‌చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు హర్షం వ్యక్తంచేశాయి.


logo