శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:03:20

మీ ఆస్తికి మీదే అప్‌డేట్‌

మీ ఆస్తికి మీదే అప్‌డేట్‌

  • ఆస్తి వివరాల నమోదుకు  మీసేవ పోర్టల్‌లో అవకాశం
  • పాస్‌బుక్‌ల జారీ నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ నిర్ణయం
  • గ్రామాల్లో ఆస్తుల నమోదుకు  అపూర్వ స్పందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తులకు ప్రభుత్వం మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లు జారీచేయనున్న సంగతి తెలిసిందే. 15 రోజుల్లోగా ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అధికారులు ఇంటింటికీ తిరిగి ఆన్‌లైన్‌చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ఆస్తులు కలిగినవారు మీ సేవ పోర్టల్‌లో సొంతంగా వివరాలను అప్‌డేట్‌చేసుకోవాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతి యజమాని ఫోన్‌ నంబర్‌కు వివరాలు, లింక్‌ పంపిస్తున్నారు. లింక్‌ను ఓపెన్‌చేసిన తర్వాత ఫోన్‌ నంబర్‌, ఓటీపీతో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. కనిపించే ఆప్షన్స్‌లో జీహెచ్‌ఎంసీని ఎంపికచేసుకోవాలి. ఆ తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ను (పీటీఐఎన్‌) ఎంటర్‌చేస్తే వివరాలు వస్తాయి. యజమాని పేరు కనిపిస్తుంది. సరిగా ఉన్నదో లేదో సరిచూసుకోవాలి. 


పల్లెల్లో 56.6 లక్షల ఇండ్లు ఆన్‌లైన్‌

గ్రామాల్లో ఇండ్లు, ఆస్తుల ఆన్‌లైన్‌కు ప్రజలనుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. బుధవారం మధ్యాహ్నంవరకు మొత్తం 56.6 లక్షల ఇండ్లు ఆన్‌లైన్‌ రికార్డుల్లోకి ఎక్కాయి. ఇప్పటికే 95 శాతం వివరాలు ఆన్‌లైన్‌ అయ్యాయని, మరో 3 లక్షలు ఇండ్లు ఆన్‌లైన్‌చేస్తే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. మొన్నటివరకు ఈ- పంచాయతీ పోర్టల్‌లో నిర్మాణాల వివరాలను ఆన్‌లైన్‌చేశారు. తాజాగా టీఎస్‌ న్యాబ్‌ (నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌ యాప్‌)ను తీసుకురావడంతో ఈ- పంచాయతీ పోర్టల్‌లోని వివరాలన్నీ అందులో నమోదయ్యాయి. గత నెల 27వ తేదీవరకు సేకరించిన ఇండ్ల, ఆస్తుల వివరాలు యాప్‌లోచేరాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు యాజమాని ఫొటో, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌, కుటుంబసభ్యుల వివరాలు, విద్యుత్‌ బిల్లు, పన్నుల చెల్లింపు తదితర 56 అంశాలను నమోదుచేస్తున్నారు. ఇలా నిత్యం 70 నిర్మాణాల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు టార్గెట్‌ నిర్దేశించారు. 10వ తేదీలోగా పూర్తిస్థాయిలో ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని చెప్తున్నప్పటికీ, 5వ తేదీలోగానే ఆస్తుల అప్‌డేషన్‌ను పూర్తిచేయాలని బుధవారం కార్యదర్శులను అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. 8వ తేదీన ఆస్తుల జాబితా ప్రకటన, 15 వరకు అభ్యంతరాల స్వీకరణ, 23న తుది జాబితా ప్రకటించాలని ఉన్నతాధికారులు షెడ్యూల్‌ విడుదలచేశారు. ప్రస్తుత ప్రక్రియను ప్రాపర్టీ అసెస్‌మెంట్‌, ఇండ్ల కొలతలు, ఇంటి పన్ను మదింపు అంటూ వివిధ పేర్లతో పిలువడం వల్ల తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఇకనుంచి ఇంగ్లిష్‌లో ఎన్‌టైటిల్‌మెంట్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌, తెలుగులో ఆస్తుల నమోదు కార్యక్రమంగా పిలువాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 


logo