గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 16:27:08

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు చేయాలి

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు చేయాలి

మహబూబాబాద్ : వలస కూలీల ప్రయాణాలకు మినహాయింపు ఇచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే వలస కూలీలందరికీ కరోనా పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలని జిల్లా అధికారులను గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఇతర అధికారులతో జిల్లా పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు పరీక్షలు చేసిన వెంటనే లక్షణాలున్నట్లు ఏమాత్రం కనిపించినా వారిని క్వారంటైన్ చేయాలని, వారిపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. వలస కూలీలు ఇక్కడకు రావడంలో సరైన రవాణా లేకపోయినా, ఇక్కడి నుంచి వెళ్లే వారికి రవాణా వసతి లేకపోయినా వెంటనే తగిన ఏర్పాట్లు చేసి వారి గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు. జిల్లా గ్రీన్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు కావల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకునేటట్లు చూడాలన్నారు. జనాలు గుంపులుగా ఉండకుండా, భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

రైతు పండించిన పంటలో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని, రాజకీయాలు చేసే వారి ఉచ్చులో పడవద్దని మంత్రి  కోరారు. ఈసారి వానాకాలం పంటలలో ప్రభుత్వం సూచించిన లాభదాయకమైన పంటలు వేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 


logo