బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:30:36

మలయాళీలంతా టీఆర్‌ఎస్‌ వైపే

మలయాళీలంతా టీఆర్‌ఎస్‌ వైపే

  • హైదరాబాద్‌లోనే అత్యత్తమ మలయాళీ భవన్‌ 
  • మలయాళీల అత్మీయ సమ్మేళనంలో వినోద్‌కుమార్‌ 

కంటోన్మెంట్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని, నగరం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రతి ఎన్నికల్లో కారుకు అండగా నిలిచిన రాష్ట్రంలోని మలయాళీలు గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా అండగా నిలువాలని కోరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని భాంటియా గార్డెన్స్‌లో మలయాళీల అత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నగరంలో స్థిరపడిన మలయాళీలకు తెలంగాణవారితో సమానంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవకాశాలు, గుర్తింపు ఇస్తున్నదని చెప్పారు. 

హైదరాబాద్‌తో మలయాళీల విడదీయలేని బంధం

మలయాళీలు తెలంగాణ ప్రజలతో అరమరికలు లేకుండా కలిసిపోయారని వినోద్‌కుమార్‌ అన్నారు. నగరంలో ఇక్కడ స్థిరపడిన పేద మలయాళీలందరికీ ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ కేరళ భవన్‌ త్వరలోనే నగరంలో రూపుదిద్దుకోనున్నదని పేర్కొన్నారు. సిక్కులు, మలయాళీలు, గుజరాతీలు, సింధీ లు, మరాఠాలు, బెంగాలీలు.. ఇలా భిన్న ప్రాంతాల ప్రజలు తెలంగాణ ప్రజలతో కలిసి జీవిస్తున్నారని చెప్పారు. ‘గత ఆరేండ్లుగా ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందించింది. అన్ని వర్గాలకు చేయూత అందిస్తున్నది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశంతో సమూల మార్పులు జరుగుతున్నాయి’ అని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత ముప్పిడి గోపాల్‌, థామస్‌ జాన్‌, బెంజమిన్‌, విద్యా స్రవంతి పాల్గొన్నారు. 


logo