ఆదివారం 24 మే 2020
Telangana - Mar 19, 2020 , 23:58:07

ఆలయాలు బంద్‌

ఆలయాలు బంద్‌

-యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత

-రాజన్న ఆలయంలోనూ అంతే

-తిరుమలలో దర్శనాలకు టీటీడీ బ్రేక్‌

-శ్రీశైలం పాతాళగంగలో నో ఎంట్రీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాల వద్ద అధికారులు నిషేధాజ్ఞలు విధిం చారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. శుక్రవా రం నుంచి ఈ నెల 31వరకు బాలాలయం, పాతగుట్ట దేవాలయం,శివాలయంలో నిత్య కైంకర్యాలు, ఆర్జిత సేవలు, కల్యాణకట్ట, వ్రత పూజలు, అన్నదానం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. స్వామివారి లఘుదర్శనం, తీర్థప్రసాదాల వితరణ మాత్రమే ఉంటుందని స్పష్టంచేశారు. వేములవాడ రాజన్న ఆలయం లో దర్శనాలు, కోడె మొక్కులతోపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దుచేశారు. అనుబంధ దేవాలయాలైన భీమేశ్వరాలయం, బద్దిపోశమ్మ, నగరేశ్వరాలయాల్లో కూడా ఆర్జితసేవలు ఉండవని అధికారులు తెలిపారు. భద్రాచలం రా మాలయంలో శుక్రవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు, అన్నదానం, కల్యాణకట్టలను రద్దుచేశారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలకు మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం ఈవో నరసింహులు తెలిపారు. 

అలిపిరి టోల్‌గేట్‌ను మూసివేత

ఏపీలోని తిరుమలలో భక్తుల దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. గురువారం సాయంత్రం నుంచి అలిపిరి టోల్‌ గేట్‌ను మూసివేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాలను కూడా బంద్‌చేశారు. రాత్రివరకు కొండపై ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించి వారిని కిందికి పంపించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలలో దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి జరిగే ఏకాంత సేవలను అర్చకులు యథాతథంగా నిర్వహిస్తారని స్పష్టంచేసింది. శ్రీశైలం పాతాళగంగ స్నానాలను రద్దుచేశారు. భక్తులు కూడా రావొద్దని ప్రకటించారు. విజయవాడ దుర్గ గుడిలో ఈ నెల 31 వరకు అన్నిసేవలను నిలిపివేస్తున్నట్టు ఆలయ చైర్మన్‌ ప్రకటించారు. అన్నవరం సహా పలు ప్రధాన దేవాలయాల్లో అన్నప్రసాదాలను నిలిపివేశారు.  


logo