శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 16:18:03

స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : రాహుల్ హెగ్డే

స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : రాహుల్ హెగ్డే

రాజ‌న్న సిరిసిల్ల : మాన‌వ‌జాతితో పాటు స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ ఎస్పీ శుక్ర‌వారం త‌న క్యాంపు కార్యాల‌యంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్య‌మంలో పాల్గొన‌డం ద్వారా భ‌విష్య‌త్ త‌రాలకు కాలుష్య ర‌హిత వాతావ‌ర‌ణాన్ని అందించిన వాళ్ల‌మౌతామ‌న్నారు. ‌పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్న‌ట్లు తెలిపారు.

జాతీయ అటవీ సంరక్షణ సంస్థ సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉన్న‌దంటేనే సీఎం కేసీఆర్ చేపట్టిన హరిత హారం ప్రతిఫలం, అయన దూరదృష్టికి నిదర్శనమ‌న్నారు. భావితరాలకు కాలుష్యంలేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనంద‌రిపైనా ఉన్నదన్నారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మ‌రో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, నిజామాబాద్ జిల్లా సీపీ కార్తికేయ, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా ల‌కు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.