శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 04:38:06

ప్రజాబాంధవి.. ధరణి

ప్రజాబాంధవి.. ధరణి

  • ఒక్క క్లిక్‌తో సమస్త భూ సమాచారం
  • భూ రికార్డులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే
  • రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లూ అందులోనే
  • వీఆర్వో వ్యవస్థకు ప్రత్యామ్నాయం
  • ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డుకట్ట

భూ సంస్కరణలను చానలైజ్‌ చేయాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే 20వ శతాబ్దం నుంచే ఐటీ మొదలైనా, రెవెన్యూ వ్యవస్థలో దానిని ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ముందే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉంటే వ్యవస్థ ఇంత దారుణంగా ఉండేది కాదు. 

- సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూమి క్రయవిక్రయాలు సంబంధించిన లోపభూయిష్టమైన విధానాలకు ఇకపై చెక్‌ పడనున్నది. నూతన రెవెన్యూ చట్టంలో ధరణి వెబ్‌పోర్టల్‌ కీలకపాత్ర పోషించనున్నది. అవినీతికి తావులేకుండా, జాప్యం లేకుండా లావాదేవీలు పూర్తిచేస్తూ.. అధికారులకు పనిని సులువు చేస్తూ.. ప్రజా బాంధవిగా ధరణి పోర్టల్‌ అవతరించనున్నది. ప్రతి గ్రామంలోని భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వాటి ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నది. దీనికి భూముల రీ సర్వే ద్వారా వచ్చే అదనపు సమచారాన్ని జత చేస్తారు. ఫలితంగా ఒక వ్యక్తికి ఎంత భూమి ఉన్నది? ఎక్కడెక్కడ ఉన్నది? అప్పులు ఏమైనా ఉన్నాయా? వారసులు ఎవరెవరు? వంటి వివరాలన్నీ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఒక్క క్లిక్‌తో తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

సర్కారు భూములు ‘ఆటో లాక్‌' 

ప్రస్తుత చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని కొందరు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నట్టు తేలింది. విలీనానికి ముందు హైదరాబాద్‌ రాష్ట్ర పాలకులు జాగీరు, సంస్థాన్‌, మక్తా, పైగా, ఇనామ్‌ తదితర రూపాల్లో కొందరికి భూములను అప్పగించారు. వారు వాటిని సాగుచేసుకొని అనుభవించే హక్కు మాత్రమే ఉన్నది. అమ్ముకోవడానికి గానీ, మరణానంతరం వారసులు పంచుకోవడానికి గానీ హక్కు లేదు. జాగీరుల రద్దు చట్టంతో ఈ భూములన్నీ ప్రభుత్వ పరం అయ్యాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో భూమిపై హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం-1971, ఆ తర్వాత చేసిన కొన్ని చట్టాల్లో నిబంధనలు సడలించడంతో ఆ భూములు మార్పిడి చేయాలని, పాస్‌బుక్‌లు ఇస్తే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటామంటూ వినతులు వెల్లువెతాయి. ఈ క్రమంలో అక్రమాలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఆ భూములు ప్రభుత్వానివేనని కొత్త చట్టం స్పష్టం చేసింది. వాటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భూముల సర్వే నంబర్లన్నింటినీ ధరణి వెబ్‌సైట్‌లో ‘ఆటోలాక్‌' చేసేసింది. తద్వారా అన్యాక్రాంతం అయ్యే అవకాశం లేకుండా చేసింది. అటవీ భూములు, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, కాలువలు వంటి నిర్మాణాలు ఉండే పబ్లిక్‌ యుటిలిటీస్‌ భూములన్నీ ‘ఆటోలాక్‌' అవుతాయి. వాటికి రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. కాబట్టి ఆ భూములను కబ్జా చేసి, తమ పేరుమీదికి మార్చుకునే అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వ భూములపై కన్నేసే ల్యాండ్‌ మాఫియాకు చెక్‌ పెట్టినట్టు అవుతుంది. 

  • రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ ధరణి వెబ్‌సైట్‌ కీలకంగా వ్యవహరించనున్నది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల వివరాలు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంటాయి. ఒక్క క్లిక్‌తో అవి ఏ రకం భూములో తెలిసిపోతుంది. అంతేకాకుండా ఐదు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి చేసి, హక్కు పత్రాలను యజమాని చేతికి అందజేస్తుంది. భూముల క్రయవిక్రయాల వివరాలు సైతం పక్కాగా అందుబాటులో ఉంటాయి. 
  • పంట రుణాలు, భూమి తాకట్టు పెట్టి తీసుకునే రుణాల వివరాలు సైతం ధరణిలో యజమాని వివరాలతోపాటు నమోదై ఉంటాయి. కాబట్టి ఈసీ (ఇన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌) సర్టిఫికెట్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బ్యాంకర్లు సైతం వెబ్‌పోర్టల్‌లో చూసి వివరాలు తెలుసుకోవచ్చు. 
  • ధరణి వెబ్‌సైట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడేండ్లుగా కసరత్తు చేస్తున్నది. దీని ద్వారా ఇప్పటికే నాలుగు రకాల రెవెన్యూ సర్వీసులు, 12 రకాల రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త చట్టానికి అనుగుణంగా వెబ్‌సైట్‌లో మార్పులు చేయనున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. 

సమాచారం నిల్వలో ముందుజాగ్రత్త  

ధరణి పోర్టల్‌ రెవెన్యూతోపాటు రాష్ర్టానికే ఆయువుపట్టు వంటిది. కాబట్టి ఈ సమాచారాన్ని మల్టిపుల్‌ సర్వర్లలో, రాజధానితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ధరణిలోని వివరాలు సెక్రటేరియట్‌, అన్ని కలెక్టరేట్లలోని సర్వర్లతోపాటు దేశంలోని సురక్షిత ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా అత్యవసర సందర్భాల్లో ఒక సర్వర్‌ పనిచేయకపోయినా.. మరో సర్వర్‌ నుంచి వివరాలు సేకరించవచ్చు. 

దిగులు లేదు.. ధరణి ఉండగా!

లంచాలిచ్చే అవసరం ఉండదు.. రుణాలు రావన్న బాధ ఉండదు.. భూమి పోతుందన్న భయం ఉండదు.. కబ్జా చేస్తారన్న కలత ఉండదు.. మొత్తంగా అవినీతికి ఆస్కారమే లేదు.. ఇదీ! రైతన్నలకు, సామాన్యులకు నూతన రెవెన్యూ చట్టం ఇవ్వనున్న భరోసా. కాదు.. కాదు.. ‘ధరణి’ రూపంలోని బంగరు నిధి. ప్రజలకు మేలు జరగాలి.. ప్రభుత్వం లాభపడాలి.. అన్న ధృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టం ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపబోతున్నది. ప్రస్తుత చట్టాలతో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, రుణాలు పొందేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. పాస్‌బుక్‌లు పొందేందుకు నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తున్నదని, క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు ముట్టజెప్పాల్సి వస్తున్నదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూములకు సంబంధించిన మొత్తం వివరాలను ధరణి పోర్టల్‌ రూపంలో డిజిటలైజ్‌ చేశారు. దీంతో హక్కుల రికార్డుల నిర్వహణ ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్వహించే వెసులుబాటు కలిగింది. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పాస్‌పుస్తకం, మ్యుటేషన్‌ ఒకేచోట జరిగేలా, ఒక్క రోజులోనే జరిగేలా సవరణలు చేసింది. బ్యాంకులు ధరణి సహాయంతో రుణాల మంజూరు, పాస్‌బుక్‌ అప్‌డేట్‌ చేస్తాయి.  

పెరగనున్న పారదర్శకత

భూముల మార్పిడి, రికార్డుల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాల్లో అధికారులకు విచక్షాధికారాలు ఉండటం అవినీతికి బీజం వేసింది. కొత్త చట్టంలో ఈ విచక్షణాధికారాలను ప్రభుత్వం రద్దు చేసింది. ధరణి వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను మార్చే అధికారం ఎవరికీ లేదు. దీంతో పారదర్శకత పెరుగనున్నదని బిల్లులో ప్రభుత్వం పేర్కొన్నది. అటు.. గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ వీఆర్వోల ప్రాథమిక విధి. అయితే భూ సంస్కరణల్లో భాగంగా తప్పులను సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన చేస్తున్నది. రికార్డులన్నింటినీ డిజిటలైజ్‌ చేసి ధరణితో నిర్వహిస్తున్నది. దీంతో అనివార్యంగా వీఆర్వో పదవులను రద్దు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


logo