బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:09:13

గాంధీలో అన్నిరకాల వైద్యం

గాంధీలో అన్నిరకాల వైద్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దాదాపు 8 నెలలపాటు కొవిడ్‌ చికిత్సకే పరిమితమైన గాంధీ దవాఖాన ఈ నెల 21 లోగా అన్నిరకాల వైద్యసేవలు ప్రారంభించనున్నది. అందుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి గురువారం మార్గదర్శకాలు జారీచేశారు. కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కొవిడ్‌ సేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని సూచించారు. ఇతర దవాఖాన విధులు, అన్నిశాఖల టీచింగ్‌, ఇతర దవాఖానల అకడమిక్‌ పనులు ప్రారంభించాలని తెలిపారు. కొవిడ్‌ బాధితుల లోడ్‌ ఆధారంగా కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ వార్డులకు సిబ్బంది విభజన చేయాలని సూచించారు. గాంధీ దవాఖానను కొవిడ్‌ సేవలకే పరిమితం చేయడంతో పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని, మరోవైపు జూనియర్‌ వైద్యులు అకడమిక్‌ తరగతులు నష్టపోతున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రి.. గాంధీలో అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని డీఎంఈని ఆదేశించారు. ఈ మేరకు పూర్తి పరిశీలన అనంతరం కొవిడేతర సేవలు సైతం ప్రారంభించవచ్చని, అందుకు సరైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి ఈటల అంగీకారంతో డీఎంఈ.. గాంధీలో అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.