గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 01:51:06

జరిమానాలతో డిస్కంలకు ఉరి!

జరిమానాలతో డిస్కంలకు ఉరి!

  • పునరుత్పాదక ఇంధన వినియోగంపై నిర్ణయం కేంద్రానిదే
  • నిర్దేశించిన మొత్తాన్ని వినియోగించకుంటే భారీ పెనాల్టీలు
  • మొదటి ఏడాది యూనిట్‌కు 50 పైసలు.. ఆపై ప్రతిఏటా రెట్టింపు
  • కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లుతో అన్నీ అనర్థాలే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నేటి సమాజంలో కొన్ని సేవలు ఉచితంగా లభిస్తుండగా, కొన్నింటికి ధర చెల్లిస్తున్నాం. కానీ వినియోగించుకోని సేవలకు కూడా జరిమానా కట్టాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంటున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లులో డిస్కంలను ఇరుకున పెట్టే ఓ నిబంధనను చేర్చింది. పర్యావరణ పరిరక్షణ పేరిట చేర్చిన ఈ నిబంధన డిస్కంలను అధోగతిపాలు చేయనుంది.  డిస్కంలు తప్పనిసరిగా కొంతమేరకు పునరుత్పాదక ఇంధనం (రెన్యువబుల్‌ ఎనర్జీ)ని వినియోగించాల్సిందేనని ఆ బిల్లులో పేర్కొంది. కేంద్రం నిర్దేశించిన గరిష్ఠ పరిమితి మేరకు రెన్యువబుల్‌ ఎనర్జీని వినియోగించుకోకపోతే ఆ మిగిలిన మొత్తానికి యూనిట్‌కు 50 పైసల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆయా రాష్ర్టాల భౌగోళిక అంశాలు, విద్యుత్‌ ఉత్పాదన వనరులను పరిగణనలోకి తీసుకోకుండానే ఈ నిబంధనను చేర్చినట్టు తెలుస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే డిస్కంలకు ఈ నిబంధన గుదిబండగా మారి, ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని థర్మల్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది. 

రెన్యువబుల్‌ ఎనర్జీ పాలసీ

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2020లో పేర్కొన్న అంశాలు ఆ రంగంలో నిపుణులైన వారిని సైతం విస్తు గొలుపుతున్నాయి. ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజలకు మేలు చేయడంతోపాటు సదరు రంగానికి ఆర్థికంగా లబ్ధి చేకూరేవిధంగా ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు కేంద్ర సంస్థలకు మాత్రమే లాభం చేకూర్చేలా, రాష్ర్టాల్లోని డిస్కంలకు ఆర్థిక సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులోని సెక్షన్‌-3లో ‘రెన్యువబుల్‌ ఎనర్జీ పాలసీ’ గురించి ప్రస్తావించారు. దీని ప్రకారం విద్యుదుత్పాదనలో కాలుష్య కారకాలను సాధ్యమైనంత మేరకు నియంత్రించాలి. ఈ నిబంధనను అడ్డుపెట్టుకొని పునరుత్పాదన ఇంధన వినియోగంపై ఓ విధానాన్ని రూపొందించి, దానిని కచ్చితంగా అమలుచేసే అవకాశాలున్నాయి. ఈ విధానం అమలులోనే రాష్ర్టాల్లోని డిస్కంలు సతమతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

నిర్ణయం కేంద్రం చేతిలోనే

ప్రతిపాదిత విద్యుత్‌ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే.. ప్రతి డిస్కం ఏటా వినియోగించే విద్యుత్‌ మొత్తంలో తప్పనిసరిగా కొంతమొత్తంలో పునరుత్పాదక ఇంధనం ఉండాలని నిర్దేశిస్తారు. ఆ కొంతమొత్తం ఎంత అనేది కేంద్రంలోని సంస్థలే నిర్ణయిస్తాయి. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసే సూచనల ప్రకారమే ఆ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ క్రమంలో కేంద్ర సంస్థలు ఆయా రాష్ర్టాలోని భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలు, విద్యుత్‌ ఉత్పాదన వనరులు, డిస్కంల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటాయనేది అనుమానాస్పదమే. దీంతో స్థానికంగా ఉన్న థర్మల్‌, హైడల్‌ రెన్యువబుల్‌ ఇంధన ప్రాజెక్టులు ప్రభావితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టం ప్రకారం డిస్కంలు కూడా కేంద్రం ఆదేశించిన ప్రకారం నడుచుకోవాలి గనుక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను ఏ మేరకు వినియోగించుకుంటాయన్నది అగమ్యగోచరమే. అందువల్ల ఈ విషయంలో రాష్ర్టాలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి కేంద్ర సంస్థలు సుముఖంగా ఉండకపోవచ్చని తెలుస్తున్నది. 

ఏటేటా రెట్టింపు జరిమానాలు

డిస్కంలు ఎంతవరకు రెన్యువబుల్‌ ఇంధనాన్ని కొనుగోలు చేయాలో రాష్ర్టాల్లోని విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్సీ)లు నిర్ణయిస్తున్నాయి. నిర్దేశిత మొత్తంలో రెన్యువబుల్‌ ఎనర్జీని వినియోగించాలి అనడాన్ని ‘ఆర్‌పీపీఓ (రెన్యువబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌)’ అంటారు. ఉదాహరణకు 2019-20 సంవత్సరంలో ఆర్‌పీపీఓ ప్రకారం.. పునరుత్పాదక ఇంధన వినియోగం కనీసం 17.5 శాతం ఉండాలని కేంద్రం నిర్ణయించగా, తెలంగాణ ఈఆర్‌సీ 6.5 శాతం వినియోగించాలని తెలిపింది. కానీ మన డిస్కంలు ఎటూ కాకుండా సుమారు 10.51 శాతం వరకు వినియోగించాయి. కేంద్రం నిర్దేశించిన దానికంటే ఏడు శాతం తక్కువగా వినియోగించాయి. కొత్త చట్టం ప్రకారం.. ఇలా తక్కువ వినియోగించినందుకుగాను  యూనిట్‌కు 50 పైసల చొప్పున పెనాల్టీ వేస్తారు. రెండో సంవత్సరం కూడా పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంలో వెనుకబడితే.. ఆ ఏడాది యూనిట్‌కు రూపాయి చొప్పున జరిమానా విధిస్తారు. మూడో సంవత్సరం కూడా కొనసాగితే జరిమానా యూనిట్‌కు రూ.2 చొప్పున చెల్లించాలి. ఇలా ప్రతి సంవత్సరం జరిమానాను పెంచుకుంటూ పోతారు. 2019-20లో మన డిస్కంలు వినియోగించిన మొత్తం విద్యుత్‌ సుమారు 63వేల యూనిట్లు. ఇందులో రెన్యువబుల్‌ ఎనర్జీ ఏడు శాతం తగ్గింది. దానికి యూనిట్‌కు 50 పైసల చొప్పున జరిమానా విధిస్తే.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.220 కోట్లు కట్టాల్సి ఉంటుంది. డిస్కంలు ప్రజల అవసరాలు తీర్చినప్పటికీ  శిక్ష భరించాల్సి వస్తుంది.

మన విద్యుత్‌ ప్రాజెక్టుల ముప్పు

పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించడం మంచిదే కదా అని కొందరు వాదిస్తున్నారు. రాష్ర్టాల పరిస్థితులు, అవసరాలపై అవగాహన లేకుండా కేంద్ర సంస్థలు.. తప్పనిసరిగా తాము నిర్దేశించిన మేరకు పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించాలని నిర్ణయిస్తే.. ఆ మేరకు మనథర్మల్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. తెలంగాణలోని జల విద్యుత్‌ కేంద్రాలైన నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు అత్యంత చౌకగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఈ రెండూ పునరుత్పాదక ఇంధన పరిధిలోకి రావు. ఈ ప్రాజెక్టులు ఎన్నడో పూర్తయిపోయి.. వాటి పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)లు కూడా చేసుకున్నాం గనుక వాటిని పరిగణించరు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం ఇప్పటికీ పీపీఏలు చేసుకోని జల విద్యుత్‌ ప్రాజెక్టులు మాత్రమే జాతీయ ఇంధన విధానం పరిధిలోకి వస్తాయి. ఇలాంటి ప్రాజెక్టులు ఉత్తరభారతంలో భారీ సంఖ్యలో నిర్మితమవుతున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టులకు అనుకూలంగానే కొత్త బిల్లులో సదరు నిబంధనను చేర్చినట్టు విద్యుత్‌రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు బిల్లు ఆమోదం పొంది..పైన పేర్కొన్న నిబంధనలు అమలులోకి వస్తే రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంటుంది. ఈ ముప్పును తొలగించుకోవాలంటే పునరుత్పాదక విద్యుత్‌ను ఎంతమేరకు వినియోగించాలో నిర్ణయించే హక్కు డిస్కంలకు ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్రైవేట్‌ ఆపరేటర్ల బ్యాక్‌డోర్‌ ఎంట్రీ

అధికారాలను హస్తగతం చేసుకోవడం కోసమే కేంద్రం విద్యుత్‌ సవరణ బిల్లును తెచ్చింది. దశలవారీగా విద్యుత్‌ రంగాన్ని వికేంద్రీకరించిన ఫలితంగానే కరెంటు సామాన్యుడికి చేరువయ్యింది. క్రాస్‌ సబ్సిడీలపై నిర్ణయాధికారం కేంద్రం చేతుల్లోకి పోతే రాష్ర్టాల పాత్ర నామమాత్రంగా మిగులుతుంది. ప్రైవేట్‌ ఆపరేటర్లకు దొడ్డిదారిన అవకాశం కల్పించడం కోసమే ఈ బిల్లు తెస్తున్నట్లుగా అనుమానం కలుగుతున్నది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో ప్రైవేట్‌ సంస్థలకు ప్రయోజనం కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నది. - డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎక్స్‌పర్ట్‌

అందరికీ అన్యాయమే

విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తే అందరికీ అన్యాయం జరుగుతుంది. పేద, మధ్యతరగతి అన్న తేడాలేకుండా అందరిపై ఆర్థిక భారం పడుతుంది. రాష్ర్టాల్లోని స్థితిగతులు, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలపై కేంద్రానికి ఏ మాత్రం అవగాహన ఉండదు. అలాంటప్పుడు పర్యవేక్షణ కష్టం. రైతులకే కాకుండా చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు సైతం సబ్సీడీలు ఇవ్వలేం. ఈ బిల్లుపై కేంద్రం పునరాలోచించాలి.

- ముత్యం వెంకన్నగౌడ్‌, తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి

పారిశ్రామికాభివృద్ధి అన్నం పెట్టదు

ఈ బిల్లు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ర్టాల నుంచి హక్కులను లాక్కొని ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికే కేంద్రం తొందరపడుతున్నది. పారిశ్రామికాభివృద్ధి దేశానికి అన్నం పెట్టదు. పరిశ్రమలను ప్రొత్సహిస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా మొదట్లో 75 శాతంగా ఉన్న సాగు 25 శాతానికి దిగజారింది. ఈ బిల్లు కారణంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వకుంటే.. రైతులు బిల్లులు చెల్లించలేక వ్యవసాయానికి దూరమవుతారు. 

- వినోద్‌కుమార్‌, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్‌ ,ఇంజినీర్స్‌ అసొసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు


logo