గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 02:22:16

నదుల్లో అదే ఒరవడి... నిండుకుండల్లా జలాశయాలు

నదుల్లో అదే ఒరవడి... నిండుకుండల్లా జలాశయాలు

  • శ్రీశైలానికి మూడు లక్షలు దాటిన క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్‌కూ భారీగానే వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: కృష్ణా, గోదావరి.. ఒకటేమిటి! తెలుగు రాష్ర్టాల పరిధిలోని అన్ని నదుల్లోనూ వరద ఉధృతి కొనసాగుతున్నది. కుందూ, పెన్నా బేసిన్లలో భారీగా వరద వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను పెద్ద ఎత్తున కుదించుకున్నది. గత కొన్నిరోజులుగా కేవలం 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల స్థాయిలోనే నీటి విడుదల కొనసాగుతున్నది. పెన్నా బేసిన్‌కూ ఈ సారి భారీ వరదలు రావడంతో ఆ బేసిన్‌ పరిధిలోని ఏపీ రిజర్వాయర్లన్నీ నిండుకుండలా మారాయి. దీంతో కృష్ణాజలాల అవసరం లేకపోవడంతో ఏపీ అధికారులు శ్రీశై లం నుంచి పోతిరెడ్డిపాడుకు డిశ్చార్జిని పూర్తి గా తగ్గించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా సుమారు 90 టీఎంసీల నీటిని మళ్లించారు. వాస్తవంగా పెన్నా బేసిన్‌కు వరదలు రానట్లయితే ఇప్పటికే నీటి మళ్లింపు వంద టీఎంసీలు దాటి ఇంకా పరుగులు తీసేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. కాగా కృష్ణా బేసిన్‌లోని ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతల వరకు లక్షల క్యూసెక్కుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కాగా సోమవారం జూరాలకు రెండు లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తున్నది. తుంగభద్ర నుంచి 90 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద శ్రీశైలానికి పరుగులు తీస్తున్నది. శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో మూడు లక్షల క్యూసెక్కులు దాట గా.. అవుట్‌ఫ్లో కూడా దాదాపు అంతేమేర నమోదవుతున్నది. నాగార్జునసాగర్‌కు 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతేమేర దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల మీదుగా 2.80 లక్షల క్యూసెక్కుల కృష్ణాజలాలు ప్రకాశం బరాజ్‌ను దాటి సముద్రంలో కలుస్తున్నాయి. మరోవైపు గోదావరిలోనూ వరద ఉధృతి తగ్గలేదు. శ్రీరాంసాగర్‌కు 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతేమేర వరదను దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ఎల్లంపల్లి వద్ద ఇన్‌ఫ్లో ఏకంగా రెండు లక్షల క్యూసెక్కులు దాటింది.  సింగూరు ప్రాజెక్టుకు 15 వేల ఃక్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. 

పలు జిల్లాల్లో భారీ వర్షం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌ అర్బన్‌లో ఆదివారం రాత్రి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహించాయి. 


logo