బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 15:34:22

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం : మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం : మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ : జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధమైందని, రబీలో పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి శేఖర్‌ రెడ్డి, డీఎం సివిల్‌ సైప్లె నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. 

జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలోని 844 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ గ్రామాలుగా గుర్తించిన 563లలో మొదటగా 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకున్నాం. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అదేవిధంగా రైతుల ఆందోళన నేపథ్యంలో ఆ సంఖ్యను 340కి పెంచాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. కొత్తగా పెంచిన 104 కొనుగోలు కేంద్రాలతో పాటు రవాణా సౌకర్యం ఉండి రైతులు సమిష్టిగా ఒక్క దగ్గరకు చేరగలిగితే కల్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. జిల్లాలో మొత్తం లక్షా 26 వేల 450 హెక్టార్లలో వరిపంట సాగైనట్లు తెలిపారు. 5 లక్షల 96 వేల 960 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలతో పాటు ఎలక్ట్రానిక్‌ కాంటాలు, గిన్ని బ్యాగులను అధికారులు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలులో దళారులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ కేంద్రానికి ఒక ట్యాబ్‌ ద్వారా ఐడీ, పాస్‌వర్డ్‌ అందజేసి మిల్లర్లను, రైతులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. 

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ర్టాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్‌ మిల్లులు పనిచేసే విధంగా అధికారులు చూడాలన్నారు. ఎఫ్‌సీఐ గోదాంలు పూర్తి నిల్వ సామర్థ్యం లేనందున ఇతర ప్రాంతాలకు ధాన్యం నిల్వలు చేరవేయడం జరుగుతుందన్నారు.logo