కొత్త వైరస్‌పై అప్రమత్తం

- మౌలిక వసతులు సిద్ధంచేయాలన్న హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): కరోనా కొత్తరకం వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా నియంత్రణ, చికిత్స, ప్రైవేటు దవాఖానల అధిక ఫీజులపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. యూకే నుంచి వచ్చిన వారు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్టు మీడియాలో వచ్చిందని, వారందరినీ గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పొరుగు రాష్ర్టాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున తెలంగాణలో కూడా దానిని పరిశీలించాలని పేర్కొన్నది. కొత్త రకం వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
యూకే నుంచి వచ్చినవారిని గుర్తిస్తున్నాం: డీహెచ్
యూకే నుంచి రాష్ర్టానికి వచ్చినవారిలో 90 శాతానికి పైగా గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. గురువారం ఆయన విచారణకు హాజరయ్యారు. యూకే నుంచి వచ్చినవారిలో 21 మందిలో కరోనా పాజిటివ్ గుర్తించామని, వారందరికీ చికిత్స అందిస్తున్నామని వివరించారు.
ఒక్కరోజే 43 వేల టెస్టులు
రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నది. బుధవారం 43 వేలకుపైగా పరీక్షలు నిర్వహించగా, 415 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 91, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరిలో 39 కేసులు నమోదయ్యాయి. 316 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొవిడ్‌కు తోడు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు మృతి చెందారు. రికవరీ రేటు రాష్ట్రంలో 97.37 శాతంగా రికార్డవగా, జాతీయ సగటు 96 శాతంగా ఉన్నది.