శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 28, 2020 , 01:41:13

కరోనాపై అప్రమత్తం

కరోనాపై అప్రమత్తం
  • గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో ప్రత్యేక విభాగాలు
  • శంషాబాద్‌లో సెంట్రల్‌ మెడికల్‌ అథారిటీ స్క్రీనింగ్‌
  • హైదరాబాద్‌లో కరోనా లేదు
  • వదంతులు నమ్మవద్దు: ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ అంబర్‌పేట: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానితులకు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.  హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేశారు. చైనా తదితర కరోనా పీడిత దేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్నవారికి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ మెడికల్‌ అథారిటీ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఖచ్చితంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష  నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎవరికైనా వైరస్‌ లక్షణాలున్నట్టు అనుమానంవస్తే,  వెంటనే వారిని ఫీవర్‌, గాంధీ దవాఖానలకు తరలించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచ్చినవారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్‌ లక్షణాల్లేవని తేలిందని ఫీవర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడితోపాటు మరో నలుగురికి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో, వారిని  ఫీవర్‌ దవాఖానలో చేర్పించి, పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. ఈ ఐదుగురికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్‌టెస్ట్‌ నిర్వహించగా.. వారికి ఎలాంటి వైరస్‌ ఉన్నట్టు తేలలేదని చెప్పారు.  వారు ఇండ్లకు వెళ్లిన తరువాత జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో ముందుజాగ్రత్తగా బాధితులను దవాఖానలో చేర్పించి, ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో రెండు రోజులక్రితమే డిశ్చార్జ్‌ చేశామన్నారు. మరో ఇద్దరు వ్యక్తుల రక్తనమూనాలను పూణెలోని వైరాలజి విభాగానికి పంపించగా వారికి కూడా వైరస్‌ లేదని తేలిందని.. దీంతో సోమవారం డిశ్చార్జ్‌చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా అనుమానితులెవరూ ఫీవర్‌ దవాఖానలో లేరని  చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను ఆశ్రయించాలన్నారు.

గాంధీ దవాఖానలో 20 పడకల ప్రత్యేక వార్డు 

కరోనా అనుమానితులకు  ఫీవర్‌ హాస్పిటల్‌, గాంధీ దవాఖానల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యసిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందించనున్నట్టు డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ఎవరైనా అనుమానితులు లేదా బాధితరోగులు ఉంటే వారికి ముందుగా ఫీవర్‌ హాస్పిటల్‌లో చికిత్స అందించి, వ్యాధి నిర్ధారణ జరిగితే గాంధీలోని ఐసోలేటెడ్‌ వార్డుకు తరలిస్తామని వివరించారు. గాంధీలో స్వైన్‌ఫ్లూ బాధితులకోసం ఏర్పాటుచేసిన 20 పడకల ఐసోలేటెడ్‌ వార్డునే కరోనా రోగులకు వినియోగించనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.


నేడు ఢిల్లీ నుంచి సెంట్రల్‌ టీం రాక

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించడంతో ఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ అథారిటీ అప్రమత్తమైంది. గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేకవార్డులను పరిశీలించేందుకు సెంట్రల్‌టీం మంగళవారం నగరానికి రానున్నది. తొలుత ఈ బృందం సోమవారం వస్తున్నట్టు సంబంధిత అధికారులకు సమాచారం అందినప్పటికీ, పర్యటన మంగళవారానికి వాయిదాపడింది. ఉదయం దవాఖానల్లోని ప్రత్యేకవార్డులను పరిశీలించిన అనంతరం ఈ బృందం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నది. 


స్వైన్‌ఫ్లూ తరహాలోనే కరోనా

కరోనా వైరస్‌  కూడా స్వైన్‌ఫ్లూ మాదిరిగా ఒకరినుంచి మరొకరికి సోకే అంటువ్యాధి. రోగి తుమ్మినా, దగ్గినా వారి నోటినుంచి వెలువడే తుంపుర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వారు పీల్చి, వదిలే గాలి ద్వారా కూడా సోకుతుంది. దీనికి ప్రత్యేక చికిత్స లేదు. స్వైన్‌ఫ్లూ మాదిరిగానే ఐసోలేటెడ్‌ వార్డుల్లో ఉంచి వైద్యం అందించాలి.

- డాక్టర్‌ శంకర్‌, ఫీవర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌,  ఐపీఎం డైరెక్టర్‌


logo