ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:32:59

న్యూయార్క్‌లా హైటెక్‌సిటీ ప్రాంతం

న్యూయార్క్‌లా హైటెక్‌సిటీ ప్రాంతం

  • హైదరాబాద్‌ అభివృద్ధికి 2014 నుంచి 30 వేల కోట్లు
  • ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వానికి అభినందనలు
  • అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి 2014 నుంచి ఇప్పటివరకు రూ.30 వేల కోట్లకుపైగా వెచ్చించడాన్ని బట్టి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నగరంపై ఉన్న శ్రద్ధ అర్థమవుతున్నతని ఎంఐఎం ఎల్పీ నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రశంసలు కురిపించారు. హైటెక్‌సిటీ వైపుచూస్తే హైదరాబాద్‌ న్యూయార్క్‌ను తలపిస్తున్నదని చెప్తున్నారని, ఇది ప్రభుత్వం కృషికి నిదర్శనమని అభినందించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం స్వల్పకాలిక చర్చలో ఒవైసీ మాట్లాడుతూ ఐటీ సహా అనేకరంగాల్లో నగరం దూసుకుపోతున్నదని కొనియాడారు. భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌ షా ఆకాంక్షించినట్టు హైదరాబాద్‌ ప్రతిఒక్కరి గమ్యస్థానం అవుతున్నదని చెప్పారు. అంతర్జాతీయసంస్థలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని, భాగ్యనగరం భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకమమైనదని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనూ పనులు కొనసాగుతున్నాయని, ఈ పథకాన్ని ఇక్కడితో ఆపొద్దని కోరారు.

వరంగల్‌ అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్‌దే: ఎమ్మెల్యే దాస్యం

పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని, ప్రజలంతా ‘సిటీస్‌ బిఫోర్‌ కేసీఆర్‌ గవర్నమెంట్‌.. సిటీస్‌ ఇన్‌ కేసీఆర్‌ గవర్నమెంట్‌' అంటున్నారని విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. శాసనసభలో జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పట్టణప్రగతితో వరంగల్‌ రూపురేఖలు మారిపోయాయని, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరుచేశారని చెప్పారు. వరంగల్‌లో బస్తీ దవాఖానలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటును పరిశీలించాలని కోరారు.

సుంకిశాల నుంచి 40 టీఎంసీలు: ఎమ్మెల్యే దానం

హైదరాబాద్‌ నగర అభివృద్ధి, రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆలోచనలు చేస్తున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేర్కొన్నారు. సుంకిశాల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్‌ ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన ఇప్పటివరకు ఎవరూ చేయలేదని చెప్పారు. సుంకిశాల నుంచి రెండు దఫాలుగా 40 టీఎంసీల నీటిని తీసుకొస్తే హైదరాబాద్‌ ప్రజలకు 24 గంటలు తాగునీరు సరఫరా చేయొచ్చని సీఎం కేసీఆర్‌ చెప్పారని తెలిపారు. 

తాగునీటి సమస్య తీర్చాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌

ఆలోచన, ముందుచూపు లేకుండా 2007లో అప్పటి ప్రభుత్వం శివారు ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో కలిపిందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పేర్కొన్నారు. తాగు నీరు, విద్యుత్‌ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ లేక ఏండ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు నరకయాతన అనుభవించారని చెప్పారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.1,900 కోట్లతో శివారు ప్రాంతాల్లో ప్రజలకు సంతృప్తికరంగా తాగునీరు సరఫరాచేస్తున్న ఘనతను సొంతం చేసుకున్నదని చెప్పారు. ఎప్పుడో నిజాం సర్కారు  జంట జలాశాయాలను కట్టించారని, తర్వాత 60 ఏండ్ల చరిత్రలో హైదరాబాద్‌ ప్రజల దాహార్తి తీర్చడానికి తాగునీటి జలాశయం తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ ఒక్కరే ఆలోచన చేశారని పేర్కొన్నారు. త్వరలోనే కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపనచేస్తామని ప్రకటించిన కేటీఆర్‌కు నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 


logo