శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 13:16:06

సీఎం కేసీఆర్‌ ఉన్న గడ్డమీద పుట్టడం నా అదృష్టం

సీఎం కేసీఆర్‌ ఉన్న గడ్డమీద పుట్టడం నా అదృష్టం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అందరినీ  సమదృష్టితో చూస్తోందని, సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు.   'సీఏఏ కేవలం ముస్లింలకే కాదు..దేశంలోని పేదలందరికీ వ్యతిరేకం. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌) కు చట్టబద్ధత లేదని' అక్బరుద్దీన్‌ తెలిపారు.  పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్‌ పాల్గొని మాట్లాడారు.  

అందరినీ సమదృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్‌ ఉన్న గడ్డమీద పుట్టడం నా అదృష్టం. సీఏఏపై ఇంత ఖరాకండిగా తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోంది. పౌరుడి కాని వారికి పౌరసత్వం వస్తుంది. దేశ పౌరుడికి పౌరసత్వం పోతుంది. ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంది. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది.  ఎన్‌పీఆర్‌ తర్వాత ఎన్‌ఆర్‌సీ తీసుకురావడమే కేంద్ర లక్ష్యం. ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీఆర్‌ తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. 

రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను వాయిదా వేయాలని కోరుతున్నాం. పూర్తి వివరాలు అందించని వారిని డౌట్‌ఫుల్‌ కేటగిరిలో పెడతారు. డౌట్‌ఫుల్‌ సిటిజన్స్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. పౌరసత్వంపైన ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే ప్రొవిజన్‌ పెట్టారు. దీనివల్ల బ్లాక్‌మెయిలింగ్‌ కేసులు పెరుగుతాయి. దేశంలో 50శాతం మందికి సొంత ఇళ్లు లేదు అద్దె అడ్రస్సే వాళ్లకు దిక్కు.  ఒకే అడ్రస్‌పై రెండు, మూడు కుటుంబాలు ఉంటాయి. ఎన్‌ఆర్‌సీ ముస్లింలకే కాదు..ఎస్సీ, బీసీ, పేద వర్గాలకు వ్యతిరేకం. దేశంలో 70 శాతం మందికి బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు. 


logo