ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:49

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా..

నిరుద్యోగ  నిర్మూలనే లక్ష్యంగా..

మన పీవీ ఘనతలివీ 

నిరుద్యోగ సమస్యను నిర్మూలించే దిశగా పీవీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో ఉపాధికి పెద్ద పీట వేసింది. దేశానికి పెను సమస్యగా మారిన నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రణాళిక రూపొందించింది. మానవ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. మానవ వనరుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రైవేటుకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించింది. 1991 నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగానికి ఎక్కువ బడ్జెట్‌ కేటాయించి, ప్రైవేటు రంగంలో ఉపాధి పెంచే దిశగా చర్యలు తీసుకున్నది. 

అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మార్కెట్‌ ఆధారిత వ్యవస్థగా మారింది. ఆ సమయంలో.. పదేండ్ల కాలంలో భారీ స్థాయిలో ఉద్యోగవకాశాలు పెంచాలని పీవీ సర్కారు నిర్ణయించింది. అంతకుముందు రెండు దశాబ్దాల పాటు ఏటా 2.2 శాతం, కార్మిక శక్తి 2.5 శాతం పెరగ్గా.. ఏడాదికి 3 శాతం వృద్ధి సాధించేలా, కోటి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నది. ఉత్పత్తిని పెంచటం, తద్వారా ఆదాయాన్ని పొందటం లాంటి లక్ష్యాలతో ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. స్వయం ఉపాధి రంగాల్లో సాంకేతికతను మెరుగుపర్చటం, అసంఘటిత రంగంలో మార్కెట్‌ను పెంచటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా ఉపాధి, ఉద్యోగవకాశాలు పెరుగుతాయని పీవీ ప్రభుత్వం భావించింది. ఉద్యోగ అవకాశాలే కాకుండా.. ఉపాధిని మెరుగుపర్చేందుకు భిన్నమైన వ్యవసాయం, వాడుకలోని లేని భూమి సాగు, చిన్న స్థాయి పరిశ్రమల అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలో కేటాయింపులు జరిపారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిచ్చే పథకాన్ని(పీఎంఆర్‌వై) 1993లో ప్రవేశపెట్టారు. అదే ఏడాదిలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. గ్రామీణ మహిళల్లో పొదుపును ప్రోత్సహించడానికి ఎమ్‌ఎస్‌వై పథకాన్ని 1993లోనే తీసుకొచ్చారు.


logo