బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 15, 2020 , 01:53:49

అభ్యర్థుల్లేనిచోట టీఆర్‌ఎస్‌కే మద్దతు

అభ్యర్థుల్లేనిచోట టీఆర్‌ఎస్‌కే మద్దతు
  • ప్రకటించిన ఎంఐఎం పార్టీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు లేనిచోట తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతునివ్వాలని మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమిన్‌ (ఎంఐఎం) పార్టీ నిర్ణయించింది. కార్యకర్తలకు ఈ మేరకు సమాచారం పంపింది. శాసనసభ ఎన్నికలతోపాటు స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన మజ్లిస్‌ పార్టీ.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వెన్నంటి నిలవనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. దాదాపు 50 మున్సిపాలిటీల్లో సుమారు 300 మంది అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. 

తమ అభ్యర్థుల్లేని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తామని ఎంఐఎం నాయకులు తెలిపారు. మజ్లిస్‌ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తెస్తూ దేశాన్ని మతప్రాతిపదికన విభజిస్తున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిస్తున్నారు. ఏనాడూ మైనార్టీలకు అండగా నిలవని కాంగ్రెస్‌ పార్టీ వద్ద నోట్లు తీసుకున్నా.. ఓట్లు వేయొద్దని సూచిస్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్నారనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌కు మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్తున్నారు.


logo