ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 17:16:01

అఖిలపక్ష భేటీకి ఆహ్వానించకపోవడంపై అసదుద్దీన్‌ అసంతృప్తి

అఖిలపక్ష భేటీకి ఆహ్వానించకపోవడంపై అసదుద్దీన్‌ అసంతృప్తి

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. చైనాతో సరిహద్దు సమస్య అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి తమ పార్టీని పిలువకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అందులో పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన ఈ సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించకపోవడం వెనుక హేతుబద్ధమైన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఐదు మందికిపైగా సభ్యులున్న పార్టీలనే ఆహ్వానించడం సరికాదన్నారు. 

ఇలాంటి సమయంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాల్సి ఉంటుందని ఓవైసీ పేర్కొన్నారు. తమది చిన్న పార్టీ అయినప్పటికీ అధ్యక్షుడినైన తాను చైనా సమస్యపై ప్రశ్నించిన తొలి ఎంపీనని గుర్తు చేశారు. చైనాతో ఘర్షణ పరిణామాల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్‌ను సమావేశపర్చాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అసదుద్దీన్‌ కొన్ని ప్రశ్నలు సంధించారు. 2014 మే నుంచి భారత్‌ భూభూగాన్ని చైనా ఎంత ఆక్రమించింది? ఎంత మంది జవాన్లు అమరులయ్యారు వంటి 11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 

 


logo